ప్రాణాలు తీసిన పంట అప్పు

0
399

రఘునాధపాలెం, కొండపాక: ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాక, పెట్టుబడికి చేసిన అప్పు తీర్చే మార్గంలేక మానసిక వేదనకు గురైన భార్యాభర్తలు కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సాగు, కూతుళ్ల వివాహం కోసం చేసిన అప్పులు భారమై మరో రైతు ఉరేసుకున్నాడు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండల పరిధి లచ్చిరామ్‌ తండాలో వాంకుడోత్‌ హేమ్లా(62), తులసి(58) దంపతు లకు రెండెకరాల భూమి ఉంది. మూడెకరాలు కౌలుతో పత్తి, మిర్చి పంట వేశారు.

ఈ ఏడాది మిర్చికి తెగులు సోకి నష్టపోగా,కోతుల దాడులతో పత్తి కూడా చేతికంద లేదు. దాదాపు రూ.5 లక్షల అప్పు కావడంతో తీవ్ర మనస్తాపంతో శుక్రవారం రాత్రి 9గంటలకు ఇంట్లోని కలుపు మందుతాగారు. బంధువులు గుర్తించి ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా శనివారంరాత్రి హేమ్లా, ఆదివారం ఉదయం తులసి మరణించారు. ఇద్దరు ఆడపిల్లలకు పెండ్లిండ్లు కాగా కొడుకు, కూతురు వికలాంగులు.

కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పి. సంతోష్‌ తెలిపారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మాత్‌పల్లిలో బచ్చలి ఎల్లయ్య(64) వ్యవసాయంపై ఆధారపడ్డాడు. పంట పెట్టుబడు లకు తోడు కూతుళ్ల వివాహం కోసం మొత్తంగా ఏడు లక్షలదాకా అప్పులు చేశాడు. దిగుబడి సరిగ్గా రాక, అప్పులు తీర్చలేనని భావించి ఇంటి వెనుక ప్రాథమిక పాఠశాలలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Courtesy Nava Telangana

Leave a Reply