సగానికి సగం కోత!

0
569

* బడ్జెట్‌లో పేర్కొన్న లబ్ధిదారులు 64 లక్షలు
* వడపోతల తర్వాత 35 లక్షలు
* సొంత భూమి రైతులకు పిఎం-కిసాన్‌ దెబ్బ
* కౌల్దార్లకు రాష్ట్రం షరతులు
* తగ్గుతున్న భరోసా

నవరత్నాల హామీల్లో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం సమకూర్చేందుకు వైసిపి ప్రభుత్వం వచ్చే నెలలో ప్రారంభించనున్న రైతు భరోసా పథకం వడపోతలకు కసరత్తు జరుగుతోంది. స్కీం మార్గదర్శకాలపై మొన్న గురువారం జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం ప్రాధమికంగా అంచనాలు వేయగా ఇంతకుముందు సర్కారు ప్రకటించిన లబ్ధిదారుల సంఖ్యలో సగానికి సగం తగ్గనుంది. సొంత భూమి కలిగిన లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో కేంద్ర పథకమైన పిఎం-కిసాన్‌ గైడ్‌లైన్స్‌ను అమలు చేస్తుండటం, కౌలు రైతుల గుర్తింపునకు పలు షరతులు విధించడం అందుక్కారణంగా తెలుస్తోంది. కౌలు రైతులతో కలుపుకొని 64.07 లక్షల మంది సాగుదార్లు ఉన్నారని, వారందరికీ ‘భరోసా’ కల్పిస్తామని వైసిపి సర్కారు వచ్చీ రాగానే అసెంబ్లీలో ప్రతిపాదించిన వ్యవసాయ బడ్జెట్‌లో స్పష్టంగా పేర్కొంది. ఆ లెక్కల మేరకు సొంత భూమి కలిగిన వారు 48.7 లక్షలు కాగా, కౌలు రైతులు 15.37 లక్షలు. పక్కా లెక్కలతోనే అసెంబ్లీలో, బయటా ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి తరచు ఆ అంకెను చెబుతూ వచ్చారు. తీరా మార్గదర్శకాలు నిర్ణయించిన తర్వాత పరిశీలిస్తే ప్రభుత్వ ‘భరోసా’ లభించే రైతుల సంఖ్య సుమారు 35-36 లక్షలకు తగ్గనుందని సమాచారం. వడపోతలు, తీవ్రంగా జల్లెడ పట్టడం వల్లనే భారీగా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోంది.

పిఎం-కిసాన్‌ గణాంకాలు
సొంత భూమి కలిగిన రైతులకు భరోసా కల్పించే విషయంలో ‘పిఎం-కిసాన్‌’ మార్గదర్శకాలను వర్తింపజేయడంతోపాటు ఆ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసిన రియల్‌ టైం గవర్నెన్న్‌ సొసైటీ (ఆర్‌టిజిఎస్‌) డేటానే ‘భరోసా’కూ తీసుకుంటామన్నారు. సర్కారు ఇస్తామన్న రూ.12,500 సాయంలో ‘పిఎం-కిసాన్‌’ కింద ఏడాదికి మూడు విడతల్లో వచ్చే రూ.6 వేలు పోను, తతిమ్మా రూ.6,500 రాష్ట్ర సర్కారు ఇస్తుందన్నారు. ఈ నిర్ణయంతో హామీ ఇచ్చిన ‘భరోసా’కు నేరుగా కోత పెట్టారు. ఇక కేంద్ర గైడ్‌లైన్స్‌నే అమలు చేస్తుండటంతో లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో తగ్గుతోంది. పిఎం-కిసాన్‌ పథకానికి 43,03,595 మంది రైతులు అర్హులని తొలుత చెప్పారు. మొదటి విడత సొమ్మును (రూ. రెండు వేలు) 42,54,431 మంది ఖాతాల్లో కేంద్రం జమ చేసింది. ఆదిలోనే 49,164 మందిని తగ్గించింది. సరిగ్గా ఎన్నికలకు ముందు మొదటి విడత సొమ్ము జమ చేసింది. ఎన్నికలయ్యాక, కేంద్రంలో బిజెపి మళ్లీ అధికారంలోకొచ్చాక షరతుల పేరుతో కోతలు ప్రారంభమయ్యాయి. రెండవ తడవ సాయం 33,21,414 మంది రైతుల ఖాతాల్లోనే పడింది. మొదటి విడతకు, రెండవ విడతకు మధ్య 9,33,017 మందిని తగ్గించారు. మొన్ననే మూడవ విడత సాయం రైతుల ఖాతాల్లో జమ అయింది. ఈ సారి 29,45,601 మందికి మాత్రమే కేంద్ర సాయం జమ అయింది. రెండవ కిస్తు కంటే మూడవ కిస్తుకు లబ్ధిదారుల సంఖ్య 3,75,813 తగ్గింది. గైడ్‌లైన్స్‌ పేరుతో కేంద్రం ఏకంగా పదమూడున్నర లక్షల మందిని తగ్గించేసింది. రాష్ట్ర ‘భరోసా’కు ఆర్‌టిజిఎస్‌, పిఎం-కిసాన్‌ డేటాను తీసుకుంటామంటోంది ఎపి సర్కారు. అదే జరిగితే సొంత భూమి కలిగిన వారికి రాష్ట్రం ఇస్తామన్న 48.7 లక్షల నుంచి 29.45 లక్షలకు లబ్ధిదారుల సంఖ్య తగ్గనుంది.

కౌల్దార్ల పరిస్థితి
కౌలు రైతులకు కేంద్రం నయాపైసా ఇవ్వట్లేదు. అందుకే మొత్తం రూ.12,500 రాష్ట్రమే ఇస్తామంటోంది. కాగా భూయజమాని అంగీకారం, సామాజిక తరగతి ప్రాతిపదికన అగ్రవర్ణ కౌలు రైతుల మినహాయింపు, ఏ గ్రామంలో భూమిని ఆ గ్రామ కౌల్దారే లీజుకు తీసుకోవాలనడం, భూమి యజమాని ఎంత మందికి భూమిని లీజుకు ఇచ్చినా ఒక్క కౌల్దారుకే భరోసా సాయం ఇస్తామనడం, ఏక్‌సాల్‌ పట్టా, వక్ఫ్‌ భూముల సాగుదార్ల విషయంలో స్పష్టత లేకపోవడం వంటి వాటి వలన కౌలు రైతుల్లో భరోసా పొందే కౌల్దార్ల సంఖ్య బాగా తగ్గనుంది. సర్కారు 15 లక్షల మంది కౌలు రైతులకు భరోసా ఇస్తామనగా అస్సలు సెంటు కూడా భూమి లేని వారు ఏడు లక్షల మంది వరకు ఉంటారని ప్రభుత్వమే చెబుతోంది. భరోసాకు విధించిన షరతుల వలన వారిలో ఐదారు లక్షల మందికే సాయం దక్కనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వడపోతల వలన తొలుత ఇస్తామన్న 64 లక్షల మందిలో 35-36 లక్షల మందికే భరోసా లభించనుంది.

Courtesy Prajasakthi..

Leave a Reply