స్వేచ్ఛను హరించే శాసనం

0
134
పి. చిదంబరం 
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ఒకవ్యక్తి అంగీకరించనప్పటికీ అతనికి నార్కో ఎనాల్సిస్, పాలీగ్రాఫ్ టెస్ట్, బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివేషన్ ప్రొఫైల్ (బిఇఎపి) టెస్ట్‌లను నిర్వహించడం రాజ్యాంగబద్ధమేనా? సెల్వి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో ఈ సున్నిత అంశాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం 2010 మే 5న వెలువరించిన తీర్పులో ఈ క్రింది నిర్ణయాలకు వచ్చింది.

(1) అనైచ్ఛికంగా నిర్వహించిన ఈ టెస్ట్‌ల ద్వారా పొందిన ఫలితాలకు అధికరణం 20(3) వర్తిస్తుంది (‘నేరం ఆరోపించబడిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పవలసిందిగా బలవంతం లేక ఒత్తిడి చేయరాదని’ ఆ అధికరణ చెబుతుంది).

(2) కనుక, ఒక వ్యక్తి ఇచ్ఛకు విరుద్ధంగా ఆ టెస్ట్‌లను నిర్వహించడమనేది అతని గోప్యతా హక్కును ఉల్లంఘించడమేననిమేము అభిప్రాయపడుతున్నాం.

(3) ఈ నిర్ణయాల ప్రకారం క్రిమినల్ కేసుల విచారణ సందర్భంలో గానీ, ఇతరత్రాగానీ ఏ వ్యక్తికీ ఆ టెస్ట్‌లను నిర్వహించకూడదు.

కెఎస్ పుట్టస్వామి వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తొమ్మిది మంది న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇలా అభిప్రాయపడింది: ‘వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘించడం అనే చర్యను మూడు కోణాల నుంచి పరిశీలించాల్సి ఉంది. ఒకటి-– న్యాయబద్ధత. ఇది చట్టం ఉనికి ఆవశ్యకతను నిర్దేశిస్తుంది; రెండు–- అవసరం.- దీన్ని రాజ్య వ్యవస్థ చట్టబద్ధ లక్ష్యానికి అనుగుణంగా నిర్వచించాల్సి ఉంది; మూడు-– తారతమ్య సంబంధం-. ఉల్లంఘన చర్య లక్ష్యాలు, వాటి పరిపూర్తికి అనుసరించిన మార్గాల మధ్య సహేతుక సంబంధం.

ఈ చరిత్రాత్మక తీర్పులు వెలువరించడంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం తన విధ్యుక్త ధర్మాన్ని ‘Sentinel on the qui vive’ (మెలకువతో, ఏం జరగబోతుందో అన్న జాగరూకతతో నిరీక్షిస్తున్న కావలివాడుగా ఉండడం) సర్వోత్కృష్టంగా నిర్వహించింది. సెల్వి, పుట్టస్వామి కేసులలో తీర్పులు ఇప్పటికీ ఉత్తమ న్యాయ నిర్ణయాలుగా ఉన్నాయి. అయితే ప్రస్తుత కేంద్రప్రభుత్వం వాటినలా పరిగణిస్తున్నట్టు కనిపించడం లేదు. ఆ తీర్పులు నాన్ -డెరోగబుల్ (న్యూనపరచడానికి వీలులేని)రాజ్యాంగ హక్కులు (అధికరణ 20: ఒకే నేరానికి ఒకేసారి శిక్ష విధించాలి; అధికరణ 21: చట్టం నిర్దేశించిన విధంగా తప్ప మరొక విధంగా వ్యక్తికి గల జీవించే హక్కును, అతనికి గల వ్యక్తి స్వేచ్ఛనుగానీ హరించరాదు) ఆధారంగావెలువరించినవి గనుక ప్రభుత్వం వాటికి విధిగా కట్టుబడి ఉండాలి. ఈ బాధ్యతను గుర్తించి ఉన్నట్టయితే ప్రభుత్వం ‘క్రిమినల్‌ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్- 2022’ పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించి ఉండేదికాదు. ప్రభుత్వం అతిగా వ్యవహరించిందని చెప్పకతప్పదు. అంతేకాదు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కులయిన స్వేచ్ఛ, గోప్యతలను దేశ పౌరులకు నిరాకరించేందుకు ఆ చట్టాన్ని తీసుకువచ్చారు.

బిల్లు లక్ష్యాలలో ఒకటి చట్టం వర్తించే వ్యక్తుల శారీరక ‘కొలతల’ను ఆధునిక పద్ధతుల ద్వారా తీసుకుని, వాటికి చట్టబద్ధత కల్పించడం. లక్ష్యం నిర్దిష్టమైనదే. అయితే నిబంధనలు చిక్కులు తెచ్చిపెట్టేవిగా ఉన్నాయి. ఆ బిల్లులో న్యాయసంబంధమైన లొసుగులు చాలా ఉన్నాయి. అయితేస్వేచ్ఛ గోప్యత హక్కులను ఉల్లంఘించిన నాలుగు సెక్షన్లపై నా దృష్టిని కేంద్రీకరిస్తాను. ఎందుకంటే అవి ప్రశ్నార్థకమైనవి.

సెక్షన్ 2లో ‘కొలతల’ నిర్వచనం ఉంది. బయోలాజికల్ శాంపిల్స్, వాటి విశ్లేషణలు, ప్రవర్తనా లక్షణాలు తదితర పరీక్షలు మొదలైనవి ఆ నిర్వచనంలో భాగంగా ఉన్నాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్లు 53, 53–ఎ, 54ను అవిప్రస్తావించాయి. ఎటువంటి మినహాయింపులు లేవు. ఇదీ నా ప్రశ్న: నార్కో ఎనాల్సిస్, పాలీగ్రాఫ్ టెస్ట్, బిఇఎపి, సైకియాట్రిక్ పరీక్ష కూడా ‘కొలతలు’లో భాగమేనా?

సెక్షన్ 3లో ఏ చట్టం కింద అయినా శిక్షార్హమైన నేరానికి పాల్పడినట్టు నిర్ధారింపబడిన వ్యక్తితో సహా ‘ఏ వ్యక్తి నుంచి అయినా’ కొలతలు తీసుకోవచ్చనిపేర్కొన్నారు. అలాగే ఏ చట్టం కింద అయినా అరెస్టయిన వ్యక్తి నుంచీ ముందు జాగ్రత్తగా నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తి నుంచి కూడా ‘కొలతలు’ తీసుకోవచ్చని ఆ సెక్షన్ స్పష్టం చేసింది. ప్రతి చట్టమూ ఈ సెక్షన్ పరిధిలోకిరావడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అరెస్టయిన వ్యక్తిని, డిటెన్యూను కూడా నేరానికి పాల్పడినట్టు రుజువయిన వ్యక్తితో కలిపివేయడం మరింత దిగ్భ్రాంతికరంగా ఉంది. సెక్షన్ 144 (నిషేధాజ్ఞలు) ఉల్లంఘించడానికి ప్రయత్నించిన నిరసనకారులకు కూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇదీ నా ప్రశ్న: ఒక్కసారి కూడా అరెస్ట్ కాని పార్లమెంటుసభ్యులు, శాసనసభ్యులు, రాజకీయ కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులు, ప్రగతిశీల రచయిత, కవి ఎవరైనా ఉన్నారా? తాను అరెస్ట్ కాబోనని చెప్పగలిగే వారు ఎవరైనా ఉన్నారా? (నేను యువజన కాంగ్రెస్‌లో చేరిన రోజునే మరికొంత మందితో కలిసి అరెస్టయ్యాను. చెన్నైలోని మింటో విగ్రహం వద్ద ధర్నా చేసినందుకు మమ్ములను అరెస్ట్ చేశారు).

సెక్షన్ 4లో వ్యక్తుల నుంచి తీసుకున్న కొలతలను నిల్వచేసి, 75 సంవత్సరాల పాటు సంరక్షించి, అవసరమైనప్పుడు చట్టాన్ని అమలుపరిచే ఏ ఏజెన్సీతోనైనా ఆ సమాచారాన్ని పంచుకోవచ్చని పేర్కొన్నారు. ‘లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ’ అని మాత్రమే ఉంది గానీ ఒక నేరంపై దర్యాప్తు చేస్తున్న ఏజెన్సీ అని లేకపోవడం గమనార్హం. పంచాయత్ లేదా మునిసిపల్ అధికారి, హెల్త్ ఇన్ స్పెక్టర్, ట్రాపిక్ కానిస్టేబుల్, ట్యాక్స్ కలెక్టర్ తదితర ప్రభుత్వాధికారులు అందరూ ఏదో ఒక చట్టాన్ని అమలుపరిచేవారే. ఈ సెక్షన్ 4 ప్రకారం వీరందరూ నిల్వచేసిన ఆ కొలతల సమాచారాన్ని డిమాండ్ చేసి పొందవచ్చు. ఇదీ నా ప్రశ్న: ప్రస్తావిత లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఎవరు?

సెక్షన్ 5: ఒక వ్యక్తి కొలతలు ఇవ్వడానికి సమ్మతిస్తాడు. కొలతలు ఇవ్వాలని ఏ వ్యక్తినైనా ఒక మెజిస్ట్రేట్ ఆదేశిస్తాడు. ఆ వ్యక్తి ఆ ఆదేశాన్ని పాటించాలి. తిరస్కరించిన పక్షంలో పోలీసధికారికి (హెడ్ కానిస్టేబుల్, ఆ పై స్థాయి పోలీసులు) ఆ వ్యక్తి నుంచి కొలతలు తీసుకునే అధికారముంది. అప్పటికీ ఆ వ్యక్తి ప్రతిఘటిస్తే సెక్షన్ 186 కింద అతను శిక్షార్హుడు అవుతాడు. ఇదీ నా ప్రశ్న: సంబంధిత వ్యక్తి సమ్మతి లేకుండా, అతని అభీష్టానికి విరుద్ధంగా కొలతలు తీసుకోవచ్చునా?

సెల్వి కేసులో నిషిద్ధమయిన పద్ధతులను ఉపయోగించడం జరగదని హోం మంత్రి రాజ్యసభకు మౌఖికంగా హామీ ఇచ్చారు అయితే ఆ హామీని బిల్లులో చేర్చేందుకు నిరాకరించారు. మిగతా మూడు ప్రశ్నలకు సమాధానం లేదు. ప్రభుత్వం యథావిధిగా జంట వాదనలు చేసింది. ఖైదీలకు మానవహక్కులు ఉంటాయి; అలాగే వారి బాధితులకూ ఆ హక్కులు ఉంటాయి. ఇంతకూ ఆ బిల్లు నేర బాధితులకు గురించి కాదుకదా. అది అరెస్టయిన వారు, డిటెన్యూలు, ఖైదీల గురించి కదా. నేర నిర్ధారణ అవుతున్న కేసుల సంఖ్యను చూడాలన్నది మరో వాదన. నిజమే. నేర నిర్ధారణ అవుతున్న కేసుల సంఖ్య తక్కువగాఉంది. కారణమేమిటి? దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యం, ప్రాసిక్యూటర్లు సరైన వారు కాకపోవడం, రికార్డుల నిర్వహణ సవ్యంగా లేకపోవడం, జడ్జీలపని భారం పెరిగిపోవడం. అరెస్టయిన వ్యక్తుల, డిటెన్యూల, ఖైదీల మానవహక్కులను ఉల్లంఘిస్తే ఆ అవరోధాలన్నీ తొలగిపోతాయా?

స్వేచ్ఛ ఒక అనుల్లంఘనీయమైన మానవ హక్కు. ఒక మానవ హక్కును నిరాకరించడమనేది దాని రద్దుకు ఆరంభమే, సందేహం లేదు. ‘క్రిమినల్ ప్రొసీజర్(ఐడెంటిఫికేషన్) బిల్లు- 2022’ స్వేచ్ఛ హృదయంలోకి దిగబడిన బాకు.

Courtesy Andhrajyothi

Leave a Reply