అమెరికాలో జాత్యహంకార వ్యతిరేకసెగలు

0
192

– కెనోషాలో పేలిన తూటా
– నిరసనకారులపై ఆగంతకుల కాల్పులు
– ఇద్దరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
– మూడోరోజూ ఆందోళనలతో దద్దరిల్లిన నగరం

కెనోషా : అమెరికాలో నల్లజాతీయుడిపై పోలీసుల కాల్పుల ఘటనను వ్యతిరేకిస్తూ మూడో రోజు విస్కాన్సిన్‌ రాష్ట్రంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కెనోషా నగరంలో నిరసనకారులపై తూటా పేలింది. మంగళవారం రాత్రి(అమెరికా కాలమానం నల్లజాతీయుడిపై పోలీసులు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విస్కాన్సిన్‌లోని కెనోషాలో తీవ్రంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వరుసగా మూడోరోజూ నగరం దద్దరిల్లింది. నినాదాలతో హోరెత్తింది. ఈ క్రమంలో ఊహించని పరిణామం చోటుచేసుకన్నది. నిరసనకారులపై ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

కాల్పుల చప్పుడు వినపడగానే నిరసకారులు పరుగులు తీశారు. అది కాస్తా హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు.

పలువురికి గాయాలయ్యాయి. కాగా, కాల్పుల ఘటనను ధ్రువీకరించిన పోలీసులు ఘటన వెనక గల కారకులను మాత్రం వెల్లడించలేకపోయారు. అయితే అక్కడి స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. ఓ పెట్రోల్‌ స్టేషన్‌ గార్డుకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ ఈ హింసకు దారి తీసినట్టుగా తెలుస్తున్నది.

కాగా, బాధితులపై కాల్పులు మంగళవారం రాత్రి 11.45 గంటల ప్రాంతంలో(అమెరికా కాలమానం ప్రకారం) చోటుచేసుకున్నాయని కెనోషా పోలీసు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధితుల వివరాలను ఇంకా గుర్తించాల్సి ఉన్నదనీ, ఇప్పటికి ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేమని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించి నట్టు వివరించారు. కాగా, ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన పలు వీడియోలను కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.

నగరంలో తీవ్ర అశాంతి చెలరేగడంతో విస్కాన్సిన్‌ గవర్నర్‌ టోని ఎవర్స్‌.. పెద్ద మొత్తంలో జాతీయ భద్రత బలగాలను అక్కడకు పంపినట్టు తెలిపారు. శస్త్రచికిత్స పొందుతున్న జాకబ్‌ బ్లేక్‌ శరీరం చచ్చుబడిపోయిందని ఆయన తరఫు లాయర్‌ బెన్‌ క్రంప్‌ పత్రికా సమావేశంలో తెలిపారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆయన ఇక నడవలేరని ఆయన చెప్పారు.నల్లజాతీయుడు జాకబ్‌ బ్లేక్‌పై కెనోషాలో ఆదివారం పోలీసులు కాల్పులు జరపడంతో ఆయన తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

దీంతో ఈ ఘటన నగరంతో పాటు యావత్తు అమెరికాలో తీవ్ర నిరసనలకు దారి తీసింది. బ్లాక్‌ లివ్స్‌ మ్యాటర్‌ పేరిట ఆందోళనకారులు మరోసారి రోడ్డెక్కారు. కర్ఫ్యూలను, ఆంక్షలను లెక్కచేయకుండా వీధుల్లో తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. సోమవారం (అమెరికా కాలమానం ప్రకారం) నిరసనలతో విస్కాన్సిన్‌ ప్రాంతం దద్దరిల్లిన విషయం తెలిసిందే.

Courtesy Nava Telangana

Leave a Reply