కోవిద్ కట్టడిలో రాజకీయ నిర్ణయాత్మకత, సంసిద్ధత ఎక్కడ!

0
266

కోవిద్ కు సంబంధించి రోజురోజుకీ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్నాయి. మారిన పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థాగత మద్ధతు వ్యవస్థలు పెరగకపోగా, వున్న వ్యవస్థలు కూడా కుప్పకూలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సామాన్య ప్రజలు వెళ్లాలంటే గాంధీ తప్పించి దిక్కులేదు. అక్కడ వున్న వ్యవస్థల లోపం మీద అనేక అపోహలు సామాజిక మాధ్యమాలలో విచ్చలవిడిగా ప్రచారం అయిపోతుంటాయి. అన్నీ అపోహలే అని, రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని కొట్టిపారేయటానికి లేదు. సమన్వయంలో ఎదురయ్యే లోపాలను అధిగమించటానికి చేసిన సూచనలను పట్టించుకునే వ్యవస్థ లేదు. చిన్న ఉదాహరణ, ఇంత పెద్ద సమస్య నడుస్తున్నప్పుడు కోవిద్ సంబంధిత ఆసుపత్రులో హెల్ప్ డెస్క్ లు వుండాలి కదా? అదేమంత పెద్ద విషయమని? కానీ దాని గురించి ఆలోచన వుండదు. వాటి అవసరం గురించి పౌర సమాజం నుంచీ విజ్ఞప్తులు వెళ్ళినా గానీ అవి చెత్త బుట్ట పాలవుతాయి.

‘నీ ముక్కు ఎక్కడుంది అంటే తల చుట్టూ పదిసార్లు చేయి తిప్పి చూపించే’ వ్యవహారం ప్రస్తుతం నడుస్తోంది. ఈ క్రమంలో కొందరి ప్రాణాలు గాలిలో దీపం అవుతున్నాయి. గాంధీ ఆసుపత్రిలో కోవిద్ లక్షణాలు తీవ్రంగా వున్నవారికి చికిత్స ఇస్తారు. కానీ అక్కడ పరీక్షలు చేయరు. ఎంతో దూర భారాల నుంచీ అక్కడికి వచ్చిన వాళ్లు మళ్లీ తిరిగి కింగ్ కోటి ఆసుపత్రికో, కోరంటీకో, ఇంకో చోటికో వెళ్ళాలి. అక్కడ టెస్ట్ చేయించుకున్నవాళ్ళు రిపోర్ట్ వచ్చేవరకూ ఎక్కడ వుండాలి? దూరాభారాల నుంచీ వస్తారు. మళ్ళీ వెనక్కి వెళ్లలేరు, ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు. వారిని ఇన్ని చోట్ల తిప్పడం అంటే వైరస్ వ్యాప్తిని చేజేతులా పెరగనివ్వటమేగా! ఇప్పుడంటే రాపిడ్ టెస్టులు మొదలు పెట్టారు, వెంటనే రిపోర్ట్ వచ్చేస్తుంది. కానీ, ఆ టెస్ట్ చేయించుకోవటం కోసం రోజంతా ఎండలో పడిగాపులు కాయాలి. ఎక్కడా కూడా పరీక్షల కోసం వచ్చిన వారికి కనీసం ఇంత నీడ ఏర్పాటు అనేది కూడా జరగలేదు. వీటన్నిటిలో సమన్వయలోపం వుంది. వాటి గురించి చెప్పినా పట్టించుకునే అధికారులు లేరు.

హాస్పిటల్ లో అడ్మిట్ అయి చికిత్స తీసుకుంటున్న వాళ్ల అందరి పరిస్థితి ప్రమాదకరంగా వుండక పోవచ్చు. కానీ అడ్మిషన్లు పొందే క్రమమే తలనొప్పులతో వుంది. అవగాహన కల్పించే వ్యవస్థ లేదు. సమస్య ఎక్కడ వుందో గుర్తిస్తే కదా దాని మీద అవగాహన అనే అంశం ముందుకు వచ్చేది. సమస్యనే అసలు గుర్తించటానికి నిరాకరిస్తే? సమన్వయ లోపాన్ని సరిదిద్దితే చాలా అంశాలు చక్కబడతాయి. అన్ని హాస్పిటల్స్ లో హెల్ప్ డెస్క్ లు 24/7 పెడితే ప్రజలకు మేలుగా వుంటుంది. ఎక్కడెక్కడ పరీక్షలు చేస్తున్నారు, ఏప్రాంతాల్లో ఐసోలేషన్ కేంద్రాలు వున్నాయి, ప్రైవేటు ఆసుపత్రులు ఏవేవి కోవిద్ కు చికిత్స అందిస్తున్నాయి, వీటికి సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా? అన్ని హాస్పిటల్స్ లో సెక్యూరిటీ వాళ్ళే విసురుకుంటూనో కసురుకుంటూనో తెలిసీ తెలియని సమాచారాన్ని ఇస్తున్నారు. అదీ మన దౌర్భాగ్యం. ఏమన్నా అంటే హెల్ప్ లైన్లు పెట్టాముగా, వాటికి ఫోన్ చేసి సమాచారం తీసుకోండి అంటారు. వాటి నుంచీ వచ్చే సమాచారం కూడా అరాకొరానే అనేది చాలామంది చెబుతున్నారు.

వున్న ఒకటీ రెండూ ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్ లో కనీసం మూడు నుంచీ నాలుగు వందల మంది పొదుపొద్దున్నే వచ్చి నిలుచుంటే వారికి సమాచారం ఇచ్చే వ్యవస్థ వుండటం లేదు. టెస్టుల కోసం వచ్చినవారికి రిజిస్ట్రేషన్లు చేసేవారే అన్నిటికీ సమాధానం ఇవ్వాల్సి రావటం, ఏదో ఒక సందర్భంలో వారికీ, రోగులకు మధ్య వాగ్వివాదం జరగటం అతి సాధారణం అయిపోతోంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రజలకు భయం వుంటుంది. పైగా కోవిద్ గురించి విపరీతంగా ప్రచారమయిన అపోహలూ, భయాలు మరింత ఆందోళనను పెంచుతున్నాయి. వారి భయాన్ని పోగొట్టే వ్యవస్థ రూపకల్పన మీద ప్రభుత్వానికి శ్రద్ధ లేదనే అనిపిస్తోంది. అన్ని ఏరియాల్లో టెస్ట్ లు చేసే సెంటర్స్ వివరాలు పేపర్లో అనౌన్స్ చేయాలి. టీవీల్లో స్క్రోలింగ్ ఇవ్వాలి. టెస్టింగ్ సెంటర్స్ పెరగాలి. ఏ ఏరియా వాళ్లు ఆ ఏరియా లోనే టెస్ట్ చేయించుకునే ఏర్పాటు వుండాలి. లేకపోతే ఒత్తిడి తట్టుకోవడం కష్టం.

సరే, రిపోర్ట్ వచ్చిన తర్వాత కోవిద్ పాజిటివ్ వచ్చిన వారికి వున్న వ్యాధి లక్షణాలను బట్టి కొంతమందిని పూర్తిగా విడిగా (ఐసోలేషన్) పెట్టాలి. కొంతమందికి ఆక్సిజన్ పెట్టాల్సి రావొచ్చు. ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలున్న మరికొంతమందికి వెంటిలేటర్ పెట్టాల్సి రావొచ్చు. పాజిటివ్ వచ్చినవారికి సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులను, ఇతర వ్యక్తులను క్వారంటైన్ లో పెట్టాల్సి రావొచ్చు. భయాన్ని పోగొట్టి మానసిక స్థైర్యాన్ని అందించే సహకార వ్యవస్థ వుండాలి. కోలుకోవటానికి బలవర్ధకమైన ఆహారం వుండాలి. మరి ఈ వ్యవస్థలు పకడ్బందీగా, సరిపోయినన్ని వున్నాయా? వున్న వ్యవస్థలు సరిపోనప్పుడు కొత్త మార్గాల గురించి ఆలోచించాలి కదా? వైద్య వ్యవస్థలో వున్న అన్నిరకాల ఆసుపత్రులను దీనికి సన్నద్ధం చేసుకోవాలి కదా? అన్నిటికీ ఒకటే మంత్రం లాగా పాజిటివ్ వచ్చినవాళ్ళు ఇళ్లలోనే వుండండి , భౌతిక దూరం పాటించండి అని చెప్పటం అంటే పేద ప్రజల జీవితాల మీద క్రూరమైన పరిహాసం చేయటమే. పైగా హాస్యాస్పదమైన విషయమేమంటే, ఐసోలేషన్ సెంటరులో అడ్మిషన్ కావాలంటే ప్రజలు వారు నివసించే ఏరియా ఆసుపత్రి నుంచీ రిఫరెన్స్ తీసుకుని వెళ్లాలి. ఇంత చుట్టు తిరుగుడు వ్యవహారం లేకుండా ఎక్కడికక్కడ నిర్ణయించే వ్యవస్థని రూపొందించలేరా?

ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా టెస్టులు పెంచాలి అని డిమాండ్ చేస్తాయి తప్పించి, టెస్ట్లు చేసిన తర్వాత ఏమేం వ్యవస్థలు అవసరం అవుతాయి, వాటికి అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయటంలో ఎక్కడెక్కడ అవకాశం వుంటుందో, ఎవరెవరు వాటికోసం పనిచేయగలుగుతారో, ప్రజలకు ఎలా అందుబాటులోకి తేవచ్చో అనే నిర్దిష్టమయిన సూచనలు ఎప్పుడూ వుండవు. అనూహ్యమైన ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అంచనా వేయటం, దానికి తగ్గ వ్యవస్థలను అత్యవసరంగా ఏర్పాటు చేయటం అనేది ముందుగా ప్రభుత్వాల బాధ్యత ఎంతో ఎక్కువ వుంటుంది. దానిలో మరో ముచ్చటే లేదు. వాటికి అవసరమైన సలహాలు, సంప్రదింపులను సంఘర్షిస్తూనే అందించడం అనేది రాజకీయ వ్యవస్థల బాధ్యత. దురదృష్ట వశాత్తూ ఈ రెండు వ్యవస్థలు ఇక్కడ ఘోరంగా వైఫల్యం చెందాయి.

పౌరసమాజ సంస్థలు, సామాజిక కార్యకర్తలు, వైద్యరంగంలో పనిచేస్తున్న పరిశోధకులు పూనుకుని ఆచరణలోకి రావలసిన ప్రతి చిన్న అంశం మీదా క్షేత్రస్థాయి అనుభవాలతో న్యాయవ్యవస్థ తలుపు తట్టాల్సి వస్తోంది. గత మూడున్నర నెలలుగా ప్రభుత్వానికి చేసిన అనేక విజ్ఞప్తులు ఆచరణలోకి రాకపోవటంతో తీసుకోవాల్సి వచ్చిన పరిణామం ఇది. అంటే, ప్రభుత్వం కదలాలంటే ప్రతిసారీ న్యాయవ్యవస్థ జోక్యాన్ని కోరవలసిందేనా? ఎక్కడుంది లోపం? వ్యవస్థలనీ, నిర్మాణాలనీ కూల్చుకుంటూ వెళ్లటం అంటేనే ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం లేకపోవడం! మామూలు సమయాల్లోకన్నా కనీసం ఆరోగ్య విపత్కర సమయాల్లోనూ ప్రజల ప్రాణాలను గాలిలోపెట్టి చోద్యం చూడటం అనేది క్షమించరాని నేరం. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. జరిగిన ఆలస్యాన్ని పక్కకు పెట్టి పౌర సమాజ ప్రతిపాదనలను స్వీకరించి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా, పారదర్శకంగా వుండేలా చర్యలు తీసుకోవాలి. వచ్చిన విపత్తును ఎదుర్కోవటంలో, ముఖ్యంగా పేద ప్రజలు నివశించే జనసమ్మర్ధమైన ప్రాంతాల్లో కోవిద్ ని కట్టడి చేయటంలో ప్రజల భాగస్వామ్యంతో వివిధ రాష్ట్రాలు తీసుకున్న చర్యలు ఏమిటనేది అధ్యయనం చేయాలి. వాటిని ఇక్కడ ఆచరణలోకి తీసుకు రావాలి.

మనముందు ముంబై లోని ధారవి, తమిళనాడు లోని కన్నగి నగర్, కలకత్తా లోని బెల్గాచి ఉదాహరణలు వున్నాయి. ఆయా నగరాల్లోని మునిసిపల్ కార్పోరేషన్లు, పోలీసులు, బస్తీ సంఘాలు, స్వచ్చంధ సంస్థలు, వైద్య వ్యవస్థ, స్థానిక యువతరం భాగస్వామ్యంతో, సౌకర్యాల లేమితో లక్షలాదిమంది పేద ప్రజలు నివశించే ఈ ప్రాంతాల్లో విజయవంతంగా కోవిద్ సామూహిక వ్యాప్తిని అడ్డుకోగలినప్పుడు, మనమెందుకు అటువంటి కార్యాచరణలోకి వెళ్లలేకపోతున్నాము!? సమాచారమూ, నైపుణ్యాలు లేక కాదు. కావలసింది రాజకీయ నిర్ణయాత్మకత, సంసిద్ధత! దానికోసం ప్రజల వైపు నుంచీ నిర్మాణాత్మకంగా నిరంతరం అన్ని రూపాల్లో ప్రశ్నిస్తూ వెళ్లటమే.

కె. సజయ
సామాజిక విశ్లేషకులు, స్వతంత్ర జర్నలిస్ట్

Courtesy Prajatantra

Leave a Reply