- సిద్దిపేట, గద్వాల జిల్లాల్లో ఘటనలు
- విచారణకు ఆదేశించిన మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట క్రైం, గట్టు : సిద్దిపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని గురుకులాల్లో కలుషిత ఆహారం తిన్న 193 మంది అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలల్లోనే వీరికి తక్షణ వైద్యం అందించగా, తీవ్ర అస్వస్థతకు గురైన పలువురిని ఆస్పత్రులకు తరలించారు. సిద్దిపేట పట్టణ శివారులోని బాలికల గురుకులంలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 326 మంది విద్యార్థినులు చదువుతున్నారు. వారికి ఆదివారం మధ్యాహ్నం చికెన్‌తో భోజనం పెట్టారు. మిగిలిన చికెన్ గ్రేవీని అదేరోజు రాత్రి వంకాయ కూరతో కలిపి వడ్డించారు. దీంతో అర్థరాత్రి నుంచి 128 మంది విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను పిలిపించి వారికి హాస్టల్‌లోనే వైద్యం చేశారు. ఇందులో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ శ్రీలతను వివరణ కోరగా.. తల్లిదండ్రులు పంపించిన జంక్‌ఫుడ్ తినడంతో ఆదివారం రాత్రి నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం వారందరూ బాగానే ఉన్నారని సమాధానాన్ని దాట వేశారు. కాగా, ఘటనపై విచారణ చేపట్టాలని విద్యాశాఖ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు సూచించారు. మరో ఘటనలో.. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో గల బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 65 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి విద్యార్థినులు భోజనం చేసి నిద్రించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. అప్రమత్తమైన పాఠశాల ప్రిన్సిపాల్ వాణి తీవ్ర అస్వస్థతకు గురైన 8 మందిని వెంటనే గద్వాల ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు రాజసింహ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పాఠశాలలో విద్యార్థులందరికీ వైద్య చికి త్స చేశారు. విద్యార్థినులు తిన్న చికెన్ కారణంగానే అస్వస్థతకు గురయ్యారని వైద్యాధికారి రాజసింహ ధ్రువీకరించారు.