బతుకింతే..!

0
25

– దేశంలో పెరిగిన పేదల సంఖ్య
– 2011 జనాభా లెక్కలతో అర్హులందరికీ అందని పథకాలు
– కొత్త లెక్క కావాలే… ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కవరేజీపై నిపుణులు

న్యూఢిల్లీ : దేశంలో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద పేదలకు, వలస కార్మికుల ఆకలిని తీర్చాలి. యూపీఏ హయాంలో తీసుకొచ్చిన ఈ చట్టం.. 2011 జనాభా లెక్కలను అనుసరించే దేశంలో అమలవుతున్నది. అయితే, అప్పటి లెక్కలతో ఈ పథకాన్ని కొనసాగిస్తే దేశంలో పెరిగిన పేదల పరిస్థితి ఏమిటనీ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పేదలు నష్టపోయే ప్రమాదమున్నదని హెచ్చరించారు. ఈ విషయంలో అలసత్వం వహించకుండా మోడీ ప్రభుత్వం 2021 జనాభా అంచనా లెక్కలను పరిగణలోకి తీసుకొని పథకాన్ని క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్దిదారులకు అందేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం వలస కార్మికుల శ్రేయస్సు, ఆహార అసురక్షితతకు సంబంధించి ఒక ఉత్తర్వును జారీ చేసిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేశారు. ” ఇందులో ముఖ్యంగా ఐదు ప్రధాన ఆదేశాలు ఉన్నాయి. ఇందులో ఐదోది చాలా ప్రధానమైనది. జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013 (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) లోని సెక్షన్‌ 9 కింద సబ్సీడీతో కూడిన ఆహార ధాన్యాలు స్వీకరించడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అర్హత ఉన్న మొత్తం వ్యక్తుల సంఖ్యను తిరిగి నిర్ణయించడానికి ప్రక్రియ చేపట్టాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. ప్రచురించిన జనాభా లెక్కల ఆధారంగా ఈ సంఖ్య నిర్ణయించబడుతుందని చట్టంలోని సెక్షన్‌ 9 పేర్కొన్నది. ఇక సెక్షన్‌ 3 ప్రకారం గ్రామీణ జనాభాలో 75 శాతం వరకు, పట్టణ జనాభాలో 50 శాతం వరకు సబ్సిడీతో కూడిన ఆహార ధాన్యాలు అందించవచ్చు. 2011-12 నాటి జనాభా, గృహ వినియోగ అంచనాల ప్రాతిపదికన దాని లబ్దిదారుల రిజిస్ట్రీ ప్రస్తుతం ఉన్నది. అయితే, ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద కవరేజ్‌ యొక్క పునర్నిర్మాణాన్ని సుప్రీంకోర్టు భావించిందని గమనించవచ్చు. కాగా, 2016-17 నుంచి దేశంలో ఆర్థిక మంద గమనం, కోవిడ్‌-19 మహమ్మారి విజృంభణ వల్ల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నది” అని వారు తెలిపారు.

అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధనలో మహమ్మారి కారణంగా అదనంగా 23 కోట్ల మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువకు పడిపోయారు. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ చేసిన ఒక విశ్లేషణ ప్రకారం భారతదేశంలో పేదవారి సంఖ్య 7.5 కోట్లు పెరిగి ఉండొచ్చు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ సెక్షన్‌ 3(2) ప్రకారం.. జనాభా లెక్కల ప్రకారం ప్రచురించబడిన గణాంకాల ప్రకారం కవరేజ్‌ గ్రామీణ జనాభాలో 75 శాతం, పట్టణ జనాభాలో 50 శాతం మించకూడదు. అయితే, మహమ్మారి కారణంగా 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు ప్రారంభం కాలేదు. దీంతో 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కవరేజ్‌ ఉండొచ్చని కేంద్రం వాదించే అవకాశాలు ఉన్నాయి. అంటే దీని ప్రకారం లబ్దిదారుల సంఖ్య 81.3 కోట్లు. అయితే, 2011 గణాంకాల ప్రకారమే ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏను అమలు చేస్తే దేశంలో పెరిగిన పేదలు నష్టపోయే ప్రమాదమున్నదని నిపుణులు తెలిపారు. అర్హులను అంచనా వేసే విషయంలో కేంద్రం వద్ద కనీస సమాచారం లేకపోవడం మోడీ సర్కారు అశ్రద్ధను తెలియబరుస్తున్నదని వారు ఆరోపించారు. నేషనల్‌ కమిషన్‌ ఆఫ్‌ పాపులేషన్‌, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రచురించిన 2019 జనాభా అంచనాలను ఆమోదించి పరిగణలోకి తీసుకోవాలని ‘ది రైట్‌ టు ఫుడ్‌ క్యాంపెయిన్‌’ డిమాండ్‌ చేసింది. కాగా, 2021 నాటికి దేశ జనాభాను కమిషన్‌ 136 కోట్లుగా అంచనా వేసింది. ఒకవేళ కవరేజీని 67.2శాతం జనాభాకు పెంచితే మరో 10.2 కోట్ల మంది ప్రజలు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద సబ్సిడీ ఆహార ధాన్యాలను పొందుతారు.

Courtesy Nava Telangana

Leave a Reply