రాష్ట్రంలో అప్పుల బాధతో ఇద్దరు అన్నదాతలు.. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఇద్దరు నిరుద్యోగులు ప్రాణాలు తీసుకున్నారు. లక్షల్లో అప్పు చేసి పంట సాగు చేస్తే దిగుబడి రాక ఖమ్మం జిల్లాలో ఓ రైతు, సిరిసిల్ల జిల్లాలో మరో రైతు ఉరివేసుకున్నారు. జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా ఫలితం ఉండటం లేదని మనస్తాపం చెంది సిరిసిల్లలో ఓ యువకుడు పురుగుల మందు తాగి, ఆదిలాబాద్ జిల్లాలో మరో యువకుడు ఉరి వేసుకొని చనిపోయారు.
అప్పుల బాధతో ఇద్దరు రైతులు..
తల్లాడ/కోనరావుపేట: ఖమ్మం, సిరిసిల్ల జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బాలపేట గ్రామానికి చెందిన పులి వెంకట్రామయ్య (40) తనకున్న ఎకరం పొలంతో పాటు మరో4 ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశాడు. కాపు దశలో తెగుళ్లు సోకి మిర్చి పంట పూర్తిగా దెబ్బతింది. పంట కోసం రూ. 5 లక్షల దాకా అప్పులు చేశాడు. నిరుడు కూడా మిర్చి పంటలో ఆశించిన దిగుబడి రాలేదు. 3 నెలల కింద ఆయన తండ్రి అనారోగ్యానికి గురికాగా.. ట్రీట్మెంట్కు రూ. లక్ష పైనే ఖర్చయింది. అయినా తండ్రి బతకలేదు. ఇటీవల కుటుంబ సభ్యులకు డెంగీ జ్వరం రావడంతో హాస్పిటల్లో దాదాపు రూ. 2 లక్షల దాకా ఖర్చయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేక జత ఎడ్లను రూ. 50 వేలకు అమ్మేశాడు. దాదాపు రూ. 10 లక్షల పైనే అప్పులయ్యాయి. అప్పుల బాధతో సోమవారం తెల్లవారు జామున ఇంటి వెనకాల రేకుల షెడ్డు వాసానికి వెంకట్రామయ్య ఉరి వేసుకొని చనిపోయాడు.
దాదాపు రూ. 10 లక్షల పైనే అప్పులయ్యాయి. అప్పుల బాధతో సోమవారం తెల్లవారు జామున 5 గంటలకు ఇంటి వెనకాల రేకుల షెడ్డు వాసానికి వెంకట్రామయ్య ఉరి వేసుకొని చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామానికి చెందిన సంకినేని అంజల్ రావు (57) తనకున్న 10 గుంటల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల ఇద్దరు ఆడబిడ్డలకు పెండ్లిళ్లు చేశాడు. పంట సాగుకు, పిల్లల పెండ్లిళ్లకు కలిపి రూ. 5 లక్షల దాకా అప్పయింది. అప్పుల బాధతో అంజల్‌రావు సోమవారం ఉదయం తన ఇంటిపక్కన ఉన్న పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నోటిఫికేషన్లు రాక ఇద్దరు నిరుద్యోగులు..
సిరిసిల్ల కలెక్టరేట్/ఇచ్చోడ : ఎంత చదివినా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదన్న బాధతో ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. సిరిసిల్లలోని అశోక్‌నగర్‌కు చెందిన కల్లూరి వెంకటేశ్(26) రెండేండ్ల కిందట బీటెక్ చేశాడు. పోటీ పరీక్షల కోసం ప్రిపేరవుతున్నాడు. నోటిఫికేషన్లు లేక ఉద్యోగం రావడం లేదని మనస్తాపం చెందిన వెంకటేశ్ ఆదివారం ఇంట్లో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎల్లారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం బుద్దికొండ గ్రామానికి చెందిన దాసరి ఓంకార్(24) పాలిటెక్నిక్ చదివాడు. ఉద్యోగం కోసం ఎంత ప్రిపేర్ అయినా లాభం లేకపోవడంతో పాల వ్యాపారం కోసం బర్రెలు కొన్నాడు. వ్యాపారంలో తీవ్ర నష్టం వచ్చింది. ఇటు ఉద్యోగం రాక.. అటు పాల వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురైన ఓంకార్ సోమవారం గ్రామ సమీపంలోని పంట పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Courtesy V6velugu