సగం ఆర్టీసీ.. ప్రైవేటుకు

0
308

  • కార్మికులకు 3 రోజుల డెడ్‌లైన్‌
  • 5100 బస్సులకు పర్మిట్లు.. కేబినెట్‌ కీలక నిర్ణయం
  • ఆర్టీసీని పరిరక్షించేందుకే ఈ నిర్ణయం
  • కాలం చెల్లిన, అద్దెబస్సుల స్థానంలో ప్రైవేటువి
  • ప్రైవేటు, ఆర్టీసీ మధ్య ఆరోగ్యకర పోటీ కల్పిస్తాం
  • కేంద్ర చట్టం ప్రకారమే నిర్ణయం తీసుకున్నాం
  • లాభాల రూట్లే ఆర్టీసీకి.. పల్లె రూట్లు ప్రైవేటుకు
  • ఇష్టారాజ్యంగా ధరలు పెంచకుండా కమిషన్‌
  • రాయితీలు, బస్‌ పాస్‌లు యథావిధిగా అమలు
  • ప్రజల భవిష్యత్తు కోసమే ఏ నిర్ణయమైనా..

సమైక్య రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు పోయి రాష్ట్రం స్థిమితపడాలి. ఇవ్వాళ మేం అధికారంలో ఉన్నాం. తర్వాత ఉండకపోవచ్చు. కానీ, రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందనేది వాస్తవం. అది దెబ్బతినకూడదు. నేను చావు అంచులదాకా వెళ్లి రాష్ట్రాన్ని సాధించుకువచ్చా. ఆ చరిత్రను ఎవరూ చెరిపేయలేరు. నేను అమితంగా ప్రేమించేది తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను! వాళ్లకు ఎలాంటి కష్టాలు రావాలని కోరుకోను. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తున్నాం. -సీఎం కేసీఆర్‌

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో సగం సంఖ్యను ప్రైవేటీకరించాలని నిశ్చయించింది. 2 వేల అద్దె బస్సులతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని, మరో 3 వేల కాలం చెల్లిన బస్సుల స్థానంలో ప్రైవేటుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్‌ తీర్మానం చేసింది. మంత్రి వర్గ సమావేశ అనంతరం సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రభుత్వ విధానాన్ని ప్రకటించారు. ఇది అమలు జరిగితే రాష్ట్రంలో సగం ఆర్టీసీ ప్రైవేటీకరణ జరిగినట్టే. మరోవైపు సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం చిట్టచివరి అవకాశం ఇచ్చింది. సమ్మెను విరమించి 3 రోజుల్లోగా… బేషరతుగా విధులకు హాజరయ్యే కార్మికులను చేర్చుకుంటామని, వారికి ఉద్యోగ రక్షణ కల్పిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఇందుకు మంగళవారం అర్ధరాత్రిని డెడ్‌లైన్‌గా ప్రకటించారు.

ఆ పని మాది కదా!!: హైకోర్టుకు అధికారం లేదు
ఆర్టీసీకి ప్రభుత్వమే బకాయి ఉందని మంత్రి అసెంబ్లీలో చెప్పినట్టు హైకోర్టు అనలేదు. అనజాలదు. కామెంట్‌ చేయడానికి హైకోర్టుకు కూడా అధికారం లేదు. పైసలు ఇచ్చేది ప్రభుత్వం కదా! ఒక్క హుజూర్‌ నగర్‌కే ఇస్తారా? మేం పాలకు కూడా 4 రూపాయలు రాయితీ ఇస్తున్నాం. పింఛన్లు ఇస్తున్నాం. రూపాయుకే కిలో బియ్యం ఇస్తున్నాం. ప్రభుత్వం చాలా ఇస్తుంది. నువ్వు గాడెంత ఇచ్చావ్‌.. గీడెంత ఇచ్చావన్నట్లు లెక్క ఉంటుందా? ఆ పని మాది కదా!? మేం అఫిడవిట్‌ దాఖలు చేశాం. దానిమీద మాట్లాడాలి. -సీఎం కేసీఆర్‌

ఆర్టీసీ కార్మికులూ మా బిడ్డలే!
‘‘ఆర్టీసీలో 49 వేల మంది కార్మికులున్నారు. వాళ్ల పొట్ట గొట్టాలని మాకు లేదు. ఆర్టీసీ కార్మికులూ మా బిడ్డలే. యూనియన్ల మాయలో పడి మోసపోవద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ నాయకుడిగా, సోదరుడిగా, రాష్ట్ర అధినేతగా చెప్తున్నా. కార్మికుల కుటుంబాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. యూనియన్ల మాయలో పడి భవిష్యత్తు చెడగొట్టుకోవద్దు. సమ్మెను కఠినంగా అణచి వేయాలనే ఉద్ధేశం మాకు లేదు. మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. నవంబరు 6వ తేదీలోగా బేషరతుగా డ్యూటీలో చేరితే రక్షణ ఉంటుంది. అన్ని రకాలుగా భవిష్యత్తు ఉంటుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు విధుల్లో చేరకపోతే మిగతా 5 వేల రూట్లు కూడా ప్రైవేటుకే ఇస్తాం. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. మేం సిద్ధపడే ఉన్నాం. – సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,: రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల శకం మొదలుకానుంది. వరంగల్‌ టు హైదరాబాద్‌.. కరీంనగర్‌ టు మహబూబ్‌నగర్‌.. ఇలా 5000కుపైగా ప్రైవేటు బస్సులు స్టేజీ క్యారేజీలుగా రయ్యి రయ్యిన తిరగనున్నాయి. టీఎ్‌సఆర్టీసీలో ఇక అద్దె బస్సులు ఉండవు. ఆర్టీసీ బస్సులు సగానికి పరిమితం కానున్నాయి. సగం ఆర్టీసీని ప్రైవేటీకరించడమే ఇందుకు కారణం. ఈ మేరకు ప్రభుత్వం సంచలన, కీలక నిర్ణయం తీసుకుంది. ‘‘రాష్ట్రంలో ఆర్టీసీ 10,400 సర్వీసులను నడుపుతోంది. వాటిలో 2100 అద్దె బస్సులు. మిగిలిన 8,300 ఆర్టీసీ బస్సులు. వాటిలో 2,609 ఇప్పటికే కాలం తీరిన బస్సులు. వాటిని నడపకూడదు. వాటి స్థానంలో కొత్త కొనాల్సి ఉంది. ఇంకో మూడు నాలుగు నెలల్లో మరో నాలుగైదు వందల బస్సుల కాలం తీరనుంది. కాలం తీరిన 3000 బస్సులు, ఆర్టీసీలో ఇప్పటికే ఉన్న 2100 అద్దె బస్సులు కలిపి.. 5,100 బస్సులు ప్రైవేటు వాళ్లకు ఇస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు పర్మిట్లు ఇవ్వాలని కేబినెట్‌ ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. ప్రస్తుతం కొత్త బస్సులను కొనే పరిస్థితుల్లో ఆర్టీసీ లేదని, నష్టాల్లో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం ప్రగతి భవన్లో జరిగింది. అనంతరం, సీఎం కేసీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. తనకు గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని, అందుకే, ఆర్టీసీలో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని భావించామని తెలిపారు.

అంతా ప్రైవేటుకే ఇవ్వం
‘‘ఇప్పుడు ఎవరూ ఎవరినీ బ్లాక్‌మెయిల్‌ చేసే పరిస్థితి ఉండకూడదు. ప్రజలకు అసౌకర్యం కలగకూడదు. కీలక సమయాల్లో సమ్మెలు చేస్తున్నారు. వాటిని నివారించాలి. అందుకే, ప్రైవేటుకు పర్మిట్లు ఇస్తున్నాం’’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు. పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, ఛత్తీ్‌సగఢ్‌ ఇలా చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ లేదని, ఉన్నచోట్ల కూడా వందల సంఖ్యలోనే బస్సులు ఉన్నాయని తెలిపారు. ‘‘మొత్తమంతా ప్రైవేటుకే ఇవ్వలేం. వాళ్లు కూడా బ్లాక్‌మెయిల్‌ చేసే పరిస్థితి వస్తది. అలా చేయకూడదంటే కచ్చితంగా ఆర్టీసీ ఉండాలి. ప్రైవేటు ఉండాలి. వాటి మధ్య ఆరోగ్యకర పోటీ ఉండాలి’’అని స్పష్టం చేశారు. ‘‘మోటారు వాహనాల సవరణ చట్టం-2019 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు రూటు పర్మిట్లు ఎన్నైనా ఇవ్వచ్చు. దీని ప్రకారమే నిర్ణయం తీసుకున్నాం దీనిలో మార్పు ఉండదు. ఎవరూ ప్రశ్నించలేరు’’ అని వివరించారు.

ప్రైవేట్‌ బస్సులు ప్రభుత్వ నియంత్రణలోనే
ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో మెరుగైన రవాణా వ్యవస్థ ప్రజలకు అందాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. ‘‘బస్సులు నడపలేరా? అని రాష్ట్రానికి, రాజధానికి చెడ్డ పేరు వస్తదని ఇప్పటిదాకా సహించాం. ఇకమీదట సహించే పరిస్థితి లేదు. కొందరికి అనుమానాలున్నాయి. కానీ, ప్రైవేటు బస్సులు కూడా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. ఇష్టం వచ్చినట్లు టికెట్‌ ధరలు పెంచడానికి ఉండదు. ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ అధ్యక్షతన ప్రభుత్వం నియమించే రెగ్యులేటరీ కమిషన్‌ ఉంటుంది. దాని నియంత్రణలో ప్రైవేటు వాళ్లుంటారు. జర్నలిస్టులు, విద్యార్థులు, వికలాంగులు, టీఎన్జీవోలు.. ఇలా ఎవరెవరికి ఏయే పాసులు అమల్లో ఉన్నాయో వాటన్నింటినీ ఇస్తాం. ఎవరూ భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని యథావిథిగా కొనసాగిస్తాం’’ అని తేల్చి చెప్పారు.

పారదర్శకంగానే పర్మిట్ల జారీ
‘‘పర్మిట్లు ఇవ్వడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా! నిబంధనలు అమలు చేస్తారు కదా! పారదర్శకత పాటిస్తారు కదా! మా అంత పారదర్శకంగా ఎవరూ ఉండరు తెలుసా మీకు. మేం పక్షపాతంగా కూడా ఉండలేదు. ప్రైవేటుకు ఇచ్చిన 5100 బస్సులు ఇవ్వడమనేది విధాన నిర్ణయం. కేబినెట్‌ నిర్ణయం. దానికి నిబంధనలు రూపొందించుకుని పర్మిట్లు జారీ చేసే బాధ్యత రవాణా శాఖది. వీలైనంత తొందరలో అమలు చేస్తారు. మిషన్‌ కాకతీయ ప్రతి మండలంలో 5 శాతమని చెప్పాం. మిషన్‌ భగీరథ ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పాం. ఏ కార్యక్రమం చేసినా తెలంగాణలో అన్నిటినీ కవర్‌ చేయాలని చెప్పాం. తెలంగాణలో ప్రతి ఇంచి మాదని భావిస్తాం. అందుకే ప్రజలు మాకు ఓట్లు వేస్తున్నారు. వీళ్లు అందరూ కట్టకట్టుకునిపోతే ప్రజలు హుజూర్‌నగర్‌లో మొన్న ఏం తీర్పు ఇచ్చారు?’’ అని కేసీఆర్‌ వివరించారు. లాభాలు వచ్చే మార్గాలను మీకు అనుకూలంగా ఉండే కంపెనీకి అనుమతులు ఇస్తారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని ఓ విలేకరి ప్రస్తావించడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట ఎవరో చెప్పారని ఈ దిక్కుమాలిన ప్రశ్న ముఖ్యమంత్రిని అడుగుతావా అని మండిపడ్డారు. ‘‘నువ్వు ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నావనే సోయి ఉండే మాట్లాడుతున్నావా? పర్మిట్లు ఇవ్వడానికి పద్ధతి ఉం టుంది. ఎవరికి పడితే వారికి ఇవ్వరు. ప్రభు త్వం అన్ని విషయాల్లో పారదర్శకత పాటిస్తుంది’’ అని తెలిపారు.

పల్లె వెలుగు రూట్లే ప్రైవేటుకు
‘‘లాభాలు వచ్చే రూట్లనే ప్రైవేటుకు ఇస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు. అలా ఇవ్వం. లాభాలు వచ్చే రూట్లే ఆర్టీసీకి ఉంచుతాం. కఠినమైన పల్లె వెలుగు రూట్లను ప్రైవేటుకు ఇస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆర్టీసీకి నష్టదాయకంగా ఉన్న రూట్లను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఖమ్మం నుంచి వచ్చిన ఒక ప్రైవేటు ట్రావెల్స్‌ యూనియన్‌ కోరిందని తెలిపారు. ఆర్టీసీని నష్టపరిచే, నిర్మూలించే ఉద్దేశం తమకు ఏ మాత్రం లేదని సీఎం కేసీఆర్‌ తేల్చి చెప్పారు.

Courtesy AndhraJyothy..

Leave a Reply