రాజాసింగ్‌పై ఫేస్‌బుక్‌ నిషేధం

0
254

  • ప్రమాదకరమైన వ్యక్తుల జాబితాలోకి!.. 
  • విమర్శల ఒత్తిడితో ఫేస్‌బుక్‌ నిర్ణయం
  • నా అధికారిక ఖాతా 2018లో హ్యాక్‌ అయింది
  • నాకో ఖాతా తెరవాలని కోరుతూ ఫేస్‌బుక్‌ నిర్వాహకులకు లేఖ: రాజాసింగ్‌
  • పక్షపాతం లేదు.. ద్వేషానికి తావివ్వం.. కాంగ్రె్‌సకు ఫేస్‌బుక్‌ స్పష్టీకరణ

హైదరాబాద్‌ : భారత్‌లో బీజేపీకి అనుకూలంగా ఉంటోందని, అధికారపార్టీ నేతలు పెడుతున్న విద్వేష పోస్టుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ తనపై వస్తున్న విమర్శల ఒత్తిడికి ఫేస్‌బుక్‌ తలొగ్గింది. తెలంగాణలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. హింసను, విద్వేషాన్ని ప్రోత్సహించరాదన్న తమ విధానాలను రాజాసింగ్‌ ఉల్లంఘించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి ఈ-మెయిల్‌ ప్రకటన ద్వారా తెలిపారు. ఫేస్‌బుక్‌ నిబంధనల ప్రకారం విస్తృత ప్రక్రియ అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థకు చెందిన వర్గాలు తెలిపాయి. గతంలో కూడా రాజాసింగ్‌ ఖాతాల్లోని విద్వేష పోస్టులను తొలగించిన ఫేస్‌బుక్‌.. ఈసారి ఆయన్ను ‘ప్రమాదకరమైన వ్యక్తులు/సంస్థలు’ జాబితాలో చేర్చింది. దీని ప్రకారం ఇకపై ఆయన ఫేస్‌బుక్‌, దాని అనుబంధ ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి పోస్టులూ పెట్టడానికి వీలుండదు.

ఆయనకు సంబంధించిన అన్ని పేజీలను, గ్రూపులను, ఖాతాలను (అభిమానులు నిర్వహించేవాటితో సహా) ఫేస్‌బుక్‌ తొలగిస్తుంది. ఆయనపై జరిగే చర్చను మాత్రం అనుమతిస్తుంది. కాగా.. తన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీ 2018లోనే హ్యాక్‌ అయిందని.. అప్పట్నుంచీ తనకు ఖాతాయే లేదని ఎమ్మెల్యే రాజాసింగ్‌ తెలిపారు. దీనిపై తాను అప్పట్లోనే హైదరాబాద్‌ పోలీస్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగానికి లేఖ రాశానని  చెప్పారు. ఆ తర్వాత మరో పేజీని ప్రారంభించినా దాన్ని 2019 ఏప్రిల్‌లో డిలీట్‌ చేశారని చెప్పారు. ఫేస్‌బుక్‌ సంస్థ కాంగ్రెస్‌ ఒత్తిడితో పనిచేస్తోందేమోని ఆయన అభిప్రాయపడ్డారు. హ్యాక్‌ అయిన తన ఫేస్‌బుక్‌ పేజీని ఓపెన్‌ చేయాలని ఫేస్‌బుక్‌ నిర్వాహకులకు ఆయన విజ్ఞప్తి చేశారు. వారి నిబంధనలన్నిటినీ పాటిస్తానని తెలిపారు. ఇప్పటివరకూ తన పేరిట అనధికారికంగా కొనసాగుతున్న ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను తొలగించి మంచిపనిచేశారని అన్నారు.

అలాంటివేం లేవు..
ఏ వ్యక్తీ లేదా రాజకీయపక్షం పట్లా తామెన్నడూ పక్షపాతంతో వ్యవహరించలేదని సామాజిక మాఽధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్‌ కాంగ్రెస్‌ పార్టీకి వివరణ ఇచ్చింది. ద్వేషాన్ని, మతవైరాన్ని తామెన్నడూ ప్రోత్సహించలేదని, అది తమ విధానమే కాదని స్పష్టం చేసింది. బీజేపీ నేతలపై మృదు వైఖరి కనబరుస్తూ పక్షపాతంతో వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌కు రెండు లేఖలు రాశారు. దీనికి స్పందించిన ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ పాలసీ, ట్రస్ట్‌, భద్రతా విభాగ డైరెక్టర్‌ నీల్‌ పాట్స్‌… తాము ఈ ఆరోపణలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని, నీతి నిజాయితీల్లో అత్యున్నత ప్రమాణాలను అనుసరించడానికి తాము కట్టుబడి ఉన్నామని వివరించారు. అటు బీజేపీ కూడా ఫేస్‌బుక్‌ తీరుపై అసంతృప్తిగా ఉంది. ‘ఫేస్‌బుక్‌ ఉద్యోగులు కొందరు ఎన్నికల్లో ఓడిపోయిన ఓ పార్టీకి అనుకూలంగా  పని చేస్తున్నారని, ప్రధాని, కేంద్ర మంత్రులపై బురద జల్లేట్లుపోస్టులు చేస్తున్నారని’ కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఫేస్‌బుక్‌ సీఈవోకు రాసిన లేఖలో ఆరోపించారు.

Courtesy Andhrajyothi

Leave a Reply