ఆ పోలీసు అధికారే దోషి

0
194
  •  ఫ్లాయిడ్‌ మృతి కేసులో అమెరికా న్యాయస్థానం తీర్పు
  • 40 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం!

వాషింగ్టన్‌: అమెరికాలో సంచలనం రేపిన.. ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ కస్టోడియల్‌ మృతి కేసులో మినియాపొలిస్‌ మాజీ పోలీసు అధికారి డెరెక్‌ చౌవిన్‌ (45)ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. గతేడాది మే 25న పోలీసు జులుం ప్రదర్శిస్తూ.. చౌవిన్‌ కర్కశత్వంతో ఫ్లాయిడ్‌ మెడపై గట్టిగా మోకాలితో తొక్కిపెట్టి ఊపిరాడకుండా చేయడంతో ఆయన చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ కేసును 12 మంది జ్యూరీ సభ్యులు విచారించారు. 8 వారాల్లో నిందితుడికి శిక్ష ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి పీటర్‌ కాహిల్‌ తెలిపారు. చౌవిన్‌కు 40 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉన్నట్లు అమెరికా మీడియా తెలిపింది. తాను నేరానికి పాల్పడలేదని చౌవిన్‌ కోర్టుకు తెలిపాడు. ఈ తీర్పుతో కోర్టు బయట, ఫ్లాయిడ్‌ స్వస్థలంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ తీర్పు ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ప్రభావం చూపుతుందని ఫ్లాయిడ్‌ కుటుంబ సభ్యులు, ఆయన తరఫు న్యాయవాది ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘అమెరికా నల్లజాతీయులకు న్యాయం జరగడం అంటే అమెరికన్లు అందరికీ న్యాయం జరిగినట్లే. అమెరికా చరిత్రలో ఈ కేసు ఓ మలుపుగా నిలిచిపోతుంది. చట్టం బాధ్యత, అమలుకు సంబంధించి స్పష్టమైన సందేశాన్ని పంపుతోంది’’ అని ప్రకటనలో తెలిపారు. తీర్పు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు ఫ్లాయిడ్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

‘‘జాత్యహంకారం మన దేశ ఆత్మకు ఓ కళంకం. అమెరికా నల్లజాతీయులను బాధించే గాయం.. ఈ బాధను వారంతా ప్రతిరోజూ అనుభవిస్తున్నారు. తాజా తీర్పు న్యాయాన్ని ఇచ్చింది. ఇక్కడితో మనం ఆగిపోకూడదు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కృషి చేయాలి. నేటి తీర్పు అమెరికా న్యాయవ్యవస్థలో గొప్ప ముందడుగు’’ అని బైడెన్‌ అన్నారు. ‘‘ఈ తీర్పు మనల్ని ఒకడుగు దగ్గర చేసింది. మనం చేయాల్సింది ఇంకా ఉంది’’ అని హారిస్‌ పేర్కొన్నారు.

Courtesy Eenadu

Leave a Reply