పోరాడదాం.. సమాన హక్కుల సాధన కోసం..

0
213
* కె. హేమలత /వ్యాసకర్త సిఐటియు అధ్యక్షురాలు

పోరాటాల ద్వారా మహిళలు కొన్ని హక్కులు సాధించుకున్నారు. వారి పని పిరిస్థితులు కొంత మేరకు మెరుగుపడ్డాయి. కానీ పితృస్వామ్య విలువలు మహిళల పనిని తక్కువగానే చూస్తున్నాయి. అసమాన వేతనాలు, ఇతర వివక్షతలు ప్రపంచ వ్యాప్తంగా ఈనాటికీ ప్రభావం చూపుతూనే వున్నాయి. నయా ఉదారవాద విధానాలు అమలవుతున్న నేటి తరుణంలో…కార్మికులు, ఇతర కష్టజీవులపై జరుగుతున్న దాడుల దుష్ఫలితాలను మహిళలే ఎక్కువగా భరించాల్సి వస్తోంది.

బిజెపి కేంద్రంలో అధికారం లోకి వచ్చాక దేశంలో మహిళల పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబం, పిల్లల సంరక్షణకు మహిళల పాత్రను పరిమితం చేసే తిరోగమన, పితృస్వామ్య విధానాలను బిజెపి ప్రచారం చేస్తోంది. స్నేహితులను, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు, తమకు నచ్చిన దుస్తులు ధరించే హక్కు, తమకు నచ్చిన విధంగా జీవించే హక్కు.. వంటివన్నీ మితవాద శక్తుల దారుణ దాడులకు గురవుతున్నాయి. మహిళలపై హింసాత్మక ఘటనలు నానాటికి పెరుగుతున్నాయి.

2019-20 ప్రపంచ లింగ అసమానతల సూచీలో భారత దేశ స్థానం మరింతగా దిగిపోయింది. 2018లో 153 దేశాలను పరిశీలించగా మన దేశం 112వ స్థానంలో వుంది. ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌ రూపొందించిన ఆర్థిక లింగ వివక్షత గణాంకాల సూచీలో మన దేశ స్థానం గడిచిన 14 సంవత్సరాల్లో దారుణంగా పడిపోయింది. 2006లో 110వ స్థానంలో వుండగా 2020 నాటికి 149వ స్థానానికి పడిపోయింది. మహిళల ఆర్థిక అవకాశాలు ప్రపంచంలోకెల్లా మన దేశంలో అత్యంత అథమ స్థాయిలో వున్నాయి. ప్రపంచ బ్యాంకు వెలువరించిన గణాంకాల ప్రకారం 2020 జూన్‌ నాటికి భారత దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం దక్షిణ ఆసియాలోనే అత్యంత తక్కువ స్థాయిలో వుంది. 1990లో 30.3 శాతం నుంచి 2020 నాటికి 20.3 శాతానికి దిగజారింది. పాకిస్తాన్‌ (22.2 శాతం) కన్నా, ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్‌ (21.8 శాతం) కన్నా కూడా తక్కువగా వుంది.

అంటే భారతదేశంలో మహిళలు పనిచేయడం లేదని కాదు. దీనర్థం మహిళల పని విలువ తగ్గిపోతోందని. లేదా వారికి తక్కువ వేతనం చెల్లిస్తున్నారని. మహిళల ఉద్యోగిత తగ్గడంతో ‘చెల్లించే పని’ నుంచి ‘చెల్లించని పని’కి వారు మళ్లుతున్నారని ప్రసిద్ధ ఆర్థికవేత్త జయతీ ఘోష్‌ అంటున్నారు. ఇళ్లల్లో చేసే పనిని ‘పని’గా లెక్కించడంలేదు. ఆహార సేకరణ, కట్టెలు తేవడం, పశుపోషణ, నీళ్లు మోయడం, కుట్లు, అల్లికలు, నేత మొదలయినవన్నీ ఇంటి పనిగా పరిగణించడంతో పనిగా నమోదు కావడం లేదు. ఒఇసిడి (ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ) నివేదిక ప్రకారం భారత దేశంలో మహిళలు ఏ విధమైన వేతనమూ లేని పనిని రోజుకు 6 గంటల పాటు చేస్తారు. కానీ పురుషులు రోజులో 52 నిముషాలు మాత్రమే అటువంటి పని చేస్తారు. మహిళలు చేసే ఇంటి పని, ఇతర గుర్తింపు లేని, తక్కువగా అంచనా వేసే పనులను లెక్కలోకి తీసుకుంటే…దేశంలోని మొత్తం పనిలో పురుషుల భాగస్వామ్యం 79.8 శాతం వుండగా మహిళలది 86.2 శాతం వుంటుందని పరిశోధకుల అంచనా.

అయితే మహిళలు చేసే ఇంటి పనికి గుర్తింపు లేకపోవడం అన్నది అక్కడికే పరిమితం కాలేదు. వారు ఇళ్లలో చేసే పనికి విలువ లేకపోవడం వలన.. ఆ పనిని బయట సమాజం కోసం చేసినప్పుడు కూడా… తక్కువగానే లెక్కిస్తున్నారు. వారు ఇంటి బయట చేసే ఇటువంటి పనులకు అత్యంత తక్కువగా చెల్లిస్తున్నారు. మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వమే మహిళల పనికి తక్కువ విలువ చెల్లిస్తోంది. లక్షలాది మహిళలు స్కీమ్‌ వర్కర్లుగా, ఐసిడిఎస్‌, ఆశ, యుఎస్‌హెచ్‌ఎ, ఎన్‌హెచ్‌ఎం, మధ్యాహ్న భోజన కార్మికులుగా నియమితు లవుతున్నారు. మహిళలు, చిన్న పిల్లలకు వీరు పోషకాహారాన్ని అందిస్తారు. వారి ఆరోగ్యాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఈ పనులు చేస్తున్న వారంతా మహిళలే. కానీ వారికి చెల్లిస్తున్నది గౌరవ వేతనాలు లేదా ప్రోత్సాహకాలు మాత్రమే. వారిని కనీసం కార్మికులుగా కూడా గుర్తించడం లేదు. ఇంటి పనులకు కొనసాగింపుగా వారు సమాజానికి చేస్తున్న ‘సేవ’గానే చూస్తున్నారు.

ప్రపంచంలోకెల్లా భారత దేశం లోనే స్త్రీపురుషుల మధ్య వేతన వ్యత్యాసం చాలా అధికంగా వుంది. సగటున చూసుకుంటే పురుషులకు చెల్లించే వేతనాల్లో మహిళలకు రెండు వంతులే చెల్లిస్తున్నారు. వ్యవసాయ రంగంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మహిళలు మన వ్యవసాయానికి వెన్నెముక వంటి వారు. వ్యవసాయానికి సంబంధించిన అనేక పనులు చేస్తారు. పశుపోషణ, కోళ్ల పెంపకం, అటవీ ఉత్పత్తుల సేకరణ వంటివి చేస్తారు. గ్రామీణ భారతదేశంలో 73 శాతం శ్రామిక మహిళలు వ్యవసాయక పనులపైనే ఆధారపడుతుంటారు. కానీ వ్యవసాయ రంగంలో వారి పనికి గుర్తింపు లేదు. వారిని రైతులుగా గుర్తించడంలేదు. మహిళలను, వృద్ధులను నిరసన ప్రదర్శనల దగ్గర ఎందుకు అనుమతిస్తున్నారంటూ…మన ప్రధాన న్యాయమూర్తి ఇటీవల వేసిన ప్రశ్నలో కూడా…ఈ పితృస్వామ్య భావనే గోచరిస్తోంది.

ఎటువంటి జీతమూ అందని చాకిరి కేవలం భారత మహిళలకే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా అటువంటి పరిస్థితి వుంది. మహిళలు ఇంటి పనికి కేటాయించే సమయం మగవారికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా వుంది. లింగ సమానత్వం వున్న దేశాలలో ఒకటిగా పరిగణించబడుతున్న నార్వే… 2020 ప్రపంచ లింగ అసమానతల సూచీలో రెండవ స్థానాన్ని పొందింది. అక్కడ కూడా మహిళలు మగవారికన్నా రెట్టింపు సమయం ఇంటి పని చేస్తారు. జపాన్‌లో ఇది 4 రెట్లు ఎక్కువ. మహిళలు చేసే పనిని తక్కువ చేసి చూడడం అనేది ఇప్పటిది కాదు. సమాజ పరిణామక్రమంలో వ్యక్తిగత ఆస్తి ఏర్పడి, అది తమ వారసులకు చెందాలన్న ధోరణి వృద్ధి చెంది… చారిత్రకంగా పని విభజన జరిగిన క్రమంలోనే మహిళల శ్రమకు పురుషుల శ్రమకన్నా తక్కువ విలువనివ్వడం గమనించవచ్చు. తాము చేసే పనిని పనిగా గుర్తించాలని, తమ పని విలువను తగ్గించకూడదని, తమకు సమాన అవకాశాలు, సమాన వేతనాలు, సమాన హక్కులు కల్పించాలని మహిళలు పోరాటాలు కొనసాగిస్తున్నారు.

మహిళలు.. ముఖ్యంగా వివిధ స్కీముల్లో పని చేసే వారు, తమను కార్మికులుగా ఉద్యోగులుగా గుర్తించాలని, తమ పనికి గౌరవ వేతనం కాదు. కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమాన వేతనాల కోసం, పిల్లల క్రష్‌ల కోసం, లైంగిక వేధింపులు లేని గౌరవప్రదమైన పని ప్రదేశాల కోసం, సురక్షితమైన సమాజం కోసం పోరాడుతూనే వున్నారు. అదే సమయంలో అనేక సంవత్సరాల పాటు పోరాడి సంపాదించుకున్న కార్మిక హక్కులు, సంఘ నిర్మాణ హక్కు, సామూహిక బేరసారాల హక్కులతో సహా ఎన్నో హక్కులను హరిస్తూ ‘లేబర్‌ కోడ్లు’ తీసుకొచ్చారు. ఈ విధంగా కార్మిక వర్గంపై పాలక వర్గాలు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాలలో కూడా భాగస్వాములవుతున్నారు. వివిధ రంగాల్లోని కార్మికోద్యమాలు పిలుపులిచ్చిన సమ్మెల్లో, ప్రదర్శనల్లో లక్షలాది మంది మహిళా కార్మిలకులు, ఉద్యోగులు పాల్గొంటున్నారు.

తమను రైతులుగా గుర్తించాలని, భూమిని తమ పేరున రిజిస్టర్‌ చేయాలని, పురుషులతో పాటు తమకూ రుణ సదుపాయాలు కల్పించాలని మహిళా రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అదే సమయంలో తమ ఉనికికే ముప్పు తెచ్చిపెట్టే బడా కార్పొరేట్లకు వ్యవసాయాన్ని అప్పగించే మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలలో, నిరసన ప్రదర్శనల్లోనూ భాగస్వాములయ్యారు.

సంపదంతా కొద్ది మంది చేతుల్లో పోగుపడే కార్పొరేట్ల లాభాలకు అండగా నిలిచే మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో భాగమే ఇవి. ఈ పోరాటాల్లో పెద్ద సంఖ్యలో భాగస్వాములైన మహిళలు వర్గ ప్రయోజనాల కోసం మాత్రమే కాదు. పితృస్వామ్య విలువలను ప్రోత్సహిస్తున్న ప్రస్తుత విధానానికి వ్యతిరేకంగా కూడా పోరాడుతున్నారు. స్త్రీపురుషులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఇటువంటి పోరాటాలను మరింత పెంచాలి. ఇందులో మరింత మంది శ్రామికులు, మహిళలు పాల్గొనాలి. పితృస్వామ్యాన్ని పెంచి పోషించే నయా ఉదారవాద విధానాలను ఓడించి తీరాలి. మహిళలు తమను తాము విముక్తులను చేసుకునేందుకది దోహదపడుతుంది. వారికి సమాజంలో తమదైన స్థానాన్ని కల్పిస్తుంది

Leave a Reply