ఇది కొన’సాగే’ సంక్షోభం

0
222

ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభంలో ఉంది. ఉత్పత్తి బాగా తగ్గిపోవడం, నిరుద్యోగం అవధులు దాటి పెరిగిపోవడం దీని పర్యవసానాలే. అయితే చాలామంది ఈ సంక్షోభం కోవిడ్‌-19 కారణంగానే ఏర్పడిందని అనుకుంటున్నారు. కోవిడ్‌-19 గనక అదుపులోకి వచ్చేస్తే తిరిగి సాధారణ పరిస్థితులు వచ్చేస్తాయని భావిస్తున్నారు. ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు. ఈ కోవిడ్‌-19 రాకమునుపే ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ మందగించడం మొదలైందన్నది మొదట మనం గుర్తించాల్సిన వాస్తవం. ఇంకా చెప్పాలంటే 2008 లో ”రియల్‌ ఎస్టేట్‌ రంగం వృద్ధి” బుడగ పేలిపోయి ఆర్థిక సంక్షోభం ఏర్పడిన తర్వాత ఆర్థిక వ్యవస్థ ఇంతవరకూ పూర్తిగా కోలుకోనేలేదు. కొద్దిగా పుంజుకోవడం, మళ్ళీ వెంటనే పడిపోవడం జరుగుతూనే వుంది. అమెరికాలో ట్రంప్‌ గొప్పగా నిరుద్యోగిత రేటు తక్కువగా ఉందని చెప్పుకున్నాడు. కాని నిజానికి 2008 కి ముందు కాలంలో పని దొరికిన రోజుల కన్నా ఆ తర్వాత కాలంలో తక్కువ రోజులు పని లభించింది. దానిని కూడా పరిగణనలోకి తీసుకుంటే అమెరికాలో అధికారికంగా చెబుతున్న 4 శాతం నిరుద్యోగం కన్నా వాస్తవ నిరుద్యోగం 8 శాతం పైనే ఉంది. ఇది 2020లో కరోనా వ్యాపించక ముందున్న పరిస్థితి.

ఆర్థిక వ్యవస్థ మందగించడానికి కారణం ఏమిటి? ఉత్పత్తిలో వచ్చే మిగులులో కార్మికుల వాటా తగ్గిపోయి, పెట్టుబడిదారుల వాటా పెరుగుతూ వచ్చింది. ఒకవైపున సాంకేతికాభివృద్థి ఫలితంగా కార్మికుల ఉత్పాదకత బాగా పెరుగుతూ వచ్చింది. కాని ఆ కార్మికుల నిజవేతనాల స్థాయి మాత్రం అందుకు తగినట్టు పెరగకుండా యథాతథంగా కొనసాగుతూ వచ్చింది. అందువలన ఉత్పత్తిలో వేతనాల వాటా తగ్గుతూ, లాభాల వాటా పెరుగుతూ వచ్చింది. ఇదంతా నయా ఉదారవాద విధానాల పుణ్యమే. ఎప్పుడైతే వేతనాల వాటా…పెరిగిన ఉత్పత్తికి తగినట్టు పెరగలేదో…అప్పుడు ఆ ఉత్పత్తులను కొనుగోలు చేసే విధంగా డిమాండ్‌ పెరగదు. పెట్టుబడిదారుడి లాభం పెరిగినంత మాత్రాన అతడు దానినంతటినీ ఖర్చు చేయడు. మరోవైపు కార్మికుల వేతనాల వాటా పెరగనందున వారు కొనుగోలు చేయగల శక్తి తగ్గిపోతుంది (పెరిగిన ఉత్పత్తితో పోల్చితే). పర్యవసానంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఇది పెట్టుబడిదారీ ప్రపంచం అంతటా కరోనా రావడానికి ముందే నెలకొన్న పరిస్థితి.

ఇప్పుడు కరోనా వచ్చి ఈ పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చింది. అయితే, కరోనా అదుపులోకి వచ్చాక కూడా ప్రపంచంలో కొనుగోలు శక్తి తగినంత లేని పరిస్థితి అలానే ఉంటుంది (నిజానికి అది నానాటికీ మరింత జటిలం అవుతుంది కూడా). ఈ స్థితి నుండి బైట పడాలంటే ప్రభుత్వం చేసే ఖర్చును పెంచాల్సి వుంటుంది. ఆ అదనపు ఖర్చు కోసం అవసరమైన సొమ్ము పెట్టుబడిదారులపై అదనపు పన్నులను విధించి గాని, ద్రవ్యలోటును పెంచి గాని సమకూర్చుకోవాలి. కార్మికుల మీద, ప్రజలమీద భారం మోపడం వలన ఉపయోగం ఉండదు. కార్మికులు ఎటుతిరిగీ వారి ఆదాయాలను ఖర్చు చేస్తారు. వారి దగ్గర నుండి పన్ను రూపంలో ప్రభుత్వం తీసుకుని ఖర్చు చేస్తే డిమాండ్‌ పెరిగేదేమీ ఉండదు. సంక్షోభం తగ్గేదీ ఉండదు. కాని ఫైనాన్సు పెట్టుబడి ప్రభుత్వం అదనపు ఖర్చు చేయడానికి అంగీకరించదు. అంటే కరోనా తగ్గిన తర్వాత కూడా ప్రభుత్వాలు ప్రజల కొనుగోలుశక్తిని పెంచేందుకు ఎట్టి చర్యలూ చేపట్టడం జరగదు. నయా ఉదారవాదం పెట్టుబడిదారీ వ్యవస్థను దారితోచని స్థితికి తెచ్చింది. కరోనా అనంతరం, నిబంధనలు సడలించాక వినిమయ వస్తువుల కొనుగోలు పెరుగుతుందని అనుకున్నా, సరుకుల ఉత్పత్తికి పెట్టే పెట్టుబడులు మాత్రం కరోనాకు ముందున్న పాత స్థితికి చేరుకోవు. అంటే వినిమయ వస్తువుల ఉత్పత్తి కూడా పాత స్థితికి చేరుకోదు. అంతకన్నా తక్కువ స్థాయి లోనే ఉంటుంది. కరోనా మహమ్మారి వంటి ఒక ”షాక్‌” తగిలాక ఈ విధంగానే ఉంటుంది.

ఒక చిన్న లెక్క సహాయంతో దీనిని అర్థం చేసుకోవచ్చు. కరోనాకు ముందు మన ఆర్థిక వ్యవస్థ 2 శాతం చొప్పున ప్రతి ఏడూ వృద్థి చెందుతోందనుకుందాం. అప్పుడు పెట్టుబడిదారుడు తన పెట్టుబడిని కూడా ప్రతి ఏడూ 2 శాతం చొప్పున పెంచుతూ వస్తాడు. అతడి పెట్టుబడి విలువ రూ. 500 అనుకుందాం. ఉత్పత్తి అయ్యే సరుకు విలువ రూ. 100 అనుకుందాం. మార్కెట్‌ లోకి రూ. 100 విలువ గల సరుకు వస్తుంది.

ఉత్పత్తి విలువ రూ. 100 అనుకున్నాం. దీనిని పంచుకునేది పెట్టుబడిదారుడు (లాభం పేరుతో), కార్మికులు (వేతనాల పేరుతో), ప్రభుత్వం (పన్నుల రూపంలో). పన్నుల రూపంలో రూ. 20 పోయిందనుకుందాం. తక్కిన 80 లో కార్మికులు, పెట్టుబడిదారుడు చెరిసగం పంచుకున్నార నుకుందాం. అంటే కార్మికులకు రూ. 40, పెట్టుబడిదారుడికి రూ. 40 వస్తాయి. ప్రభుత్వం వాటా రూ. 20, కార్మికుల వాటా రూ. 40 పూర్తిగా ఖర్చు చేస్తారు. పెట్టుబడిదారుడి వాటాలో రూ. 30 మాత్రమే ఖర్చు చేస్తాడు (తక్కిన రూ. 10 అతను అదనపు పెట్టుబడిగా పెడతాడని ముందే అనుకున్నాం). కరోనా అనంతరం వినిమయం స్థాయి పూర్వ స్థితికి చేరుకోగలిగిందని అనుకున్నా దాని వలన మార్కెట్‌లో ఇప్పుడున్న సరుకు అమ్ముడు పోవడానికి అది వీలు కలిగిస్తుంది. కాని ఈ సారి పెట్టుబడిదారుడు వృద్థిరేటు గతంలో మాదిరిగానే కొనసాగుతుందని అనుకోలేడు గనుక గతంలో పెట్టిన స్థాయిలో 2 శాతం పెట్టుబడి అదనంగా పెట్టడు. సగానికి తగ్గించి ఒక్క శాతమే (అంటే 5) మాత్రమే పెట్టుబడి పెట్టి మార్కెట్‌లో ఏం జరుగుతుందో పరిశీలిస్తూ ఉంటాడు.

అదనపు పెట్టుబడి సగానికి తగ్గడం వలన ఉత్పత్తి వృద్థి సగానికి తగ్గిపోతుంది. అందువలన దానిని పెట్టుబడిదారుడు లాభంగాను, కార్మికులు వేతనాలుగాను పంచుకున్నప్పుడు వారివారి వాటాలుగా వచ్చేది కూడా సగానికి తగ్గిపోతుంది. ప్రభుత్వం పన్నులను ముందే వసూలు చేస్తుంది కనుక దాని వాటా తగ్గదనుకుందాం. అప్పుడు వినిమయం చేయడానికి ప్రభుత్వ ఖర్చు 20, కార్మికుల వాటా 20 (గతంలో వచ్చిన దానిలో సగం) పెట్టుబడిదారుడి వాటా నుండి ఖర్చు చేసేది 15-మొత్తం 55 మాత్రమే అవుతుంది.

అదనపు పెట్టుబడి 5.
ఎప్పుడైతే వినిమయం తగ్గుతుందో అప్పుడు సామర్ధ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించి ఉత్పత్తి చేయడం సాధ్యపడదు. అందుచేత పెట్టుబడిదారీ వ్యవస్థకి వెెలుపలినుంచి కరోనా వంటి షాక్‌ గనుక తగిలితే కోలుకుని ఉత్పత్తి మామూలు స్థితికి రావడానికి చాలా కాలం పడుతుంది. ఇక కరోనాకు ముందే మాంద్యంలో కూరుకుపోయిన ప్రస్తుత పరిస్థితిలో కోలుకోవడం ఇంకా దీర్ఘకాలం పడుతుంది. గతంలో 1930 దశకంలో మహామాంద్యం వచ్చినప్పుడు అమెరికాలో సరిగ్గా ఇదే జరిగింది. ఆ సంక్షోభం నుంచి బైట పడడానికి రూజ్‌వెల్ట్‌ ప్రకటించిన న్యూ డీల్‌ ఫలితంగా ప్రభుత్వం ఖర్చు పెంచింది. దాంతో సరుకుల వినిమయం అయితే పెరిగింది కాని అదే మోతాదులో పెట్టుబడులు, అదనపు ఉత్పత్తి పెరగలేదు. సరిగ్గా ఆ సమయానికి వచ్చిపడిన రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఆయుధాలకు డిమాండ్‌ పెరిగింది. అందుచేత ఆయుధ పరిశ్రమలలో పెట్టుబడులు పెరిగాయి. దాంతో పెట్టుబడిదారీ వ్యవస్థకు సంక్షోభం నుండి ఊరట లభించింది. ఆ న్యూ డీల్‌ ద్వారా ప్రభుత్వం చేసిన ఖర్చు బాగా పెరిగింది. అందువలన వస్తువుల వినిమయం పెరిగింది. కాని ఇప్పటి పరిస్థితుల్లో ద్రవ్య పెట్టుబడి ప్రభుత్వాలను ఖర్చు పెంచుకోడానికి అనుమతించదు. అందుచేత ఈ మారు సంక్షోభ దశలో 1930 దశకంతో పోల్చి చూసినపుడు వినిమయం తిరిగి పుంజుకోవడానికి కూడా ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది. మొత్తం మీద పెట్టుబడిదారీ వ్యవస్థ చాలా కాలం పాటు ఈ సంక్షోభంలో కూరుకుపోయి వుంటుంది.
అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆదేశాలకు పూర్తిగా తలొగ్గి చెప్పినట్టల్లా చేసే ప్రభుత్వం ఉన్న భారతదేశంలో కోలుకోడానికి మరికాస్త ఎక్కువ సమయమే పడుతుంది. కొనుగోలుశక్తి పెంచే దిశగా ఒక్క చర్యనూ ప్రభుత్వం తీసుకోవడంలేదు. అసలు ఈ సంక్షోభానికి మూల కారణం కొనుగోలుశక్తి తగినంత లేకపోవడమే అన్న విషయం ఈ ప్రభుత్వానికి ఏ మాత్రమూ అర్ధం అయినట్టులేదు. అందువలన మోడీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ ప్రజల కొనుగోలుశక్తిని మరింత కుంగదీస్తున్నాయి. దాని వలన సంక్షోభం మరింత తీవ్రం అవుతుంటుంది. సంక్షోభం తీవ్రం అవుతున్నకొద్దీ ప్రభుత్వం మరింత నియంతృత్వంగా వ్యవహరిస్తూ, కార్మిక వర్గాన్ని అణచివేస్తూ, వారిని చీల్చడానికి తన మతోన్మాద ఎజండాను మరింత ఉధృతం చేస్తూ పోతుంది.

* ప్రభాత్‌ పట్నాయక్‌ (స్వేచ్ఛానుసరణ)

Leave a Reply