మజా మాటున మృత్యుగీతం!

0
228
  • రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకుల మృతి
  • స్నేహితుడి బర్త్‌ డే పార్టీ తర్వాత కారెక్కి రోడ్డుపైకి 
  • ఢీకొట్టిన ఇసుకలారీ.. నుజ్జునుజ్జయిన వాహనం
  • కారులోని ఐదుగురూ అక్కడికక్కడే మృత్యువాత
  • వరంగల్‌ రూరల్‌ పసరుగొండ వద్ద ఘోరం

మన ప్రేమ పెళ్లి బంధానికి ఏడాదితోనే నూరేళ్లు నిండాయా? నాకు, రెండు నెలల పసిగుడ్డుకు ఇక దిక్కెవరు? అంటూ గుండెలవిసేలా ఏడుస్తున్న ఓ యువతి! చేతికి అందివచ్చి.. కుటుంబ భారాన్ని మోస్తాడనుకుంటే ఒక్కగానొక్క కొడుకు మరలిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ రోదిస్తున్న తల్లిదండ్రులు!! ఈ రెండు కుటుంబాలే కాదు మరో మూడు కుటుంబాలదీ తరగని గుండె కోతే!! చెట్టంత ఎదిగిన ఐదుగురు యువకులు.. అంతా 19-23 ఏళ్లలోపు వారే! స్నేహితుడి పుట్టినరోజు వేడుకను ఆనందంగా జరుపుకొని తిరుగుముఖం పట్టిన వారి ప్రాణాలను రోడ్డు ప్రమాదం కబళించిందని తెలిసి కంటికి మంటికి ధారగా విలపిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరివల్లా కావడం లేదు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం పసరుగొండ క్రాస్‌ రోడ్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఎదురెదురుగా వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృత్యువాతపడ్డారు. మృతులను హన్మకొండ పెద్దమ్మగడ్డకు చెందిన జయప్రకాశ్‌(23), లష్కర్‌సింగారానికి చెందిన రోహిత్‌(20), నర్సంపేటకు చెందిన షేక్‌ సాబీర్‌(19), ములుగులోని వీవర్స్‌ కాలనీకి చెందిన నరేశ్‌(23), పోచమ్మమైదాన్‌కు చెందిన మేకల రాకేశ్‌(23)గా గుర్తించారు.

ఎలా జరిగింది? 
జయప్రకాశ్‌, షేక్‌ సాబీర్‌, రోహిత్‌, నరేశ్‌, రాకేశ్‌ స్నేహితులు. ఐదుగురు కలిసి మంగళవారం రాత్రి వరంగల్‌లో ఓ స్నేహితుడి జన్మదిన వేడుకలో పాల్గొన్నారు. అర్ధరాత్రి దాటాక వేడుక ముగిసిన అనంతరం నరేశ్‌ను ములుగులో దిగబెట్టి వచ్చేందుకు అందరూ కలిసి కారులో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం పసరుగొండ క్రాస్‌ రోడ్డు వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. కారును ములుగు వైపు నుంచి హైదరాబాద్‌ వైపు ఇసుక లోడ్‌తో వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురూ తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతదేహాలకు వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మార్చురీ ప్రాంగణంలో మృతుల కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. పలువురు ప్రజాపతినిధులు మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. ఘటనపై దామెర ఎస్సై భాస్కర్‌రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తీరని గుండెకోత 
మృతుల్లో మేకల రాకేశ్‌కు ఏడాది క్రితమే పెళ్లయింది. రెండు నెలల పాప ఉంది. ఓ ప్రైవేటు కంపెనీలో ఆయన పనిచేస్తున్నారు.  షేక్‌ సాబీర్‌.. పోచమ్మ మైదాన్‌లో ఓ బేకరీలో పనిచేస్తున్నారు. తల్లి నూర్‌జహాన్‌, ఖానాపూర్‌ బీసీ హాస్టల్‌ల్లో పనిచేస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో  కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారామె. జయ ప్రకాశ్‌ తల్లిదండ్రులు నర్సయ్య, సాంబక్కదీ ఇదే పరిస్థితి. ఒక్కగానొక్క కొడుకు పోయాడని… తమకు దిక్కెవరంటూ రోదిస్తుండటం కలచివేస్తోంది. ఇక రోహిత్‌, ఇంజనీరింగ్‌ ఫస్ట్‌ ఇయర్‌ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈయన తల్లిదండ్రులదీ నిరుపేద కుటుంబమే. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నరేశ్‌ తండ్రి సాంబయ్య కొన్నేళ్ల క్రితమే చనిపోయారు. తల్లి సరోజనతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న నరేశ్‌, లాక్‌డౌన్‌ కారణంగా ములుగుకు తిరిగొచ్చారు.

Courtesy Andhrajyothi

Leave a Reply