- గుట్టలా పేరుకున్న అప్పులతో రైతు మనస్తాపం
- భార్య, కొడుకు, కూతురు సహా ఉరి
- 30 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు
- తీవ్ర నష్టం.. 13 లక్షల అప్పు.. మర్నాడే గడువు
- అప్పులోళ్లు వచ్చేలోపే చచ్చిపోవాలని నిర్ణయం
- కూతురికి పెళ్లయి ఏడాది.. గర్భవతి కూడా
- ఒకే చితిపై దహనం.. మంచిర్యాలలో విషాదం
కౌలు సాగును నమ్ముకుంటే నష్టాల పాల్జేసి.. అప్పులు మిగిల్చింది. అప్పులోళ్లు వదలరని, తీర్చడం తమ వల్ల కాదని, బతికుంటే పరువు పోతుందని ఆ ఇంటి పెద్ద, ఆయన భార్య, వారి ఇద్దరు పిల్లలు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నారు.
మంచిర్యాల : బతుకు దెరువు కోసం చేస్తున్న కౌలు సాగు ఆ రైతుకు తీరని నష్టాలను మిగిల్చింది. ఏకంగా రూ.13 లక్షల అప్పు అయింది. అంత అప్పును తీర్చడం అయ్యేపని కాదని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కుటుంబసభ్యులనూ బలవన్మరణానికి సిద్ధం చేశాడు. కూతురును అత్తారింటి నుంచి పిలిపించుకున్నాడు. బుధవారం రాత్రి రైతు, ఆయన భార్య, వారి కూతురు, కుమారుడు సామూహికంగా ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం మల్కేపల్లిలో ఈ విషాదం జరిగింది. జంజిరాల రమేశ్ (47)కు భార్య పద్మ (39), కూతురు సౌమ్య (20), కుమారుడు అక్షయ్ (17) ఉన్నారు. కూతురుకు గత ఏడాదే పెళ్లయింది. కుమారుడు పదో తరగతి చదువుతున్నాడు. రమేశ్ కౌలు రైతు. మల్కేపల్లి సమీపంలోని సోనాపూర్ గ్రామ శివార్లో 30 ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, ఇతర పంటలను సాగు చేస్తున్నాడు.
ఈ ఏడాది పత్తి సాగు చేస్తే వంద క్వింటాళ్ల పత్తి దిగుబడొచ్చింది. క్వింటాకు రూ.5,500 చొప్పున విక్రయించగా 5.5లక్షలొచ్చాయి. ఎకరాకు రూ.25 వేల చొప్పున రూ.2.5లక్షలు పెట్టుబడి ఖర్చుకుపోగా రూ.3 లక్షలే మిగిలాయి. అయితే కూతురు పెళ్లి, గతంలో సాగు కోసం చేసిన అప్పుతో కలిపి మొత్తం రూ.16 లక్షల అప్పయింది. అందులో 3 లక్షలను చెల్లించగా ఇంకా రూ.13 లక్షల అప్పు మిగిలే ఉంది. ఈ మొత్తాన్ని తీర్చేందుకు గురువారమే (మార్చి 25) గడువు ఉండటం.. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో అవమానాలు భరించాల్సి వస్తుందనే ఆందోళనతో ఆలోపే చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. హాజీపూర్ మండలం రాపల్లిలో అత్తవారింట్లో ఉన్న కూతురును రెండు రోజుల క్రితం ఇంటికి పిలిపించుకున్నాడు. బుధవారం రాత్రి అంతాకలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశారు. దానిపై రమేశ్, పద్మ, సౌమ్య, అక్షయ్ సంతకాలు చేశారు. తొలుత ఇద్దరు పిల్లలకు ఉరివేసి దంపతులిద్దరూ ఉరివేసుకొన్నట్లు తెలుస్తోంది.
అప్పులోళ్లు ఎవ్వరినీ విడిచిపెట్టరనే భయంతోనే
సొంతంగా ఎకరం పొలం ఉన్నా తమకు చచ్చిపోయే పరిస్థితి వచ్చేది కాదని సూసైడ్ నోట్‌లో రమేశ్ పేర్కొన్నాడు. తాము ఆత్మహత్య చేసుకుంటున్ననందుకు అన్న, వదిన, వారి పిల్లలు క్షమించాలని నోట్‌లో రాశాడు. అప్పు చెల్లించే వారందరికీ ఈనెల 25 తేదీ వాయిదా పెట్టానని, మధ్యతరగతి వాళ్లు ఇజ్జత్ పోతే బతకలేరని పేర్కొన్నాడు. ఆస్తి మొత్తం రూ. 10 లక్షల వరకు ఉంటుందని, కానీ అవి అమ్మినా అదనంగా మరో 7, 8 లక్షలు అప్పులుంటాయని, అవి తీర్చలేకనే ప్రాణాలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తాను లేకపోతే భార్యాబిడ్డలు బతకలేరని, అప్పుల వాళ్లు వారినీ విడిచిపెట్టరని అందుకే కుటుంబమంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నోట్‌లో రాశాడు.
13న ఘనంగా వివాహ వార్షికోత్సవం
రమేశ్ కూతురు సౌమ్యకు గత ఏడాది మార్చి 13న హాజీపూర్ మండలం రాపల్లికి చెందిన గూడ శ్రావణ్‌తో వివాహమైంది. ఇటీవలే వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు. సౌమ్య తల్లి కాబోతోందని తెలిసి రెండు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే సౌమ్య కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
Courtesy Andhrajyothi