ఫిష్‌.. ఫిని‌ష్..!

0
279
  • కరోనా దెబ్బకు చెరువుల్లోనే చేప
  • కాళేశ్వరంలో 24 లక్షల చేపలు, 8 లక్షల రొయ్యలు
  • సరస్సుల్లో ఏపుగా పెరుగుతున్న 2.65 కోట్ల చేపలు
  • లాక్‌డౌన్‌తో చేపల వేటకు మే 7 వరకు నో పర్మిషన్‌

భూపాలపల్లి : కరోనా దెబ్బకు చేప విలవిల్లాడుతోంది. లాక్‌డౌన్‌ ముగిసే వరకు జలాశయాల్లోని చేపల వేటకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. దీంతో జలపుష్పాలకు కొరత ఏర్పడింది. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం చేపల పిల్లలను మూడేళ్లుగా ఉచితంగా అందిస్తోంది. ఈ ఏడాది 7.5 కోట్ల చేప పిల్లలను సరఫరా చేసింది.  మత్స్యకారులు రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో చేపలు పెంచుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సీ ఫుడ్‌కు కేరా్‌ఫగా మార్చాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో గత నవంబరు, డిసెంబరు నెలల్లో మేడిగడ్డ బ్యారేజీలో 21 లక్షల చేప పిల్లలు, 6.99 లక్షల రొయ్యల సీడ్‌ను వదిలారు. అన్నారం బ్యారేజీలో 3.76 లక్షల చేపలు, 1.08 లక్షల రొయ్యలను పెంచుతున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 24.76 లక్షల చేపలు, 4.84 లక్షల రొయ్యలు ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలోని భీంగణపురం రిజర్వాయర్‌లో 6.90 లక్షలు, గణప సముద్రంలో 13 లక్షలు, ములుగు జిల్లాలోని రామప్ప సరస్సులో 17.18 లక్షలు, లక్నవరం సరస్సులో 16.67 లక్షలు, పాలెం ప్రాజెక్టులో 3.60 లక్షల చేప పిల్లలను వదిలారు.

ఈ రెండు జిల్లాల్లో మొత్తం 2.65 కోట్ల చేపలను పెంచుతున్నారు. చెరువులు, ప్రాజెక్టుల్లో చేపల వేట ఏటా ఏప్రిల్‌, మే నెలల్లోనే మొదలవుతుంది. ఈ సారి ఎస్సారెస్పీ నీళ్లు జలాశయాల్లోకి రావడంతో చేపల వేట ఆలస్యమైంది. ప్రస్తుతం రబీ పంటకు నీటిని వినియోగిస్తుండటంతో జలశయాల్లో నీటి మట్టం తగ్గింది. ఈ సమయంలో చేపలు పడితే ప్రయోజనం ఉంటుందని మత్య్సకారులు భావిస్తున్నారు. చేపలు పట్టేందుకు మత్స్యకారులు చెరువుల్లోకి గుంపులుగా వెళ్తారు. చేపలను కొనేందుకు ప్రాజెక్టులు, చెరువుల వద్దకు వ్యాపారులు భారీగా వస్తారు. ఈ చేపలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేయాలంటే రవాణా సదుపాయం ఉండాలి. ఈ మొత్తం క్రమంలో భౌతిక దూరం పాటించే అవకాశం ఉండదు. దీంతో కరోనా వైరస్‌ ఒకరికి ఉంటే వేలాది మందికి వ్యాపించే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

Courtesy Andhrajyothi

Leave a Reply