కంటిపాపలను కడతేర్చిన కన్న తండ్రి

0
172
  • ఇద్దరు చిన్నారులను బావిలో పడేసి దారుణం
  • ఆపై అతడూ రైలు కిందపడి ఆత్మహత్య

మహబూబాబాద్‌ రూరల్‌ : భార్యాభర్తల మధ్య తలెత్తిన స్పర్థలకు ఇద్దరు కన్నబిడ్డలు బలైపోయారు. ఆపై కసాయి తండ్రి కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్‌ మండలం గడ్డిగూడెంతండాలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన భూక్య రామ్‌కుమార్‌(31), శిరీష ఎనిమిదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)లో కానిస్టేబుల్‌. ముంబయిలో ఉద్యోగం. వీరికి కూతురు అమ్మి జాక్సన్‌(6), కుమారుడు జానీబెస్టో (3) సంతానం. నాలుగు రోజుల కిందట సంక్రాంతి పండగకని గడ్డిగూడెంతండాకు వచ్చాడు. సోమ, మంగళవారాల్లో భార్యాభర్తల మధ్య ఆర్థిక అంశాలపై గొడవ జరిగింది. భార్యపై చేయిచేసుకోవడంతో పిల్లలను అక్కడే వదిలేసి శిరీష పక్కనే ఉన్న పుట్టింటికి వెళ్లింది. అతడు పిల్లల్ని పొలం వద్దకు తీసుకెళ్లి వ్యవసాయ బావిలోకి తోసేశాడు. రామ్‌కుమార్‌ సోదరుడు భాస్కర్‌.. చేను వద్దకు వెళ్తూ పిల్లల గురించి అతణ్ని ఆరా తీశారు. వారిని బావిలో వేశానని చెప్పి రామ్‌కుమార్‌ ద్విచక్రవాహనంపై పారిపోయాడు. స్థానికుల సహకారంతో ఆయన పిల్లల్ని బయటకు తీయగా వారు అప్పటికే మృతి చెందారు. పిల్లలను బావిలో పడేసిన తర్వాత రామ్‌కుమార్‌ తండాకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని అనంతారం సమీపంలో రైల్వేట్రాక్‌పై కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Courtesy Eenadu

Leave a Reply