ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య

0
120

సి. బెళగల్‌ : ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగద్గిరిగుట్ట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా మారందొడ్డి గ్రామానికి చెందిన వడ్ల బ్రహ్మచారి (28), బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. మూడేళ్లుగా జగద్గిరిగుట్ట ప్రాంతంలోని హనుమాన్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం కర్నూలు జిల్లా బ్రాహ్మణ దొడ్డి గ్రామానికి చెందిన మౌనిక(20)తో వివాహం జరిగింది. వివాహం జరిగి రెండు సంవత్సరాలైనా వీరికి సంతానం కలగలేదు. బ్రహ్మచారికి నెల రోజులుగా పని లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. గతంలో ఫైనాన్స్‌లో బైక్‌ను కొనుగోలు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో డబ్బులు కట్టకపోవడంతో ఈనెల 19న ఫైనాన్స్‌ వారు బైక్‌ తీసుకెళ్లారు. దీంతో భార్యాభర్తలు తీవ్ర మనస్తాపానికి గురై అదే రోజు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం రాత్రి బంధువులు ఫోన్‌ చేసినా సమాధానం ఇవ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన అతని బంధువులు శుక్రవారం ఇంటికి వెళ్లి చూడగా మౌనిక ఫ్యాన్‌కు వేలాడుతూ, బ్రహ్మచారి నేలపై మృతి చెంది ఉన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో జగద్గిరిగుట్ట సీఐ సైదులు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply