ఏదీ సహకార సమాఖ్య స్ఫూర్తి?

0
412
ఎ. కృష్ణారావు

స్థిరఆస్తుల అమ్మకంపై టీడీఎస్ వసూలు చేయాలన్న ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఇది సమాఖ్య స్ఫూర్తికి, రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి వ్యతిరేకమని 2012 ఏప్రిల్ 12న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టి ఆరేళ్లయినప్పటికీ నరేంద్రమోదీ ఈ పన్నును ఉపసంహరించుకోలేదు! పైగా ఈ దేశంలోని మధ్యతరగతి పై తక్కువ వడ్డీరేట్ల తగ్గింపు, బ్యాంక్ చార్జీలు, పెట్రోల్, డీజిల్ పై 67 శాతం పైగా సుంకాలు మొదలైన వాటి రూపంలో మోదీ హయాంలో బాదుడు విపరీతంగా పెరిగింది, 2009 జనవరిలో జాతీయ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ (ఎన్ ఐఏ)ని ఏర్పాటు చేయడం కూడా సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని, రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోకుండా ఏకపక్షంగా చర్యలు తీసుకోవడానికి ఈ ఏజెన్సీని ఏర్పాటు చేశారని నరేంద్రమోదీ విమర్శించారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే ఎన్‌ఐఏ రాష్ట్రాల్లోకి చొచ్చుకుపోయి క్రియాశీలకంగా పనిచేయడం, భయోత్పాతం కల్పించడం తీవ్రంగా పెరిగిపోయింది. దేశంలో ఎవరినైనా అరెస్టు చేసే అధికారాల్ని బిఎస్ఎఫ్‌కు కల్పించడం, జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (ఎన్‌సిటిసి)ని ఏర్పాటు చేయాలనుకోవడం పై కూడా 2012 ఏప్రిల్ లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో నరేంద్రమోదీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ‘రాష్ట్రాల్లో సమాంతర రాజ్యం ఏర్పాటు చేయాలనుకుంటున్నారా?’ అని ప్రశ్నిస్తూ ఆయన మన్మోహన్ సింగ్‌కు లేఖ కూడా రాశారు. ఇవాళ దేశంలో రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర సంస్థలను ప్రయోగిస్తున్న తీరు మోదీ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. సిబిఐ పనితీరు వివాదాస్పదం కావడంతో కొన్ని రాష్ట్రాలు సిబిఐ విచారణకే అనుమతి నిరాకరించవలసి వచ్చింది. యుపిఏ ప్రభుత్వం మన సమాఖ్య స్ఫూర్తి మూలాల్నే దెబ్బతీస్తోందని నరేంద్రమోదీ 2012లో గుజరాత్‌లో బాబాసాహెబ్ అంబేడ్కర్ 121వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల్ని మునిసిపాలిటీలుగా మారుస్తున్నారని, కేంద్రం కీలక అంశాలపై తమతో చర్చించడంలేదని ఆయన మరో సందర్భంలో ఆరోపించారు. సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందన్న ఆవేదనతో ఆయన అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కూడా మంతనాలు సాగించారు. ఢిల్లీ సుల్తానులు దేశ సమాఖ్య స్వభావానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఢిల్లీలో ఒకే సుల్తాన్ రాజ్యమేలుతున్నట్లు కనపడుతోంది!

2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్రమోదీ పూర్తిగా గతంలో తాను చేసిన వ్యాఖ్యల్ని మరిచిపోయినట్లున్నారు. భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో ఆయన మొత్తం దేశాన్ని తన నియంత్రణలోకి తీసుకువచ్చేందుకు చేపట్టాల్సిన మార్గాల అన్వేషణలో పడ్డారు. ‘ఒకే దేశం- ఒకే సారి ఎన్నికలు, ఒకే మార్కెట్, ఒకే విధమైన చట్టాలు, చివరకు ఒకే పార్టీ, ఒకే వ్యక్తి పాలన’ పై ఆయన దృష్టిపడింది, ఈ క్రమంలో ఆయన రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ సంప్రదాయాల్ని, ప్రాంతీయ ఆకాంక్షల్ని కూడా పెద్దగా పట్టించుకోవాలనుకున్నట్లు కూడా కనపడడం లేదు. అంతటా ఒకే పార్టీ అధికారంలో ఉండాలన్న లక్ష్యంతో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టేందుకు వినూత్న మార్గాలు ఎంచుకున్నారు. రాష్ట్రాల్లో నేతల్ని తమ అదుపులో పెట్టుకునేందుకు సామ దాన దండోపాయాలను ప్రయోగించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన దృష్టిలో మునిసిపాలిటీలకన్నా తక్కువ స్థానానికి దిగజారిపోయాయి. రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో పేర్కొన్న అంశాలపై కూడా రాష్ట్రాల్ని ఏ మాత్రం సంప్రదించకుండా చట్టాలు చేసేందుకు బిజెపి సర్కార్ వెనుకాడడం లేదు. రాష్ట్రాల ప్రయోజనాలను ప్రభావితం చేసే బిల్లులపై సెలెక్ట్ కమిటీలకు నివేదించాలన్న ప్రతిపక్షాల వాదన అరణ్య రోదనగా మారింది. కొన్ని దశాబ్దాలుగా ప్రజల స్వేదంతో ఏర్పడిన ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి అనేక కీలక నిర్ణయాలను ఏకపక్షంగా అమలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.

సోమవారం రాజ్యసభలో గనులు, ఖనిజవనరుల సవరణ బిల్లుపై చర్చ జరిగినప్పడు 14 పార్టీల్లో అన్నాడిఎంకె, బిజూజనతాదళ్ సహా 11 పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. గనులపై రాష్ట్రాలకున్న హక్కుల్ని కేంద్రం స్వాధీనం చేసుకుంటూ రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ బిల్లును కనీసం సెలెక్ట్ కమిటీకైనా నివేదించమని కోరాయి. ఈ బిల్లు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్ట సమయంలో గనులను వేలం వేయకపోతే వేలం వేసే అధికారం కేంద్రానికే లభిస్తుంది. జిల్లా మినరల్ ఫౌండేషన్ ఏర్పాటు, అధికారాలు, నిధులు కేంద్రమే నిర్ణయిస్తుంది. కాప్టివ్ (స్వంత గనులు) అన్న పదానికే అర్థం లేకుండా చేసింది. ‘మేము రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాం. ఈ బిల్లు రాష్ట్రాల రాజ్యాంగ హక్కులకు సంబంధించింది. కనుక కనీసం దీన్ని సెలెక్ట్ కమిటీకి నివేదించండి. అక్కడ కూలంకషంగా చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోండి’ అని రాజ్యసభలో దాదాపు అన్ని పక్షాల నేతలు కేంద్రాన్ని కోరారు. ‘సహకార సమాఖ్య కావాలంటే రాష్టాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలి కాని ఉన్న అధికారాలను కబళించడం కాదు’ అని అన్నాడిఎంకె సభ్యుడు తంబిదురై అన్నారు. కేంద్రం తన వద్ద విశృంఖల అధికారాలు ఉంచుకోవడం సబబు కాదని, దేశ ప్రయోజనాల విషయంలో కేంద్రంతో పాటు రాష్ట్రానికి కూడా బాధ్యత ఉన్నదన్న విషయం మరిచిపోరాదని బిజూ జనతాదళ్ సభ్యుడు సస్మిత్ పాత్రా గుర్తు చేశారు. ఖనిజవనరులనేవి దేశ ప్రజల శాశ్వత ఆస్తులు, వాటిని దేశ ప్రయోజనాలకు సరిగా ఉపయోగపడేలా చూడాలి కాని కొద్ది మంది లాభం కోసం వాటిని తెగనమ్మరాదని,ఆ భూములపై నివసిస్తున్న గిరిజనుల ప్రయోజనాలను ఏ విధంగా పరిరక్షిస్తారని అనేకమంది ప్రశ్నించారు. ఢిల్లీలో కూర్చుని వేల మైళ్ల దూరంలో ఉన్న భూముల్లో గనుల గురించి మీరెలా నిర్ణయిస్తారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతకే, కేశవరావు ప్రశ్నించారు. ‘మా ప్రభుత్వాలు కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే, మాక్కూడా ప్రజల పట్ల బాధ్యత ఉన్నది.మీరు కేంద్రంలో ఉన్నంత మాత్రాన స్వర్గాన్నుంచి ఊడిపడలేదు’ అని కేకే వ్యాఖ్యానించారు. విచిత్రమేమంటే ఇప్పటికే నష్టపరిహారం, ఇతర అంశాలకు సంబంధించి 572 పెండింగ్ కేసులున్నందువల్ల ఈ బిల్లును ప్రవేశపెట్టడం సరైంది కాదని నీతీ ఆయోగ్, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ లేవనెత్తిన అభ్యంతరాలను కూడా కేంద్రం ప్రక్కకు పెట్టింది.

గనులు, ఖనిజ వనరుల బిల్లు విషయంలోనే కాదు, బీమా రంగంలో ఎఫ్ డిఐని 74 శాతం మేరకు అనుమతించాలన్న నిర్ణయంపై సెలెక్ట్ కమిటీకి నివేదించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ నూ అధికార పక్షం బుట్టదాఖలు చేసింది. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం పనిచేసేందుకు కొంత స్వేచ్చ కల్పించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా మళ్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలు అప్పజెబుతూ బిల్లును ఆమోదింపచేసింది. తమిళనాడులోఅసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏడు ఎస్‌సి ఉప కులాలను దేవేంద్రకుల వేలలార్ పేరుతో పరిగణించేందుకు బిల్లును రాజ్యసభలో ఆమోదిస్తే ప్రశ్నించే సాహసం కూడా ఎన్నికల కమిషన్‌కు లేకపోయింది! ఇది మన దేశంలో రాజ్యాంగ సంస్థల పనితీరుని స్పష్టం చేస్తోంది,

కేంద్ర రాష్ట్ర సంబంధాలను నిర్వచించిన జస్టిస్ సర్కారియా, జస్టిస్ ఎంఎం పూంఛీ సిఫారసుల గురించి ఇవాళ ఎవరూ మాట్లాడడం లేదు. అంతర్ రాష్ట్ర మండలి అనేది అర్థరహితంగా మారింది కేంద్ర రాష్ట్ర వివాదాలను పరిష్కరించే స్వతంత్ర సంస్థ అంటూ లేకుండా పోయింది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో పెద్దగా కలుగచేసుకునే అవకాశాలు కనపడడం లేదు. పైనాన్స్ కమిషన్ ఇచ్చిన గ్రాంట్లను కూడా కేంద్రం ఏదో దానం చేస్తున్నట్లుగా భావిస్తోంది. జీఎస్టీ నష్టపరిహారం విషయంలో ఇచ్చిన హామీలను ఉపేక్షించి అప్పులు చేసుకోవడానికి కూడా కేంద్రం విధించిన షరతులకు లోబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీఎస్టీ కౌన్సిల్ లో కూడా కేంద్ర, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేకపోతే, కేంద్రానికే తుదినిర్ణయాధికారం ఉంటుంది. సిబిఐ అనేది రాజకీయాల మయమై తన విశ్వసనీయత కోల్పోయిందని, కేంద్రం రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకుని ఇలాంటి సంస్థల ప్రతిష్టను కాపాడాలని ఆడ్వాణీ హోంమంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న జికె పిళ్లై అన్నారు.

పంటభూములు, గనులు, ఖనిజ వనరులు, ఓడ రేవులు, ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలు అన్నిటినీ బడా ప్రైవేట్ వ్యాపారులకు ధారా దత్తం చేసి, ప్రత్యర్థులను బలహీనపరిచి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను నిర్వీర్యం చేసి, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కాలరాచి మొత్తం దేశంపై పట్టును నరేంద్రమోదీ తన గుప్పిట్లో ఉంచుకోవాలనుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నప్పటికీ ఆయనతో పోరాడేందుకు దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి బలోపేతమయ్యే అవకాశాలు కనుచూపులో కనపడడం లేదు, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ బిజెపిని అడ్డుకోవడానికి ఇదే ఆఖరి పోరు అన్నట్లుగా పోరాడుతున్నారు, రెండు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. దేశంలో బిజెపియేతర పార్టీలన్నీ ఇదే రకంగా సంఘటితమై సర్వశక్తులు ఒడ్డితే తప్ప మోదీ ని ఢీకొనడం అంత సులభం కాదేమో. చరిత్రలో ఇలాంటి పరిణామాలకు కూడా దృష్టాంతాలు లేకపోలేదు,

Courtesy Andhrajyothi

Leave a Reply