అయ్యో.. డాక్టర్‌!

0
472
అయ్యో.. డాక్టర్‌!
  • ఒత్తిడితో చిత్తవుతున్న వైద్యులు
  • అకస్మాత్తుగా కుప్పకూలి మరణం
  • నెల రోజుల్లోనే నలుగురి మృతి
  • ఎక్కువ మందిని.. ఎక్కువ గంటలు
  • చూడాల్సి రావడంతో ఒత్తిడి
  • టార్గెట్లు, క్లినికల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్ట్రెస్‌..
  • ఇతర నిపుణుల్లోనూ ఇదే స్థితి’

డాక్టర్‌ ఏకే మీనా. న్యూరో ఫిజీషియన్‌గా సుపరిచితులు. లండన్‌లో ఓ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ కుప్పకూలిపోయారు. నాలుగు రోజులపాటు బతుకు పోరాటం చేసి కన్నుమూశారు.

డాక్టర్‌ సత్య రమణ. గైనకాలజిస్టు. ఆపరేషన్‌ చేసిన తర్వాత థియేటర్‌ నుంచి బయటకు వచ్చారు. ఒక్కసారిగా కుప్పకూలి మరణించారు.

ఆయన.. ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఈఎన్‌టీ డాక్టర్‌. ఆదివారం బ్యాడ్మింటన్‌ ఆడుతూ కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఎల్బీ నగర్‌లో వైష్ణవి ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ అజయ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు కారణం.. మానసిక వేధింపులు!!

 హైదరాబాద్‌ సిటీ : వారు ఆగిపోతున్న గుండెకు ఊపిరి పోస్తారు. అలసిన ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ అందిస్తారు. ప్రాణాపాయంలో వచ్చే వారికి ఆపద్బాంధవులుగా నిలుస్తారు. కానీ, తీవ్ర ఒత్తిడి కారణంగా ఇప్పుడు వాళ్లే అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇతరుల గుండె చప్పుడు వినే వారి గుండెలు అవిసిపోతున్నాయి! తమకు తెలియకుండానే కుప్పకూలిపోతున్నారు. ఇందుకు కారణం.. విపరీతమైన ఒత్తిడి. సుదీర్ఘ పని గంటలు! ఉదయం 8 గంటలకు ఓపీ మొదలైతే.. సాయంత్రం ఐదారు గంటల వరకు చూడాల్సి వస్తోంది. మధ్యాహ్నం 12 నుంచి 1 గంటలోపే భోజనం చేయాలని అందరికీ సూచించే వైద్యులు మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు కానీ చేయలేని పరిస్థితి ఉంటోంది. రోగులను చూసే ధ్యాసలో వారు వేసుకునే మందుల సమయాలను పట్టించుకోవడం లేదు.

కొంతమంది డాక్టర్లు అసలు తమకు సమస్య ఉందని కూడా గుర్తించడం లేదు. మరికొందరు గుర్తించినా.. పట్టించుకునే తీరిక వారికి ఉండడం లేదు. చివరకు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. నిజానికి, తనకు గుండె సమస్య ఉందని డాక్టర్‌ మీనాకు తెలుసు. లండన్‌లో జరిగే సదస్సుకు వెళ్లవద్దని కొందరు, వెళ్లాలని కొందరు సూచించారు. ‘నేను డాక్టర్‌నే కదా. ఇబ్బంది కలిగితే గుర్తించలేనా!?’ అనే ధీమాతో ఆమె వెళ్లారు. అక్కడ మాట్లాడుతూనే కుప్పకూలిపోయారు. ఇలాగే.. ఎందరికో ప్రాణాలు పోస్తున్న డాక్టర్లు తమ ప్రాణాలను పట్టించుకోవడం లేదు. వైద్య వృత్తిలో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఒత్తిడితో నలిగిపోతున్నారు.

ఒక్క డాక్టర్లు మాత్రమే కాదు.. వివిధ వర్గాలవారు కూడా ఇప్పుడు ఒత్తిడికి చిత్తవుతున్నారు. పని ఒత్తిడితో ప్రాణాలనే వదులుతున్నారు.

చుట్టుముడుతున్న ఒత్తిళ్లు
డాక్టర్ల ఒత్తిళ్లకు అనేక రకాల కారణాలు ఉంటున్నాయి. కొంతమంది వైద్యులపైనే రోగులకు అపార నమ్మకం ఉంటోంది. వారి వద్దకు వెళ్లడానికే ఇష్టపడుతున్నారు. దాంతో, కొంతమంది వైద్యుల వద్ద రోగుల క్యూ చాలా ఎక్కువగా ఉంటోంది. కొంతమంది డాక్టర్ల వద్ద అయితే తెల్లవారు జామున 5 గంటలకే చాంతాడంత క్యూ ఉంటోంది. రోగులు తమ వద్దకే వస్తుండడంతో వారిని కాదనలేక ఎక్కువ మందికి వైద్య పరీక్షలు చేస్తుండడంతో తెలియకుండానే ఒత్తిడి పెరుగుతోంది. చందానగర్‌లో ఓ డాక్టర్‌ ఉన్నారు. ఆయన హస్తవాసిపై నమ్మకంతో పెద్దఎత్తున రోగులు వచ్చేవారు. తాకిడిని తట్టుకోలేక ఆయన రేట్లు పెంచేశారు. అయినా, రోగులు తగ్గలేదు. దాంతో, ఇప్పుడు కొన్ని రోజులపాటు చెప్పాపెట్టకుండా వెళ్లిపోతూ ఉంటారు. డాక్టర్‌ ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో తెలియదు.

దాంతో కొంతమేరకు రోగుల తాకిడి తగ్గింది. మరికొందరు డాక్టర్లు ఆస్పత్రి నుంచి ఏ సమయంలో ఫోన్‌ వచ్చినా పరుగులు పెట్టాల్సి వస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత వారంలో రెండుసార్లు అయినా వెళ్లాల్సి వస్తోంది. దాంతో, వారు నిద్రకు దూరం కాకతప్పడం లేదు. తమకు తెలియకుండానే ఒత్తిడిలో గడిపేస్తున్నారు. ప్రతి రోజూ వైద్యులు కనీసం 18 గంటలపాటు రోగుల పరిశీలన, పర్యవేక్షణలో ఉంటున్నారని చెబుతున్నారు. ఇక, కొన్ని శస్త్రచికిత్సలను తెల్లవారు జామున ఐదు గంటలకే నిర్వహిస్తుంటారు. అది పూర్తయిన తర్వాత వార్డుల్లో రౌండ్లు.. తర్వాత ఓపీలో రోగుల క్యూ పెద్దగా ఉంటుంది. వారందరినీ చూసేసరికి ఏ సాయంత్రమో అవుతుంది. ఈ క్రమంలో నిద్ర, తిండి విషయాలను కూడా వైద్యులు మరిచిపోతున్నారు.

 అర్ధరాత్రి కూడా ఫాలో అప్‌
వైద్యులపై విపరీతంగా స్ట్రెస్‌ పెరుగుతోంది. ఓ రోగి వచ్చిన నాటి నుంచి అతను ఇంటికి వెళ్లేంత వరకూ ఎలాంటి వైద్యం అందించాలనే అంశంపై వైద్యులు తీవ్రంగా మదనపడుతుంటారని డాక్టర్లు వెల్లడించారు. ఆపరేషన్‌ చేసిన రోజు ప్రతి గంటకు అతని యోగక్షేమాలు తెలుసుకోవడంలోనే నిమగ్నమవుతుంటారని, ఈ సమయంలో నిద్రాహారాలు కూడా మరిచిపోతుంటారని తెలిపారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫాలో అప్‌లో ఉండాల్సి వస్తోంది. ‘‘వార్డులో రోగిని ఓ పది నిమిషాలపాటు డాక్టర్‌ వచ్చి చూసిన విషయమే కుటుంబ సభ్యులకు తెలుసు. కానీ, ఆ రోగి గురించి 24 గంటలపాటు వైద్యులు ఫాలో అప్‌లో ఉండక తప్పదు’’ అని ఓ డాక్టర్‌ వివరించారు.
ఒత్తిడి బాబోయ్‌..
వైద్యులపై క్లినికల్‌, అడ్మినిస్ట్రేషన్‌ స్ట్రెస్‌ ఎక్కువగా ఉంటోంది. ఆస్పత్రిని నెలకొల్పిన వైద్యులు దాని నిర్వహణ, రుణాలు, భాగస్వాముల మధ్య భేదాభిప్రాయాలు ఈ ఒత్తిడికి గురిచేస్తున్నాయి. మరోవైపు, రోగుల అంచనాలు పెరిగిపోయాయి. కార్పొరేట్‌ ఆస్పత్రికి పోతే ప్రాణాలు దక్కుతాయని నమ్ముతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో టార్గెట్లను పూర్తి చేయడానికి డాక్టర్లు సతమతమవుతున్నారు.

సగటు వయసు 59 ఏళ్లేనా..!!
అందరి జీవన ప్రమాణం సగటున 70 ఏళ్లు ఉండగా, వైద్యుల ఆయుః ప్రమాణం మాత్రం 59 ఏళ్లుగానే పేర్కొంటున్నారు. ఐఎంఏ గతంలో నిర్వహించిన ఓ సర్వేలో వైద్యులు ఎక్కువ శాతం 54 ఏళ్ల వయసులోపే చనిపోతున్నట్లు తేలింది. మన దేశంలో 30 శాతం వైద్యులు డిప్రెషన్‌ బాధపడుతున్నారని, ఆత్మ హత్య చేసుకోవాలనే ఆలోచన 17 శాతం మందికి వచ్చిందని సర్వే తేల్చింది. 80 శాతం అధిక రక్తపోటు, 60 శాతం స్ట్రెస్‌తో సతమతమవుతున్నట్లు తెలిపింది.

 ఈ డాక్టర్‌.. ఒక ఉదాహరణ
అపోలో గ్రూప్‌ ఆస్పత్రులకు ప్రెసిడెంట్‌ డాక్టర్‌ హరిప్రసాద్‌. రైలు వేగంతో పరుగులు పెడుతూ ఆయన ఆలోచనలు ఉంటాయి. ఆస్పత్రిలో ఏదైనా సమస్య వస్తే క్షణాల్లో పరిష్కరించి మార్గాన్ని చూపే దిక్సూచి. ఆయనకు షుగర్‌, బీపీ ఉన్నాయి. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటారు. ఇందుకు ప్రతిసారి ఆయన వద్ద 20 ఎంఎల్‌ రక్తాన్ని మాత్రమే సేకరించి పరీక్షలకు పంపేవారు. ఓసారి ల్యాబ్‌ టెక్నీషియన్‌ 20 ఎంఎల్‌ బదులు 40 ఎంఎల్‌ రక్తాన్ని సేకరించారు. మిగిలిపోయిన 20 ఎంఎల్‌ రక్తాన్ని పడేయడం ఎందుకని భావించిన ఆ ల్యాబ్‌ టెక్నీషియన్‌ కంప్లీంట్‌ బ్లడ్‌ పిక్చర్‌ (సీబీపీ)కి పంపించారు.

అందులో ఆయనకు బ్లడ్‌ కేన్సర్‌ ఉందని నిర్ధారణ తేలడంతో డాక్టర్‌ హరిప్రసాద్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మరోసారి పరీక్షలు చేస్తే ఇదే విషయం తేలింది. ఆయన డాక్టర్‌ అయినా నిత్యం గుట్కాలు, పాన్‌ పరాగ్‌ అలవాటు ఉంది. కానీ, కేన్సర్‌ మహమ్మారి తనను చుట్టుముడుతుందని పసిగట్టలేకపోయారు. చివరికి, చికిత్స చేయించుకుని కేన్సర్‌ను జయించారు. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యారు. ఇటీవల ఆవిష్కరించిన ‘ఐయామ్‌ పాజిబుల్‌’ పుస్తకంలో ఆయనే ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఇలాగే చాలామంది వైద్యులకు తమకు షుగర్‌, బీపీ ఉన్న విషయం కూడా తెలియడం లేదు.

పెర్ఫార్మెన్స్‌ ఒత్తిడి
కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో టార్గెట్లు ఉంటున్నాయి. ఇంత మందిని చూడాలని, పరీక్షలు రాయాలని సూచిస్తున్నారు. ఇది వైద్యులపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తోంది. కొత్తగా వచ్చిన వారిపై మరింత ప్రభావం ఉంటోంది. ప్రతి వారం, నెల వైద్యుల పెర్ఫార్మెన్స్‌ను యాజమాన్యం చూస్తోంది. ఆశించిన స్థాయిలో లేకపోతే అతనికి ఉద్యోగం అక్కడ కష్టమే. ఇవి వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి.
డాక్టర్‌ సంజీవ్‌సింగ్‌ యాదవ్‌, సెక్రటరీ జనరల్‌, ఐఎంఎ
రిలాక్స్‌ లేక టెన్షన్‌
వృత్తిలో మరింత అభివృద్ధి సాధించాలనే ధ్యాస.. ఎక్కువ పేరు తెచ్చుకోవాలన్న తపన.. ఫాలో అప్‌లు, పరీక్షలతో డాక్టర్లకు రిలాక్స్‌ ఉండడం లేదు. ఆరు నెలలకోసారి పరీక్షలు చేసుకోవాలని రోగులకు సూచించే వైద్యులు తాము మాత్రం నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రతి రోజు 20 కంటే ఎక్కువ మందిని చూడకూడదనే నియమం పెట్టుకోవాలి. 30 నుంచి 45 నిమిషాలకు ఒక రోగిని పరిశీలించే విధానాన్ని అవలంబించాలి.
డాక్టర్‌ సీహెచ్‌ గోపాల్‌,
సీనియర్‌ న్యూరో ఫిజీషియన్‌, సన్‌షైన్‌ ఆస్పత్రి
జబ్బులతో వైద్యులు
నాతో పనిచేసే డాక్టర్‌ ఒకరికి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళితే గుండెనొప్పి ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. చాలా మంది తమకు జబ్బులున్న విషయం పసిగట్టలేకపోతున్నారు. ఒత్తిడితో ఎక్కువ మంది స్మోకింగ్‌ చేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. చాలా మందికి న్యూట్రిషన్‌పై అవగాహన లేదు. ప్రస్తుత యువ వైద్యుల్లో 36 శాతం మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు.
డాక్టర్‌ భక్తియార్‌ చౌదరి,
స్పోర్ట్స్‌ మెడిసిన్‌
ఎమర్జెన్సీ చికిత్సతో ఒత్తిడి
అత్యవసర స్థితిలో వచ్చిన రోగికి చికిత్స చేయడానికి వైద్యులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రోగి చనిపోతే డాక్టర్‌కు నరకమే. రోగి బంధువులు దాడులు చేస్తున్నారు. దాంతో, గుండెపై విపరీతమైన స్ట్రెస్‌ పడుతోంది. ఎక్కువ మందిని రోగులను చూసే క్రమంలో డాక్టర్లు ఒత్తిడికి గురవుతున్నారు. డాక్టర్లు గ్రూప్‌గా ఏర్పడి చికిత్స అందించాలి.

డాక్టర్‌ గోపీచంద్‌ మన్నం, ఎండీ, స్టార్‌ ఆస్పత్రి

Courtesy Andhrajyothi

Leave a Reply