ఇండియాలో అసాధారణంగా లింగ నిష్పత్తి

0
629

– అంతర్జాతీయ సగటు 105 ఉంటే.. మనదగ్గర 116

న్యూఢిల్లీ : అంతర్జాతీయ స్థాయితో పోల్చితే ఇండియాలో లింగ నిష్పత్తి చాలా అసాధారణంగా ఉందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. మధ్య తరగతి, ధనిక కుటుంబాల్లో…మగపిల్లాడే కావాలనే ఆకాంక్ష ఎక్కువగా ఉందని, ఇందుకోసం చట్టాన్ని ఉల్లంఘించడానికి సైతం వెనుకాడటం లేదని అధ్యయనం తెలిపింది. మొదటి ప్రసవంలో ఆడ శిశు జననం జరిగిన కుటుంబాలు..రెండో ప్రసవంలో మగ సంతానం కలగాలన్న తాపత్రయం ఎక్కువగా ఉందని, దానివల్ల ఇండియాలో పెద్ద సంఖ్యలో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని ‘ ఇండియాస్‌ ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌’, ‘యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా’ (శాన్‌డియాగో సెంటర్‌) సంయుక్తంగా విడుదల చేసిన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. రెండో, మూడో ప్రసవం వద్ద లింగ నిష్పత్తి గణనీయంగా పడిపోయిందని, ఇండియాలో 100 ఆడ శిశు జననాలకు…116 మగ శిశు జననాలున్నాయని వీరి అధ్యయనంలో తేలింది.

మొదటి ప్రసవంలో, ఉత్తరాది రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి చాలా దారుణంగా ఉంది. మనకు మగ పిల్లాడు లేడు, వారసుడు లేడు..అనే భావన ధనిక, మధ్య తరగతి కుటుంబాల్లో ఎక్కువగా కనపడింది. ప్రతి 100మంది ఆడ శిశువులకు ఉత్తర భారతంలో 116మంది మగ శిశు జననాలు చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమ భారతంలో లింగ నిష్పత్తి 111.4, మధ్య భారతంలో 109.2, దక్షిణాదిన 107.5, ఈశాన్యంలో 105.8గా ఉంది. గ్రామాల్లో లింగ నిష్పత్తి 108.8 ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 111.4గా నమోదైంది. సాధారణ పరిస్థితుల్లో అంతర్జాతీయంగా లింగ నిష్పత్తి 105 ఉండగా, దానికంటే మనదేశంలో చాలా ఎక్కువగా కనపడుతోంది. ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాల్లో మగ సంతానంపట్ల ఆపేక్ష ఎక్కువగా ఉందని అధ్యయనం తేల్చింది. అక్రమ పద్ధతుల్లో వెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలకు సైతం వెళ్తున్నారని తేలింది.

Courtesy Nava Telangana

Leave a Reply