40,000 ఉద్యోగాలు మటాష్‌!

0
200

  • మధ్య స్థాయిలో ఉన్న వారికే గండం
  • ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ఓ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌

బెంగళూరు: వృద్ధి మందగించిన నేపథ్యంలో దేశీయ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడంపై దృష్టిసారించాయని ఐటీ పరిశ్రమ ప్రముఖుడు, ఇన్ఫోసిస్‌ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ ఓ) టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో కంపెనీలు మధ్య స్థాయిలో 30 వేల నుంచి 40 వేల వరకు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి అవకాశం ఉందన్నారు.

పరిశ్రమ పరిణతి చెందుతున్న నేపథ్యంలో ఐదేళ్లలో ఒకసారి ఇలా ఉద్యోగాల కోత జరగడం సాధారణ పరిణామమేనన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏదైనా ఒక రంగం పరిణతి చెందుతున్నప్పుడు మధ్య స్థాయిలో అనేక మంది ఉంటారని, వీరు తాము పొందే వేతనానికి తగిన విలువను అందించలేకపోతారని అన్నారు. కంపెనీలు వేగవంతంగా వృద్ధి చెందుతున్నప్పుడు పదోన్నతులు బాగానే ఉంటాయని, కానీ వేగం తగ్గినప్పుడు పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలు మార్పులు చేర్పులు చేసుకుంటాయని చెప్పారు. ఇలాంటి తరుణంలో కంపెనీలు ఉద్యోగులను తొలగించే దిశగా చర్యలు తీసుకుంటాయన్నారు.

ఇది ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరుగుతూనే ఉంటుందన్నారు. మంచి పనితీరు కనబరచకుండా, విలువను అందించకుండా అధిక వేతనాన్ని పొంద డం ఎవరికీ సాధ్యపడదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నప్పటికీ వారు నిష్ణాతులైతే దాదాపు 80 శాతం మంది ఉద్యోగ అవకాశాలను పొందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు.

రేట్లు తగ్గించమంటూ కంపెనీలపై ఒత్తిడి
భారత ఐటీ కంపెనీలు తమ క్లయింట్ల నుంచి వసూలు చేసే రేట్లకు సంబంధించి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. రేట్లను తగ్గించాలని క్లయింట్లు డిమాండ్‌ చేస్తున్నారని, వ్యయాలను ఆదా చేసుకునేందుకు కట్టుబడాలని కూడా సూచిస్తున్నట్టు చెబుతున్నారు.

Courtesy AndhraJyothy..

Leave a Reply