రాఫెల్‌ను మించిన భారీ స్కాం

0
209

– మోడీ పంటల బీమా పథకంలో భారీ కుంభకోణం దాగి ఉంది : కిసాన్ స్వరాజ్ సమ్మేళన్ లో సాయినాథ్

ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన పంటల బీమా పథకంలో భారీ కుంభకోణం ఉన్నదని సామాజికవేత్త పాలగుమ్మి సాయినాథ్‌ అన్నారు.
రాఫెల్‌ కుంభకోణంకన్నా ఇది అతి పెద్ద స్కాం అని ఆయన అభివర్ణించారు. ప్రధాని మోడీ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ రైతు వ్యతిరేకమైనవని ఆయన ఆరోపించారు.

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) పేరుతో చేపట్టిన ఈ పథకం ద్వారా రిలయన్స్‌, ఎస్సార్‌ గ్రూప్‌ బీమా సంస్థలకు వేలకోట్లు దోచి పెడుతున్నారని సాయినాథ్‌ విమర్శించారు. గుజరాత్‌లోని అహ్మదాబద్‌లో ఇటీవల జరిగిన కిసాన్‌ స్వరాజ్‌ సమ్మేళన్‌లో పాల్గొన్న సాయినాథ్‌ ఈ పథకంలోని మోసాన్ని బహిర్గతం చేశారు.

మహారాష్ట్రలోని ఓ జిల్లాను నమూనాగా తీసుకొని అధ్యయనం చేయగా, ఈ పథకంలోని మోసం బయట పడిందని ఆయన వివరించారు. మహారాష్ట్రలో దాదాపు 2 లక్షల 80వేలమంది రైతులు సోయా పంటను సాగు చేశారు. ఓ జిల్లాలో ఈ పంట వేసిన రైతులు ఈ పథకంలో చేరి తమ వంతుగా ప్రీమియం కింద రూ.19 కోట్ల 20 లక్షలు చెల్లించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా రూ.77 కోట్ల చొప్పున(రూ.154 కోట్లు) రిలయన్స్‌ ఇన్సూరెన్స్‌కు చెల్లించాయి. అంటే రైతుల ప్రీమియంతో కలిపి రూ.173 కోట్లు కంపెనీకి చెల్లించారు. ఆ సీజన్‌లో రైతులు వేసిన పంటలు పూర్తిగా విఫలమయ్యాయి. ఆ జిల్లాలో క్లెయిమ్‌ చేసుకున్న రైతులకు రిలయన్స్‌ రూ.30 కోట్లు మాత్రమే చెల్లించింది. అంటే రిలయన్స్‌కు ఈ పథకం కింద మిగిలింది రూ.143 కోట్లు. ఇది ఒక్క జిల్లాలోనేనన్నది గమనార్హం. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా రిలయన్స్‌ ఖాతాలోకి వందల కోట్లు జమవుతున్నాయనేందుకు ఇది ఓఉదాహరణ.

గత 20 ఏండ్లుగా దేశంలోని రైతులు సగటున రోజుకు 2000 మంది చొప్పున వ్యవసాయాన్ని వీడుతున్నట్టు సాయినాథ్‌ తెలిపారు. సొంతభూమి కలిగి ఉన్న రైతుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని ఆయన అన్నారు. రైతుల్లో 86 శాతం, కౌలు రైతుల్లో 80 శాతంమంది అప్పుల్లో కూరుకుపోయారని ఆయన వివరించారు. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 1995 నుంచి 2015 వరకు ఈ 20 ఏండ్లలో 3 లక్షల 10 వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన తెలిపారు. రెండేండ్లుగా బ్యూరో రికార్డులను మోడీ ప్రభుత్వం నిలిపి వేసిందని ఆయన విమర్శించారు.

రైతులకు సంబంధించిన వాస్తవాలను దాచి పెట్టాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని ఆయన మండిపడ్డారు. నవంబర్‌ 29, 30 తేదీల్లో పార్లమెంట్‌ ముందు చేపట్టే రైతు ర్యాలీని ఆయన గుర్తు చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులపై పార్లమెంట్‌లో కనీసం మూడు రోజులైనా చర్చించాలన్నది తమ డిమాండ్లలో ఒకటని ఆయన తెలిపారు. జీఎస్టీపై పార్లమెంట్‌లో అర్థరాత్రివేళ చర్చలు నిర్వహించిన ప్రభుత్వం రైతుల సమస్యలపై ఎందుకు చర్చించదని ఆయన ప్రశ్నించారు.

Leave a Reply