ఆరోగ్య ఉత్పత్త్తులకే జై కొట్టు!

0
248
  • కరోనా కాలంలో వాటిదే హవా!
  • అధిక ఖర్చు ఇమ్యూనిటీ పెంపుకే
  • బ్రాండెడ్‌, ప్యాక్డ్‌ ఆహారం వైపే మొగ్గు
  • మూడింతలు పెరిగిన ‘బ్రాండెడ్‌’ అమ్మకాలు
  • లాక్‌డౌన్‌తో మారిన భారతీయుల అలవాట్లు

న్యూఢిల్లీ : సుబ్బారావు.. ఓ బండిపై చిన్న టిఫిన్‌ సెంటర్‌ నడుపుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ ముందు వరకు నిత్యం అతడి బండి ముందు జనం కిక్కిరిసేవారు. లాక్‌డౌన్‌ దెబ్బతో మూడు నెలలు వ్యాపారం బంద్‌ అయింది. సడలింపుల తర్వాత వ్యాపారం మళ్లీ మొదలెట్టగా.. రోజుకు పట్టుమని పది మంది కూడా రాకపోతుండడంతో బావురుమన్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న వీధి వ్యాపారులందరి పరిస్థితీ ఇదే. కారణం.. లాక్‌డౌన్‌ కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోవడమే. ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడమే. రోడ్డు పక్క ఆహారానికి పుల్‌స్టాప్‌ పెట్టి.. ఎక్కువగా బ్రాండెడ్‌, ప్యాక్డ్‌ ఫుడ్‌ తీసుకునేందుకే ఇష్టపడుతున్నారు.

తృణధాన్యాలు, ఇన్‌స్టెంట్‌ న్యూడిల్స్‌, తక్షణ శక్తినిచ్చే ఇతర ఆహార పదార్థాలతో పాటు అన్నం తినేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వాటిలోనూ బ్రాండ్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ప్రభావంతో.. మ్యాగీ న్యూడిల్స్‌ అమ్మకాలు ఈ త్రైమాసికంలో 10.7 శాతం పెరిగాయి. ఇదే విధంగా.. కిట్‌క్యాట్‌, మంచ్‌ తదితర బ్రాండెడ్‌ ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ కూడా భారీ వృద్ధిని నమోదు చేశాయి. ఇక బిస్కెట్‌ ప్యాకెట్ల అమ్మకాలయితే ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా పార్లే-జీ బిస్కెట్లు, స్నాకర్స్‌ రికార్డు అమ్మకాలు సాధించాయి. లాక్‌డౌన్‌ కాలంలో ప్రభుత్వ సంస్థలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ఈ బిస్కెట్‌ ప్యాకెట్లనే భారీగా కొనుగోలు చేసి పంపిణీ చేయడమే దీనికి కారణం.

ఇమ్యూనిటీకే ప్రాధాన్యం
ప్రపంచవ్యాప్తంగా జనులు తమలోని రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అందుకు సంబంధించిన ఆహారం తీసుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా భారత్‌లో ఇందుకోసం ఆయుర్వేదిక్‌ ఔషధాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో.. చ్యవన్‌ప్రాశ్‌ ఉత్పత్తుల అమ్మకాలు ఏకంగా 283 శాతం పెరిగాయి. డాబర్‌ ఇండియా లిమిటెడ్‌, హిమాలయ డ్రగ్‌ కంపెనీల ఉత్పత్తులకు మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఏర్పడింది. డాబర్‌ చ్యవన్‌ప్రాశ్‌ అమ్మకాలయితే ఏప్రిల్‌, జూన్‌ మధ్య ఏకంగా 700 శాతం పెరిగాయి. ప్రజలు ఆరోగ్య పరిరక్షణకే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఉత్పత్తుల కొనుగోలు వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

డిజిటల్‌ మార్కెట్‌..
కరోనా ప్రభావంతో డిజిటల్‌ మార్కెట్‌ ఒక్కసారిగా ఊపందుకుంది. ఈ రంగాన్ని రిలయన్స్‌.. కొత్త పుంతలు తొక్కిస్తోంది. ముఖాముఖి చర్చలు, బృంద చర్చలు తదితర ఆధునిక ఆప్షన్లతో దూసుకుపోతోంది. అలాగే.. ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, పాఠశాలలు ఆన్‌లైన్‌ బాట పట్టడంతో.. వీటికి సంబంధించిన ఉపకరణాలకు కూడా మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగిపోయింది. బైజూస్‌ లాంటి ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ యాప్‌లు విద్యార్థుల పాలిట కల్పతరువులుగా మారాయి.

పెరిగిన బంగారం తాకట్లు
లాక్‌డౌన్‌ దెబ్బకు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో.. ఉపాధి కోల్పోయిన వాళ్లు మరో సంపాదనా మార్గం దొరికే వరకు కుటుంబపోషణకు ఇంట్లోని బంగారం తాకట్టు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రభావంతో.. దేశంలోని గోల్డ్‌లోన్‌ సంస్థలు భారీ వృద్ధి రేటును నమోదుచేస్తున్నాయి. ఈ క్రమంలో ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఈ ఏడు 57 శాతం వృద్ధి సాధించగా, ‘మణప్పురం’.. 4.5 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. వీటన్నింటితో పాటు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ పరుగులు పెడుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుంచే షాపింగ్‌ చేసేందుకు ఇష్టపడుతుండడంతో.. ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది.

కరోనా.. ప్రజల్లో భయంతో పాటు చాలా మార్పులనే తెచ్చింది. ప్రజల అలవాట్లను మార్చేసింది. ఆలోచనలను మార్చేసింది. దృక్పదాన్ని మార్చేసింది. మొత్తం భారతీయుల జీవన శైలినే మార్చేసింది. వారి ఖర్చులను ప్రభావితం చేసింది. ఆరోగ్యంపై అలక్ష్యాన్ని పారద్రోలింది. శుభ్రతపై శ్రద్ధ పెంచింది. ఇమ్యూనిటీపై అవగాహన లేని వాళ్లను సైతం దాని గురించి చర్చించేలా చేసింది. దాన్ని పెంచుకునేందుకు ఆరాటపడేలా మార్చింది. ఈ పరిణామం మొత్తంగా భారతీయ మార్కెట్‌లోనే కొత్త పంథాకు శ్రీకారం చుట్టింది. 

Courtesy Andhrajyothi

Leave a Reply