విదేశీ మీడియా హల్చల్

0
94

– కాశ్మీర్‌పై వాస్తవ విషయాలను వెల్లడిస్తున్న అంతర్జాతీయ పత్రికలు
– మోడీ సర్కారుకు మింగుడుపడని ఎడిటోరియల్స్‌
– జీర్ణించుకోలేకపోతున్న బీజేపీ సర్కారు

న్యూఢిల్లీ: మూడు మాసాల క్రితం కాశ్మీర్‌పై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ విదేశీ మీడియా ఇస్తున్న కవరేజీ మోడీ సర్కారుకు మింగుడుపడటం లేదు. ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పటి నుంచి మీడియాపై ఆంక్షలు విధించినా స్థానిక ప్రజలు, బాధితులు, స్ట్రింగర్ల సాయంతో విదేశీ పత్రికలు వాస్తవాలను వెల్లడిస్తున్నాయి. ఆగస్టు 5 తర్వాత ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ.. అల్‌జజీరా (ఖతార్‌), బ్లూమ్‌బర్గ్‌, ది న్యూయార్క్‌ టైమ్స్‌, లాస్‌ ఏంజిల్స్‌ టైమ్స్‌ (యూఎస్‌), సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ (హాంగ్‌కాంగ్‌), ఫైనాన్సియల్‌ టైమ్స్‌, ది గార్డియన్‌ (యూకే) వంటి విదేశీ మీడియా సంస్థలు మోడీ సర్కారు తీరును బహిరంగంగానే విమర్శించాయి. ఇది ‘చీకటి రోజు’ అని అల్‌జజీరా వెలువరించగా.. ‘ఒక తీవ్రమైన నిర్ణయం’ అని బ్లూమ్‌బర్గ్‌.. ‘కాశ్మీర్‌కున్న పరిమిత స్వయం ప్రతిపత్తి పునరుద్ధరణ’ అని లాస్‌ఏంజెల్స్‌ టైమ్స్‌ ప్రచురించింది.

370 అధికరణం రద్దు చేసిన తర్వాత ది న్యూయార్క్‌ టైమ్స్‌ ఓ ఎడిటోరియల్‌ ప్రచురిస్తూ.. ‘ఈ నిర్ణయంతో కాశ్మీర్‌ ప్రజలకూ భారతీయులు పొందుతున్న అన్నీ హక్కులు దక్కుతాయి’ అంటూ హౌస్టన్‌లో మోడీ చేసిన ప్రసంగాన్ని ఎండగట్టింది. ‘ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించి చేసిన అసంబద్ధ ప్రకటన కారణంగా అక్కడి ప్రజలు సైనికపాలనలోకి నెట్టబడ్డారు’ అని అది విమర్శించింది. భారతీయ మీడియా కవర్‌ చేయని పెల్లెట్‌ గన్‌, నాయకుల గృహ నిర్బంధాలు, పిల్లలు, పెద్దవాళ్లు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, మానవహక్కుల ఉల్లంఘన, బాధితులపై భద్రతా దళాల ఆగడాలన్నీ విదేశీ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో మోడీ సర్కారుకు ఇది మరింత కంటగింపుగా మారింది. కాశ్మీర్‌లో అంతా ప్రశాంతంగానే ఉందని నమ్మబలుకుతున్న కేంద్రం.. ఇంకా అక్కడ ఆంక్షల నీడలోనే ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నది. ఈ క్రమంలోనే ఈ మధ్యే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌ మాట్లాడే పశ్చిమ మీడియా కాశ్మీర్‌ అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఇదే తమకు అతిపెద్ద సవాల్‌గా మారిందనీ ఆయన చెప్పడం గమనార్హం.

ఇక ఇదే అంశంపై ప్రధాని మోడీ ఈనెల 2న అహ్మదాబాద్‌లోని ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ప్రపంచ దేశాల్లో భారత కీర్తి మరింత పెరిగిందనీ, అంతార్జాతీయ సమస్యలు పరిష్కరించడంలో భారత్‌ కీలక పాత్ర పోషించనుందని చెప్పారు. ఆ మరుసటి రోజే అల్‌జజీరా ‘అణగారిన, భయపడుతున్న కాశ్మీర్‌’ అంటూ ఓ నివేదిక ప్రచురించింది. అంతకుముందే కాశ్మీర్‌ స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నాలుగు రోజులకు శ్రీనగర్‌లోని సౌరాలో నిరసనకారులపై భద్రతాదళాలు ప్రయోగించిన టియర్‌గ్యాస్‌, పెల్లెట్ల దాడిపైనా ఓ వీడియోను విడుదల చేసింది. బీబీసీ సైతం ఈ వీడియోను ప్రసారం చేసింది. దీనిని కేంద్రం ఖండిస్తూ అదో కల్పిత వీడియోగా కొట్టిపారేసినా నిజాలను వెలికితీసే ‘ఆల్ట్‌ న్యూస్‌’ ఆ వీడియో నిజమైనదే అని నిర్ధారించింది. ఇక రాయిటర్స్‌, ఎఎఫ్‌పీ, ఏపీ వంటి మీడియాలూ కాశ్మీర్‌లో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడూ వెలుగులోకి తెస్తున్నాయి.

మీడియా సంస్థలతో పాటు పలువురు విదేశీ నాయకులు, చట్టసభ్యులూ మోడీ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి బెర్నీ సాండర్స్‌ స్పందిస్తూ.. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఓ) కల్పించుకోవాలని కోరారు. యూకే లేబర్‌పార్టీ నాయకుడు జె.కార్బీన్‌ మాట్లాడుతూ.. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని అన్నారు. భారత సర్కారు తీరుపై స్వీడీష్‌ ఉప ప్రధాని మార్గట్‌ వాల్‌స్ట్రాం బహిరంగంగానే విమర్శలు చేశారు. గతనెలలో ఒక రిపబ్లికన్‌, 14 మంది యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యులు కలిసి.. కాశ్మీర్‌లో ఆంక్షలు ఎత్తివేయాలని మోడీని కోరారు. ఈ నేపథ్యంలోనే యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)కు చెందిన 27 మంది ఎంపీలు కాశ్మీర్‌లో పర్యటించడం గమనార్హం.

Courtesy Nava Telangana..

Leave a Reply