అమెరికాలో జాతి విద్వేష దాడి

0
231
  • నల్లజాతీయులే లక్ష్యంగా 18 ఏళ్ల శ్వేత జాతీయుడి కాల్పులు
  • 10 మంది మృతి.. ముగ్గురికి గాయాలు
  • బఫెలోలోని సూపర్‌ మార్కెట్‌లో ఘటన 

బఫెలో : అమెరికాలో దారుణం జరిగింది. పద్దెనిమిదేళ్ల ఏళ్ల యువకుడు ఓ సూపర్‌ మార్కెట్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 10 మంది మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. న్యూయార్క్‌ రాష్ట్రం బఫెలో నగరంలో శనివారం మధ్యాహ్నం(స్థానిక కాలమానం ప్రకారం) ఈ దారుణ ఘటన జరిగింది. స్థానికంగా నల్లజాతీయులు అధికంగా నివసిస్తుండటం, మృతుల్లో నల్లజాతీయులే ఎక్కువగా ఉండటంతో వారినే లక్ష్యంగా చేసుకొని జరిగిన ‘జాతి విద్వేష దాడి’, ‘విద్వేషంతో కూడిన నేరం’గా పోలీసులు భావిస్తున్నారు. షాపు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రిటైర్డ్‌ పోలీసు అధికారి, ఆ దుండగుడిని తీవ్రంగా ప్రతిఘటించి ప్రాణాలు కోల్పోయారు.

ఘటన జరిగిన తీరును బట్టి నిందితుడు పక్కా ప్రణాళికతోనే దాడికి పాల్పడినట్లు స్పష్టమైంది. దుండగుడి పేరు పేటన్‌ జెండ్రన్‌. శ్వేతజాతీయుడు. స్వస్థలం న్యూయార్క్‌ రాష్ట్రంలోని కాంక్లిన్‌ ప్రాంతం. స్థానికులు, పోలీసులు, వైట్‌ హౌజ్‌ అధికారుల కథనం ప్రకారం.. దాడి కోసమే అతడు పనిగట్టుకొని కారులో 320 కిలోమీటర్లు ప్రయాణించి ‘టాప్స్‌ ఫ్రెండ్లీ మార్కెట్‌’ అనే సూపర్‌ మార్కెట్‌ వద్దకు చేరుకున్నాడు. ఎవ్వరూ అనుమానించకుండా ఉండేందుకు మిలటరీ దుస్తులు ధరించాడు. పైన బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్‌ ధరించాడు. దాడిని ఆన్‌లైన్‌లో లైవ్‌ స్ట్రీమ్‌ చేసేందుకు కెమెరా ఉన్న హెల్మెట్‌ ధరించాడు. షాపు ప్రాంగణంలోకి ప్రవేశిస్తూనే నలుగురు సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపాడు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నాలుగో వ్యక్తి, రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి… దుండగుడిపై కాల్పులు జరిపాడు. ఓ బుల్లెట్‌ దుండగుడి శరీరానికి తగిలినా ఫ్రూఫ్‌ జాకెట్‌ ధరించడంతో ఏమీ కాలేదు. ప్రతిగా దుండగుడి కాల్పుల్లో ఆ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఆపై దుండగుడు సూపర్‌ మార్కెట్లోకి ప్రవేశించి కస్టమర్లపై 2 నిమిషాల పాటు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కొందరు వెనుక ద్వారం నుంచి బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. బుల్లెట్‌ గాయాలైన 13మందిలో 11 మంది నల్లజాతీయులే. పోలీసు బృందం అక్కడికి చేరుకొని చుట్టుముట్టడంతో దుండగుడు తన గన్‌ వారికి అప్పగించి లొంగిపోయాడు. ఘటనపై అధ్యక్షుడు జో బైడన్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply