
గత కొన్నేళ్ళుగా మన దేశంపై కార్పొరేట్- హిందూత్వ కూటమి పెత్తనం చెలాయిస్తోంది. ఇప్పుడు రైతులు సాగిస్తున్న పోరాటం ఈ పెత్తనానికి ముగింపు పలికే క్రమంలో ఒక పెద్ద ముందడుగు కాబోతున్నది. రైతులు, చేతివృత్తిదారులు, సాంప్రదాయ వృత్తులవారు, మత్స్యకారులు అందరూ నయా ఉదారవాద విధానాలకు అత్యంత దారుణంగా బలవుతన్న తరగతులు. వీరందరి వృత్తులను దెబ్బతీసే లక్షణం బడా పెట్టుబడికి ఉంది. ఆ విధంగా ఈ వృత్తులు దెబ్బ తినకుండా ఉండేందుకు ఏర్పరచుకున్న ఆంక్షలన్నింటినీ ఒక్కొక్కటిగా నయా ఉదారవాదం ఎత్తివేసింది. దాంతో బడా పెట్టుబడి దాడికి అడ్డూ, ఆపూ లేకుండాపోయింది. నయా ఉదారవాద విధానాలు కార్మికులపై సాగించే దాడి గురించి తెలిసినంతగా ఈ చిన్న ఉత్పత్తిదారుల మీద అది సాగించే దాడి గురించి అందరికీ తెలియదు.
ప్రభుత్వ జోక్యం ఎక్కువగా ఉండిన గత కాలంలో (అంటే నయా ఉదారవాద కాలానికి ముందు) చిన్న ఉత్పత్తిదారుల రంగాలకు రక్షణగా, వాటికి బడా పెట్టుబడి నుండి పోటీ లేకుండా, కొన్ని చర్యలు తీసుకున్నారు. కొన్ని రకాల ఉత్పత్తులను ఈ చిన్న ఉత్పత్తిదారులకే రిజర్వు చేసి వాటి లోకి బడా పెట్టుబడికి అనుమతి లేకుండా చేశారు. చేనేత రంగంలో ఇది మనకు స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా మన రైతులకు బైట ప్రపంచపు పోటీ నుండి రక్షణగా ప్రభుత్వం ఆ కాలంలో నిలబడింది. కనీస మద్దతు ధర, వివిధ రకాల సబ్సిడీలు అందించడం వంటి చర్యలు ఇందులో భాగమే. అయితే ఈ చిన్న తరహా ఉత్పత్తిదారులంతా ఒకే, ఏకరూప వర్గంగా లేరు. వారిలో వివిధ దొంతరలున్నాయి. అప్పట్లో ప్రభుత్వాలు ఈ చిన్న ఉత్పత్తి రంగాన్ని రక్షించేందుకు తీసుకున్న చర్యలు అందులోకి బడా పెట్టుబడి చొరబడిపోడానికి వీలు లేకుండా అడ్డుపడ్డాయి.
కాంగ్రెస్ హయాంలోనే నయా ఉదారవాద విధానాల అమలు మొదలైంది. కాని ఆ పార్టీ చిన్న ఉత్పత్తిదారులకు రక్షణగా ఉన్న వ్యవస్థను మొత్తంగా రద్దు చేయడానికి సిద్ధపడలేదు. కాకపోతే దానిని క్రమంగా బలహీనపరుస్తూ వచ్చింది. సబ్సిడీలను కుదించడం, మద్దతు ధరలను పెంచకపోవడం, వాణిజ్య పంటల విషయంలో రైతులకు అండగా నిలవకుండా మార్కెట్ శక్తుల దయాదాక్షిణ్యాలకు రైతులను విడిచిపెట్టేయడం వంటి పద్ధతులను అనుసరించింది. ఈ చర్యల ఫలితంగా వ్యవసాయం లాభసాటిగా లేకుండా పోయింది. కోలుకోలేనంత లోతుగా అప్పుల ఊబిలోకి రైతులు దిగిపోయారు. 1930 నాటి మహామాంద్యం కారణంగా ఇటువంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. నయా ఉదారవాద విధానాలు అమలు కావడం మొదలయ్యాక లక్షలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంత ఒత్తిడి రైతాంగం మీద ఉన్నప్పటికీ, ఇంకా పాత ‘రక్షణ’ చట్రం కొనసాగుతూనే వచ్చింది. ఆర్థిక వ్యవస్థ లోని ఇతర రంగాలలో నయా ఉదారవాద విధానాలు మరింత విస్తృతంగా అమలు జరిగాయి. కాని వ్యవసాయ రంగంలో మాత్రం బడా పెట్టుబడి విచ్చలవిడిగా కొల్లగొట్టడానికి కొంతమేరకు అవరోధంగా ఈ రక్షణ చట్రం పనిచేసింది.
ఆర్థిక సంక్షోభం వచ్చాక నయా ఉదారవాదం హిందూత్వ శక్తులతో జట్టు కట్టింది. సంక్షోభానికి ముందు కాలంలో ”ముందు పెట్టుబడిదారులు వృద్ధి చెందితే ఆ క్రమంలో సమాజంలోని ఇతర వర్గాల వారూ ఆ వృద్ధి ఫలాలను అనుభవిస్తారు” అన్న వాదనతో నెగ్గుకురాగలిగారు (దీనినే ట్రికిల్‌డౌన్ థియరీ అన్నారు). సంక్షోభం ఏర్పడ్డాక అసలు వృద్ధి అన్నదే లేకుండా పోయింది. దాంతో ఈ వాదన పనికిరాకుండా పోయింది. మరి వృద్ధి సాధ్యం కాని కాలంలో బడా పెట్టుబడిదారులు వృద్ధి చెందాలంటే చిన్న తరహా ఉత్పత్తిదారులను దెబ్బ తీసి వారి మార్కెట్‌ను కూడా బడా కార్పొరేట్లు చేజిక్కించుకోవడం ఒక తక్షణ అవసరం అయింది. మోడీ ప్రభుత్వం సరిగ్గా అందుకు దోహదపడే చర్యలనే తీసుకుంది. పెద్ద నోట్ల రద్దు వలన చిన్న ఉత్పత్తిదారులే అత్యధికంగా దెబ్బ తిన్నారు. ఆ తర్వాత తెచ్చిన జిఎస్‌టి యొక్క ప్రతికూల ప్రభావం కూడా ఈ రంగం మీదనే ఎక్కువగా పడింది. చివరగా ఈ మూడు వ్యవసాయ చట్టాలతో పాత రక్షణ వ్యవస్థను మొత్తంగా నాశనం చేయడానికి పూనుకుంది మోడీ ప్రభుత్వం. కనీస మద్దతు ధర, ప్రభుత్వ ధాన్య సేకరణ విధానం, ప్రజా పంపిణీ వ్యవస్థ అన్నీ ఉనికిలో లేకుండా పోతాయి. చివరకు ఇది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి లేకుండా పోయే పరిస్థితికి దారి తీస్తుంది. పైగా బడా పెట్టుబడి వ్యవసాయ రంగంలోకి చొరబడేందుకు వీలు కలుగుతుంది ( ప్రస్తుతం ఆహారధాన్యాల ఉత్పత్తిలో పూర్తి స్వయం సమృద్ధి ఉన్నట్టు భావించలేం. ఎందుకంటే ఇప్పుడు ఆహార ధాన్యల నిల్వలు ఎక్కువగా ఉన్నట్టు కనపడుతున్నా, దేశంలో చాలామంది కనీస అవసరాలకు సరిపడా తిండిగింజలను వినియోగించలేని దుస్థితిలో ఉన్నారు. ఈ వ్యవసాయ చట్టాలు అమలులోకి వస్తే పరిస్థితి ఇంకా దిగజారుతుంది).
ఈ మూడు వ్యవసాయ చట్టాలూ నయా ఉదారవాద విధానాలను రైతులపై పగబట్టినట్లు అమలు జరపడానికి దోహదం చేస్తాయి. అందుకే అమెరికన్ ప్రభుత్వం నుండి ఐఎంఎఫ్ దాకా అందరూ మోడీ లక్ష్యాలను సమర్ధిస్తున్నారు. వీరిలో ఎవరైనా, ఎక్కడైనా విమర్శలు చేసినా, అవి రైతుల ఆందోళన పట్ల మోడీ అనుసరిస్తున్న పద్ధతుల మీదే కాని ఆ చట్టాల మీద కాదు.
నయా ఉదార వాదం తాజా దాడికి లక్ష్యంగా ఇప్పుడు రైతులు, చిన్న ఉత్పత్తిదారులు ఉన్నారు. ప్రారంభంలో రైతులు కూడా, తక్కిన తరగతుల ప్రజానీకం మాదిరిగానే, సహనంతో, ప్రశాంతంగా ఈ దాడిని భరించారు. లక్షల సంఖ్యలో వారు ఆత్మహత్యలకు పాల్పడ్డారే గాని ఈ నయా ఉదారవాద దాడికి వ్యతిరేకంగా ఎటువంటి గట్టి ప్రతిఘటననూ ఇవ్వలేదు. అయితే ఈ వ్యవసాయ చట్టాలతో ఇక వారి ఓపిక నశించింది.
ప్రస్తుత రైతుపోరాటం విస్తృతి చాలా పెద్దది. వారి పట్టుదల కూడా చాలా గొప్పగా ఉంది. వాటితోబాటు ఈ పోరాటంలో మనం గుర్తించాల్సిన ముఖ్యమైన లక్షణాలు మూడు ఉన్నాయి. మొదటిది దాని దేశవ్యాప్త స్వభావం. ఇంతకు మునుపటి రైతు పోరాటాలు ఆయా ప్రాంతాలకు గాని, ఆయా రాష్ట్రాలకు గాని పరిమితమై జరిగాయి. కొన్ని ప్రత్యేక నిర్ణయాలకు, చర్యలకు వ్యతిరేకంగా జరిగాయి (నీటి తీరువా పెంచడం, విద్యుత్ చార్జీలను పెంచడం వంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా, లేదా కొన్ని రాయితీల, సబ్సిడీల కోసం). ఇప్పుడు సాగుతున్న పోరాటం భౌగోళికంగా ఉత్తర భారతదేశానికి పరిమితం అయినట్టు కనపడుతున్నా, అది ముందుకు తెచ్చిన డిమాండ్లకు దేశ వ్యాప్తంగా సానుకూల స్పందన లభిస్తోంది. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ తదితర ప్రాంతాలలో సైతం రైతుల యాత్రలు జరగడం దీనినే సూచిస్తోంది.
రెెండవది రైతుల వైఖరిలోనే వచ్చిన మార్పు. ఏదైనా ఒక ప్రజా ఉద్యమం విజయవంతం అయిందా లేదా అని చెప్పాలంటే ఆ ఉద్యమంలో పాల్గొన్న వారి వైఖరిలో ఏ మేరకు మార్పు వచ్చింది అన్నదానిని కొలబద్దగా తీసుకోవాలి. ఇంతకు ముందు కొన్ని నెలల క్రితం వరకూ ఒకరికొకరు వ్యతిరేకంగా వ్యవహరించిన భిన్న మతాల, భిన్న కులాల రైతులు, వ్యవసాయ కూలీలు ఇప్పుడు కలిసికట్టుగా ఈ మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇది మన దేశ రాజకీయ పరిస్థితిలో వచ్చిన పెనుమార్పునకు సంకేతం. 2014 లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి ఎక్కువ స్థానాలు ఉత్తరప్రదేశ్‌లో వచ్చినందువల్లనే ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. ఆ రాష్ట్రంలో ముజఫర్‌నగర్ ప్రాంతంలో జరిగిన అల్లర్ల వెనువెంటనే ఆ ఎన్నికలు జరిగాయి. ఆ అల్లర్ల ఫలితంగా ప్రజలు మతపరంగా రెండు ముక్కలుగా చీలిపోయారు. అప్పటి నుంచీ హిందూ జాట్‌లు, ముస్లింలు ఒకరికొకరు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఆ తేడాలన్నీ కనపడకుండా పోయాయి. ఈ పోరాటం వారందరినీ ఒకచోట చేర్చింది. వారిలో ఒక కొత్త ఐక్యతను తీసుకువచ్చింది.
ఉపా చట్టం వంటి దమననీతితో కూడిన చట్టాల వలన బిజెపి ప్రభుత్వపు దారుణ వేధింపులకు గురవుతున్న ఇతరుల పట్ల రైతు ఉద్యమం వ్యక్తం చేస్తున్న సానుభూతి, మద్దతు వారిలో వచ్చిన కొత్త మార్పును సూచిస్తోంది. కొద్ది వారాలముందైతే ఈ రైతు నిరసనకారులు బీమా కొరెగావ్ కేసులో అరెస్టయిన వారిగురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. కాని ఇప్పుడు వారిలో ఈ కేసులో నిర్బంధాన్ని ఎదుర్కుంటున్న వారిపట్ల ఎంతో సానుభూతి వ్యక్తం అవుతోంది. అటు రైతు ఉద్యమ నిరసనల్లో పాల్గొంటున్నవారి పట్ల పెద్ద ఎత్తున, అప్పటికప్పుడు సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి సహాయం అందించేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ముందుకు వస్తున్నారు. పారిశ్రామిక వాడల నుండి కార్మికులు కూడా అదేవిధంగా ముందుకు వస్తున్నారు. పోరాటం ప్రజలను ఐక్యం చేస్తుందనడానికి ఇది ఉదాహరణ.
మూడో ముఖ్యమైన లక్షణం ఈ పోరాటం నేరుగా నయాఉదారవాద విధానాన్ని ఢకొీనడం. ఈ మూడు వ్యవసాయ చట్టాలనూ రద్దు చేయాలన్నదే ఉద్యమం యొక్క డిమాండు కావొచ్చు. అయితే ఆ మూడు చట్టాల స్వభావం ఏమిటి? అవి నయా ఉదారవాద ఎజెండాను దూకుడుగా అమలు చేయడం కోసం తెచ్చినవి. అవి సామ్రాజ్యవాదుల కోర్కెలను తీర్చడం కోసం రూపొందినవి. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో సన్నిహితంగా పెనవేసుకునివున్న రెండు కార్పొరేట్ కుటుంబాలకు ఈ చట్టాలు నేరుగా తోడ్పడతాయి. ఈ చట్టాలు భారీ స్థాయిలో చిన్న ఉత్పత్తిదారులను దెబ్బతీసి ఆ రంగాన్ని చావుదెబ్బ తీస్తాయి.
ఈ చట్టాలను రద్దు చేయడమంటే నయా ఉదారవాద రథాన్ని వెనక్కు నెట్టడమే. ఇంతవరకూ వ్యవసాయ రంగంలో నయా ఉదారవాద మార్పులు చాలా అరకొరగా అమలు జరిగాయి. రాబోయే కాలంలో ఈ చట్టాల ఫలితంగా వచ్చే మార్పుల తీరే వేరుగా, తీవ్రంగా ఉండబోతుంది. అందుచేత ఈ చట్టాలను రద్దు చేయడమంటే ఒక కీలకరంగంగా ఉండే వ్యవసాయ రంగంలో నయా ఉదారవాదాన్ని వెనక్కు నెట్టడమే.
తన మితిమీరిన అహంకారం వల్లనే మోడీ రైతుల డిమాండ్ పట్ల మొండిగా వ్యవహరిస్తున్నాడని కొందరు భావిస్తున్నారు. రైతులకు ఏది మంచి చేస్తుందో ఆ విషయం గురించి రైతులకన్నా మోడీకే ఎక్కువ తెలుసు అన్న భ్రమను ఏదో ఒక విధంగా నిలబెట్టాలనే తాపత్రయం ఎక్కువైపోయినందువల్లనే మోడీ ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని కూడా భావిస్తున్నారు. అయితే ఈ విధమైన భ్రమను నిలబెట్టడం కేవలం మోడీ వ్యక్తిగత అహాన్ని సంతృప్తిపరచడం కోసం మాత్రమే కాదు. నయా ఉదారవాద ఎజెండా అమలు ముందుకు సాగాలంటే ఇటువంటి భ్రమ చెదిరిపోకుండా కాపాడుకోవడం అవసరం. ఈ దేశానికి ఏది మంచి చేస్తుందో అందరికన్నా మోడీకే ఎక్కువగా తెలుసు అన్న భ్రమ నిలబడితే, నయా ఉదారవాదం ఈ దేశానికి మేలు చేస్తుంది అని మోడీ చెప్పాక అదే అమలు జరగడం మంచిదని ఆ భ్రమలో ఉన్నవారంతా భావిస్తారు. అందుచేత మోడీకే అంతా తెలుసు అన్న భ్రమ అతనికి మానసిక సంతృప్తినివ్వడం మాత్రమే కాదు, నయా ఉదారవాద విధానాన్ని వేగంగా అమలు చేయడానికి కీలకంగా తోడ్పడుతుంది కూడా. అందుకే నయా ఉదారవాదం ఆ భ్రమను చెదిరిపోకుండా కాపాడేందుకే ప్రయత్నిస్తుంది. ఇప్పుడు రైతులు ఆ ‘భ్రమ’ అనే ‘గాలి బుడగ’కే బెజ్జం పెట్టారు. ఇప్పుడు ఆ చట్టాలను ఉపసంహరించుకుంటే ఆ బుడగలో గాలి ఏమాత్రమూ మిగలదు. నయా ఉదారవాదం వెనక్కు తగ్గడం అనివార్యం అవుతుంది. ఆ చట్టాలను ఒకసారి రద్దు చేసుకుంటే ఇక తిరిగి మళ్ళీ ప్రవేశపెట్టడం కుదరదు.
అందుకే ఈ ప్రభుత్వం ఆ చట్టాలలో ఎటువంటి మార్పులు కావాలో చెప్పమని, వాటిపై చర్చిద్దామని అంటోంది. అంటే ఆ చట్టాలు మాత్రం ఉండితీరాలి అని అర్ధం. అందుకే చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం ప్రకటిస్తోంది. చట్టాలు కొనసాగడానికి రైతులు ఒప్పుకుంటే వాటిలో ఎటువంటి మార్పులనైనా ప్రవేశ పెట్టడానికి తాను సిద్ధం అంటోంది ప్రభుత్వం. చట్టాలను కొనసాగించడానికి రైతులు అంగీకరించడం అంటే నయా ఉదారవాద ఎజెండాను వారు అంగీకరించినట్టే. దానిని అంగీకరించడం అంటే చిన్న ఉత్పత్తి రంగం మొత్తం నాశనం కావడాన్ని అంగీకరించినట్టే. అటువంటి వినాశనాన్నే కార్పొరేట్-హిందూత్వ కూటమి కోరుతోంది. అందుకే రైతుల డిమాండ్లను అంత గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు ఈ కూటమి ఎటువంటి చిక్కులో పడిందంటే దాని కళ్ళ ముందే ఆ కూటమి ఆధిపత్యం కరిగిపోనున్నది.
Courtesy Prajashakti