మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

0
53

హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, రాజకీయ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య(88) కన్నుమూశారు. ఈ ఉదయం ఇంట్లో పల్స్‌ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని స్టార్‌ ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గంమధ్యలో ఆయన తుదిశ్వాస వదిలారు. ఉదయం 8.20గంటలకు రోశయ్య మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.

రాజకీయాల్లో విశేష అనుభవాన్ని గడించిన రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ పూర్తిచేశారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికైన రోశయ్య.. ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ సీఎంలందరి వద్ద పలు కీలకమైన శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా ఎమ్మెల్సీగా కొనసాగారు.

రోశయ్య నిర్వర్తించిన మంత్రిత్వ శాఖలు
1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు
1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ
1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్తు శాఖలు
1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు
1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు
2004, 2009లో వై.యస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు
1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షుడిగా పనిచేశారు.
1998లో నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

15 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత..
ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేశారు. 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇందులో చివరి 7 సార్లు వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేపట్టి.. 2016 ఆగస్టు 30 వరకూ సేవలు అందించారు.

Courtesy Eenadu

Leave a Reply