నిత్య కృషీవలుడు

0
358

కరోనా కాలంలోనూ అన్నదాతల హక్కుల పోరాటంలో బిజీ
చదివింది పదో తరగతే..ఇంగ్లిష్‌పై పట్టు

సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు, అఖిలభారత కిసాన్‌ సభ

రైతు ఉద్యమంలో బలమైన గొంతుక సారంపల్లి మల్లారెడ్డి. ఆయనకి 83 ఏళ్లు. కరోనా కాలంలోనూ అన్నదాతల హక్కుల పోరాటంలో నిత్యం బిజీబిజీ. మల్లారెడ్డి మొక్కవోని దీక్ష ముందు కొవిడ్‌ సైతం తోకముడిచిందంటే అతిశయోక్తి కాదు. ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న సమయంలోనూ రైతాంగ సమస్యలపై ఆయన అధ్యయనం ఆగలేదు. మారుమూల పల్లెలో పదోతరగతి మాత్రమే చదివిన మల్లారెడ్డి ఇంగ్లి్‌షపై ఎలా పట్టుసాధించారు? కొవిడ్‌ అనుభవాలతోపాటు మరికొన్ని విశేషాలను  ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.

హైదరాబాద్‌ సిటీ: ఇది కరోనా కాలం. అంతటా ‘వర్క్‌ఫ్రం హోమ్‌’ మయం. ఇలాంటి సమయంలోనూ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోగల సీపీఎం ఆఫీసులో మల్లారెడ్డి ఆర్మ్‌ ఛైర్‌లో దిలాసాగా కూర్చొని, కంప్యూటర్‌ వర్క్‌లో మునిగిపోయారు. సేదతీరాల్సిన వయసులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కన్నా ఉత్సాహంతో కంప్యూటర్‌ ముందు కూర్చొని ఏమి చేస్తున్నారా.. అని ఆసక్తిగా ఆ స్ర్కీన్‌ వైపు చూస్తే.. వ్యవసాయ రంగానికి చెందిన కీలక డాక్యుమెంట్లు చదువుతున్నారు.  తాను రాస్తున్న ‘తెలంగాణలో వ్యవసాయ పరిస్థితులు-ప్రభుత్వ విధానాలు’ పుస్తకం కోసమని తర్వాత తెలిసింది. అప్పటికి మల్లారెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇరవై రోజులే. అయినా, ఆయన ముఖంలో అలసట, నిస్సత్తువ ఇసుమంతైనా కనిపించలేదంటే నమ్మండి.! ‘మీ ఆరోగ్య రహస్యం’ చెబుతారా అని అడగ్గా.. మల్లారెడ్డి నవ్వుతూ…‘నిత్యం జనం మధ్య ఉండటం. నిరంతరం పనిలో నిమగ్నమవడమే.!’ అని బదులిచ్చారు.

ఆయనకి జూలై 26న వైద్యపరీక్షలో కరోనా పాజిటివ్‌ అని తేలింది. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో గచ్చిబౌలిలోని ‘టిమ్స్‌’లో చేరారు. నాలుగు రోజులు వెంటిలేటర్‌పై చికిత్స పొందారు. అంతటి అనారోగ్యంలోనూ ఆస్పత్రికి వెళుతూ పుస్తకాలు తీసుకెళ్లడం మాత్రం మరవలేదు. ‘పాజిటివ్‌ వచ్చిందని తెలియగానే నేనేమీ భయపడలేదు. ప్రతి విషయాన్నీ అర్థం చేసుకోవడమే భయానికి విరుగుడు. కనుక సరైన సమయంలో ఆస్పత్రిలో చేరాను. బీవీ రాఘవులతోపాటు మా పార్టీ మిత్రులు కొందరు రెగ్యులర్‌గా నా కోసం పండ్లు పంపేవారు. మంచి ఆహారం తీసుకోవడం, రోజులో ఏడు గంటలు చదువుకోవడం, మిగతా సమయమంతా నిద్రపోవడం…ఆస్పత్రిలో ఇలా గడిచింది. టిమ్స్‌లో చికిత్స బాగుంద’ంటారు మల్లారెడ్డి.

కొవిడ్‌ సమయంలో..
‘‘కొవిడ్‌ చికిత్స సమయంలో ఆపిల్స్‌, ఆల్‌బుకారా, పాలు, బ్రెడ్‌, డ్రైఫ్రూట్స్‌ రెగ్యులర్‌గా తీసుకున్నా. ఆస్పత్రిలోని ఆహారం కూడా బాగుంటుంది. మొదట్లో ఉప్పు, కారం ఎక్కువనిపించాయి. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ నన్ను పరామర్శించేందుకు వచ్చినప్పుడు ఆ విషయం చెప్పాను. అప్పటి నుంచి భోజనంలో ఉప్పు, కారం తగ్గించారు. టిమ్స్‌లో రూమ్‌కి ఇద్దరే పేషెంట్లుంటారు. రోజుకి నాలుగుసార్లు బీపీ, షుగర్‌, ఆక్సిజన్‌ లెవల్స్‌ పరీక్షిస్తుంటారు. అర్ధరాత్రి కూడా ఒకసారి పరీక్షిస్తారు. మొదటి నాలుగు రోజులు నేను వెంటిలేటర్‌పై ఉన్నాను. తర్వాత ఆరోగ్యం కాస్త కుదుటపడింది. మిగతారోజులు పుస్తకాలతో పొద్దుపుచ్చాను. ముఖ్యంగా ‘భారతదేశంలో భూసంస్కరణల అమలుతీరు’పై డాక్యుమెంట్లను చదివి నోట్స్‌ రాసుకున్నా. ఇంటికొచ్చాక కూడా, కొవిడ్‌ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాలపై అధ్యయనం చేశాను. ‘తెలుగు రాష్ట్రాల నీటి తగాదాలు-పరిష్కార మార్గాల’పై ఆన్‌లైన్లో ఉపన్యసించాను. అలా రకరకాల పనులతో నిమిషం తీరిక లేకుండా, నాకిష్టమైన పనిలో నిమగ్నమయ్యా. అదే నా మానసిక ఉల్లాసానికి ప్రధాన కారణం’’ అని ఆయన చెబుతున్నారు.

పుస్తకాలు
వ్యవసాయ రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారానికి కేరాఫ్‌ సారంపల్లి మల్లారెడ్డి. ఆర్థిక విధానాలు, నీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, కమిషన్లు-మార్గదర్శకాలు, భూసంస్కరణోద్యమాలు, చట్టాలు..ఇలా సాగుకి చెందిన సమస్త విషయాలు, విశ్లేషణలపై అపార పరిజ్ఞానం ఆయన సొంతం. ఈ అంశాలపై ఇరవై పుస్తకాలు రచించారు. లాక్‌డౌన్‌లోనూ ఒక్కరోజు ఖాళీగా లేరంటే ఆశ్చర్యం కలగకమానదు. ‘‘రైతులు ఎదుర్కొనే సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశాను. ముఖ్యంగా కల్తీ విత్తనాలు, ఎరువుల కొరత, మార్కెట్‌ ధర, ప్రకృతి వైపరీత్యాలు, రుణాలు తదితర అంశాలపై వెబినార్‌లలో ఉపన్యసించాను. ఇందిరాపార్కు, సుందరయ్య విజ్ఞానకేంద్రం వద్ద ప్రత్యక్ష నిరసన కార్యక్రమాలలోనూ పాల్గొన్నాను. ‘తెలంగాణ రైతు’ యూట్యూబ్‌ చానల్‌ ద్వారా రైతు సమస్యలపై నా విశ్లేషణతో వీడియోలు రూపొందించాను. పీవీ సంస్కరణలతోపాటు మరికొన్ని అంశాలపై వ్యాసాలు రాశాను.

అవి పలు ప్రధాన పత్రికల్లో ప్రచురితమయ్యాయి. లాక్‌డౌన్‌లోనే భారతదేశంలో 1750 నుంచి 2020 వరకు సాగిన రైతాంగ పోరాటాల చరిత్రపై పుస్తకం రాశాను. ‘‘తెలంగాణలో వ్యవసాయ పరిస్థితులు-ప్రభుత్వ విధానాల’’పై ఇప్పుడు రాస్తున్నాను. పుస్తకాలు చదవడమంటే నాకు పిచ్చి. కేవలం మార్క్సిజమేకాదు.. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంతాలు, భాగవత, రామాయణం వంటి పురాణ గ్రంథాలనూ చదువుతాను. లాక్‌డౌన్‌లో నాకిష్టమైన రచనలు ‘కాకలుతీరిన యోధుడు’’, ‘‘బీళ్లు దున్నేరు’’, ఏకే గోపాలన్‌ ‘‘ప్రజాసేవలో’’, ‘‘భారతదేశంలో భూ సమస్య’’ పరిశోధనా పత్రం, ‘‘భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం’’ తదితర పుస్తకాలు చదివాను. సోషల్‌మీడియానూ ఫాలో అవుతుంటా. ఇంటర్నెట్‌ ద్వారా వ్యవసాయ శాస్త్ర సమాచారం సేకరిస్తుంటాను. నా పేరుతో ఒక బ్లాగు కూడా నడుపుతున్నా’’ అని మల్లారెడ్డి వివరించారు.

ముత్తాతనయ్యా..
రోజూవారీ జీవితం, ఆహార శైలి గురించి మల్లారెడ్డిని అడిగితే.. ‘‘లాక్‌డౌన్‌ ముందు వరకూ రెగ్యులర్‌గా గంట నడిచేవాడిని. కీళ్లనొప్పులు వంటి సమస్యలేమీ లేవు. నేనెక్కువగా నడవడానికే ఇష్టపడతాను. ఉదయం నాలుగు గంటలకు నా రోజు మొదలవుతుంది. కాలకృత్యాలన్నీ ముగిశాక, ఆ రోజు నేను చేయాల్సిన పనులను ప్లాన్‌ చేసుకుంటా. తర్వాత తెలుగు, ఇంగ్లిష్‌ పత్రికలను, ముఖ్యంగా ఎడిట్‌ పేజీ వ్యాసాలను క్షుణ్ణంగా చదువుతాను. చిరుధాన్యాలతో వండిన ఇడ్లీ, దోశ వంటివి టిఫిన్‌లో తీసుకుంటా. తర్వాత కచ్చితంగా 9.30కల్లా సీపీఎం ఆఫీసులో ఉంటా. రైతు సంఘంతోపాటు పార్టీ సమావేశాలు, చదవడం, రాయడం, రిపోర్టుల తయారీ, అధ్యయనాలు, నివేదికలు తదితర పనులతో సరిపోతుంది.

మధ్యాహ్నం రెండింటికి భోజనంలోకి వెజిటేరియన్‌ ఫుడ్‌ తీసుకుంటా. రాత్రి ఎనిమిదింటి వరకు ఆఫీసులోనే ఉంటా. రాత్రిపూట రాగిసంకటి తింటాను. వారానికొక రోజు మాత్రం నాన్‌వెజ్‌ ఉంటుంది. ఎనిమిదేళ్ల కిందట నేను ముత్తాతను అయ్యాను. మాది నర్సంపేట తాలూకా, తిమ్మంపేట విలేజ్‌. నా చిన్నతనంలో జొన్నగట్క, కొర్ర అన్నం, చేలపొంటి తిన్న పెసర్లు, జామకాయలు, రేగుపండ్లు, నేరేడు, ఉసిరికాయలు, తునిగిపండ్లు, ఇప్పపూలు బాగా తిన్నాను. ఐదో ఏడు వచ్చేదాకా తల్లిపాలు తాగినా. బహుశా! అందుకే ఆరోగ్యంగా ఉన్నాననుకుంటా(నవ్వుతూ…)’’ అని ఆయన బదులిచ్చారు.

అండర్‌గ్రౌండ్‌లో ఆంగ్లం
‘‘సుందరయ్య స్ఫూర్తితో వామపక్ష రాజకీయాల్లోకి వచ్చాను. తొలినాళ్లలో నేనూ సాగు చేశాను. పోలీస్‌ పటేల్‌గా, గ్రామ సర్పంచ్‌గా పనిచేశా. 1973 నుంచి పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే అంకితమయ్యాను. భూ పోరాటాలలోనూ పాల్గొన్నాను. మా రైతు సంఘం ఆధ్వర్యంలో నర్సంపేట, కొత్తగూడెం తదితర ప్రాంతాలలో సుమారు లక్ష ఎకరాలను రైతులకు అప్పగించగలిగాం. భూ సమస్యలపై పోరాడుతున్న సమయంలో నాపై పదిహేను సార్లు హత్యాయత్నం జరిగింది. నామీదా హత్యానేరం మోపిన సందర్భాలున్నాయి. ఆ క్రమంలో ఆరునెలలు జైలు శిక్ష అనుభవించాను. ఇదంతా అప్పటి ముచ్చట.

నేను చదివింది పదివరకే. కాంగ్రెస్‌, నక్సలైట్ల నుంచి నాకు ప్రాణహాని ఉండటంతో రెండున్నర ఏళ్లు అజ్ఞాతవాసంలో ఉన్నా. అప్పుడు ఇంగ్లిష్‌ సీపీఎం పార్టీ సైద్ధాంతిక పత్రాలను రోజూ చదివేవాడిని. అప్పుడే ఇంగ్లిష్‌ గ్రామర్‌కూడా నేర్చుకున్నా. అలా ఆంగ్ల పుస్తకాలు చదవడం, అనువదించడం అలవాటైంది. అండర్‌గ్రౌండ్‌లో నేర్చుకున్న ఆంగ్లం నా ఉద్యమ జీవితానికి ఎంతగానో తోడ్పడింది’’ అంటూ మల్లారెడ్డి ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. వయసు శరీరానికేగాని మనసుకు కాదనడానికి ఆయన జీవితమే నిదర్శనం. శ్రమ మాత్రమే మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దగలదు అనడానికీ మల్లారెడ్డి ఒక ఉదాహరణ. అందుకే ప్రజా ఉద్యమకారులంతా ఆయన్ని నిత్యకృషీవలుడిగా కొనియాడతారు.

Leave a Reply