భోజనంలో బల్లి.. విషతుల్యమైన ఆహారం

0
52
  • 33 మంది విద్యార్థులకు అస్వస్థత
  • ఎంజీఎంకు 11 మంది తరలింపు .. ఆరుగురి పరిస్థితి విషమం!
  • వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఘటన

వర్ధన్నపేట : బల్లి పడిన భోజనం తిన్న 33 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలోని గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, విద్యార్థులు, అధికారుల కథనం ప్రకారం.. వర్ధన్నపేటలోని ఆశ్రమ పాఠశాలలో 192 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 150 మంది విద్యార్థులు హాజరు కాగా, రాత్రి 7 గంటల తర్వాత విద్యార్థులకు వడ్డించే భోజనంలో ఓ విద్యార్థినికి బల్లి కనబడడంతో వంట మాస్టర్‌కు విషయం చెప్పారు. వంట మాస్టర్‌ నిర్లక్ష్యంగా ఏమీ కాదని పేర్కొంటూ విద్యార్థినులకు భోజనం వడ్డించాడు. ఆ భోజనం తిన్న 33 మంది విద్యార్థులు గంట తర్వాత కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. కొందరైతే కడుపునొప్పిని బరించలేక అరుపులు.. పెడబొబ్బలు పెట్టారు. విషయం తెలుసుకున్న స్థానికులు 108 అంబులెన్స్‌ను రప్పించి, విద్యార్థినులను వర్ధన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నర్సింహస్వామి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అస్వస్థతకు గురైనవారిలో 7, 8, 9 తరగతులకు చెందినవారే అధికంగా ఉన్నారని వివరించారు. ఎంజీఎంకు తరలించిన ఎనిమిది మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వి.చంద్రశేఖర్‌కు ఫోన్‌చేసి విద్యార్థుల పరిస్థితిపై ఆరాతీశారు. అవసరమైతే హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించాలని సూచించారు.

Leave a Reply