ఇద్దరి బలవన్మరణం

0
216
  • తాళలేక తండ్రి.. ఆ దిగులుతో కుమారుడు
  • రైతు కుటుంబంలో విషాదం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

చౌదరిగూడ : విధిది ఎంత నిర్దయ? యవుసం చేసుకొని ఉన్నంతలో సంతోషంగా బతుకున్న ఆ కుటుంబాన్ని అప్పుల ఉచ్చులో ఊపిరిసలపకుండా చేసింది. అప్పుల బాధకు రోజూ చస్తూ బతికే బదులు చావే శరణ్యం అనుకున్నాడు ఇంటిపెద్ద. చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరోచోట ఉన్న కుమారుడు ఈ విషాదం తెలిసి, తండ్రి లేని బతుకు తనకెందుకు అనే ఆవేదన చెంది తానూ ఉరేసుకొని చనిపోయాడు. ఇలా కుటుంబంలో ఒకేరోజు ఇద్దరు కోరి మృత్యువును కౌగిలించుకున్న విషాద ఘటన రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం జాకారంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఆగ్రామానికి చెందిన ఉగ్గి అంజయ్య (53)కు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఈ యాసంగిలో రెండెకరాల్లో వరి పంట వేశాడు. ఈ కుటుంబానికి లక్షల్లో అప్పులున్నాయి.

కొన్ని రోజులుగా ఆ అప్పుల గురించి మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. మంగళవారం సాయంత్రం తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకున్నాడు. అంజయ్య ముగ్గురు సంతానంలో చిన్న కొడుకైన ప్రవీణ్‌ కుమార్‌ (28) ఉద్యోగ అవకాశాల కోసం షాద్‌నగర్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నాడు. తండ్రి మరణవార్త తెలుసుకున్న అతడు, అక్కడి నుంచి ఇంటికి వెళ్లకుండా, మృతదేహాన్ని కూడా చూడకుండా నేరుగా పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ చెట్టుకు ఉరివేసుకున్నాడు. స్థానికులు చూసి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తండ్రి  మృతిచెందిన విషయాన్ని తట్టుకోలేక అతడిపై ఉన్న ప్రేమతోనే ప్రాణం తీసుకున్నాడని కుటుంబసభ్యులు వివరించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a Reply