పాడుకాలం లయిస్తుందా?

0
251
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)

పౌరసత్వ సవరణ చట్టంతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించిన భారత గణతంత్ర రాజ్య ప్రస్థానం ఎటు వైపు? ఉత్తరప్రదేశ్ ఒక మార్గాన్ని నిర్దేశించింది: మతపరమైన అధికసంఖ్యాక వాద సంకుచితత్వాన్ని మరింత దృఢంగా నొక్కి చెప్పడం ద్వారా హిందూత్వ పాలనకు, భిన్నాభిప్రాయాలు గల పౌరులు, ముఖ్యంగా ముస్లింలులోబడివుండేలా చేయడం. జామియా, బెంగలూరు, ముంబైతో సహా విశాల భారతదేశంలోని అనేక ప్రదేశాలు చూపిన మరో పథం : విద్వేషం, పక్షపాతాన్ని రూపుమాపి, మన గణతంత్ర రాజ్యానికి పునాదులుగా వున్న సమున్నత బహుత్వ వాద సూత్రాలను పునరుద్ధరించి, జాతీయ జీవనంలో నిండుగా నిలబెట్టడం. మరి మన స్వాతంత్ర్య నిర్మాతల భారత్ భావన వర్ధిల్లుతుందా?

పశ్చిమ ఢిల్లీలోని ఒక ప్రధాన రహదారి ఆ యశస్వి పేరునే వున్నది. అయితే, నేడు దేశ రాజధాని వాసులలో ఎంతమందికి హకీం అజ్మల్ ఖాన్ గురించి తెలుసు? చాలా కొద్దిమందికి మాత్రమేనని నిస్సందేహంగా చెప్పగలను. దేశీయ వైద్యంలో నిష్ణాతుడైన ఈ సంప్రదాయ వైద్యుడు (హకీం) హిందువులు, ముస్లింలు, ఇంకా ఇతర మతస్థులకు; పేదలు, సంపన్నులు మధ్యతరగతి ప్రజలకు ప్రేమాస్పదుడైన ఆరోగ్య ప్రదాత. వైద్య వృత్తి ఆయన క్రియాశీల జీవితంలో ఒక భాగం మాత్రమే. హకీం అజ్మల్ ఖాన్ నిరుపమాన దేశభక్తుడు. ఆయన భారత జాతీయ కాంగ్రెస్ జీవిత కాల సభ్యుడేకాదు, ఆ మహాసంస్థకు కొంతకాలం అధ్యక్షుడు కూడా. ఒక విద్వజ్ఞుడుగా, ఒక దేశభక్తుడుగా అజ్మల్ ఖాన్ తన ద్వివిధ అర్హతలతో (ఇటీవల ప్రముఖంగా వార్తల్లో ఉన్న) ఒక జాతీయ వాద విశ్వ విద్యాలయం వ్యవస్థాపనలో కీలక పాత్ర వహించారు.

1920లో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పినప్పుడు హకీం అజ్మల్ ఖాన్ ఆ కొత్త ఉన్నత విద్యా సంస్థకు చాన్సలర్‌గా నియమితులయ్యారు. విశ్వవిద్యాలయ సర్వతో ముఖాభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. ఆ తొలి సంవత్సరాలలో ఎదురైన అన్ని సమస్యలను అధిగమించి జామియాను ముందుకు తీసుకు వెళ్ళడంలో అజ్మల్ ఖాన్ సఫలమయ్యారు. అయితే 1927 డిసెంబర్‌లో ఆయన ఆకస్మికంగా మరణించారు. ఆరుపదుల వయస్సులోకి ప్రవేశించక ముందే హకీం అజ్మల్ ఖాన్ కీర్తిశేషులయ్యారు.

అజ్మల్ సాహెబ్ అకాల మరణానికి ఆయన సన్నిహిత మిత్రుడు మహాత్మా గాంధీ అమితంగా కుంగిపోయారు. ‘ప్రస్తుత దశలో హకీం అజ్మల్ ఖాన్ చనిపోవడం దేశానికి తీవ్ర, తీరని నష్టం. నిజమైన దేశ సేవకులలో ఆయన ఒకరు. హిందూ- ముస్లిం సమైక్యతకు ఆయన స్ఫూర్తిదాయక కృషి చేశారని’ గాంధీజీ నివాళులర్పించారు. హకీం మృతితో, అప్పటికింకా బాలారిష్టాలలో వున్న జామియా మిలియా ఇస్లామియా ఎంతగా తల్లడిల్లిపోతుందో మహాత్ముడికి బాగా తెలుసు. అందుకే జామియా బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు నిర్వహించనున్న అజ్మల్ ఖాన్ సంస్మరణ సభకు ఆయన ఒక సందేశాన్ని పంపించారు. ‘కీర్తిశేషుని స్ఫూర్తి సదా మనతో వుండాలని కోరుకుంటున్నాను జామియాను ఒక సజీవ (హిందు–-ముస్లిం సమైక్యతా) ఆలయంగా తీర్చి దిద్దడం ద్వారా హకీం అజ్మల్ ఖాన్ స్మృతిని శాశ్వతంగా నిలుపుకుందాం. మీరు ఆశోపహతులు కావద్దు. జామియా ఆదర్శాలకు అధ్యాపకులు, విద్యార్థులు కట్టుబడి వున్నంతవరకు ఆ ఉన్నత విద్యా సంస్థ మరణించదు. జామియా వికాసానికి నా వంతు చేయాతనందిస్తానని వాగ్దానం చేస్తున్నాను. జామియాకు ఆర్థిక సుస్థిరతను సమకూర్చడానికి భగవంతుని సహకారంతో నా సర్వ శక్తులను వినియోగిస్తాను’ అని ఆ సందేశంలో గాంధీజీ పేర్కొన్నారు.

మహాత్ముడు తన హామీని నిలబెట్టుకున్నారు. ఆర్థిక వనరులను సమీకరించి తోడ్పడ్డారు. జాకీర్ హుస్సేన్, మొహ్మద్ ముజీబ్ మొదలైన వైస్ ఛాన్సలర్ల నేతృత్వంలో జామియా అనుపమానంగా అభివృద్ధి చెంది దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా సుప్రతిష్ఠితమయింది.

సరే, 2019 డిసెంబర్ -హకీం అజ్మల్ ఖాన్ చనిపోయిన 72 సంవత్సరాల అనంతరం-లో జామియాకు ఒక కొత్త సంక్షోభం వాటిల్లింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జామియా విద్యార్థులు తీవ్ర నిరసనలు తెలిపారు. ఆ నిరసనలను అణచివేసేందుకుగాను పోలీసులు జామియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి చెలరేగిపోయారు. విద్యార్థినులను హాస్టళ్ల నుంచి బయటకు లాక్కొచ్చారు. విశ్వవిద్యాలయ గ్రంథాలయాన్ని ధ్వంసం చేశారు. జామియాలో పోలీసుల విధ్వంస హేలలకు సంబంధించిన వీడియోలు భారత్‌లోనే గాక ప్రపంచమంతటా వైరల్ అయ్యాయి. అలాగే పోలీసుల దౌర్జన్యాలకు గురయిన హిందూ, ముస్లిం, విద్యార్థినులు- విద్యార్థులు వెల్లడించిన వాస్తవాలు ప్రభుత్వ దమనకాండను స్పష్టం చేశాయి. దేశ ప్రజలనే కాదు, అంతర్జాతీయ సమాజాన్ని కూడా దిగ్భ్రాంతి పరిచాయి.

2019 డిసెంబర్ 15న ఢిల్లీ పోలీసులు జామియా క్యాంపస్‌పై దాడి (ఆక్రమించుకున్నారని చెప్పవచ్చు) చేశారు. ఆ మరుసటి రోజు ఉదయం ఒక సహచర చరిత్రకారుని నుంచి నాకొక సందేశం అందింది. విద్యార్థులు ఇంతకు ముందు కూడా రాజకీయ నిరసనల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోనూ, 1970 దశకంలో ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగానూ వారు చురుకైన పాత్ర వహించారు. అయితే స్వాతంత్ర్యోద్యమంలో గానీ, అత్యవసర పరిస్థితికాలంలో గానీ పోలీసులు ఏ విశ్వవిద్యాలయ గ్రంథాలయాన్ని అయినా ధ్వంసం చేయడం జరిగిందా? అని ఆ చరిత్రకారుడు ప్రశ్నించారు. అటువంటి అనాగరిక ఘటనేదీ అప్పట్లో సంభవించలేదని నేను సమాధానమిచ్చాను. బ్రిటిష్ వైస్రాయిలు గానీ, ఇందిరాగాంధీ గానీ నిరంకుశ పాలకులే, సందేహం లేదు. అయితే వారు పుస్తకాలు చదువుతారు. ఈ దేశ చరిత్రలోనే అత్యంత మేధో వ్యతిరేక ప్రభుత్వం ఒక సుప్రసిద్ధ విశ్వవిద్యాలయ గ్రంథాయాన్ని నాశనం చేయడం లో ఆశ్చర్యమేమీ లేదు. విస్మయకరమైన విషయమేమిటంటే ఆ విధ్వంసకాండకు వ్యతిరేకంగా ప్రజలలో పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు ప్రజ్వరిల్లడం. హకీం అజ్మల్ ఖాన్ విగతుడయినప్పుడు జామియాను ఆదుకోవడానికి మహాత్ముడు వున్నారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఆ ప్రశస్త ఉన్నత విద్యా సంసకు బాసటగా నిలబడే మహాత్ముడు ఎవరూ లేరు. సామాన్య పౌరులే ఆ బృహత్తర నైతిక బాధ్యతను నిర్వర్తించడానికి పూనుకున్నారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ అసంఖ్యాక ప్రజలకు అనేక అభ్యంతరాలు వున్నాయి. ఆ చట్టం వివక్షా పూరితమైనది, తర్క విరుద్ధమైనదని వారు భావిస్తున్నారు. ముస్లింలపై అపనిందలు వేయడానికే పాలకులు ఆ చట్టాన్ని తీసుకువచ్చారని వారు విశ్వసిస్తున్నారు. అయితే జామియాలో ఢిల్లీ పోలీసులు విధ్వంస కాండను తమ టీవీలు, స్మార్ట్ ఫోన్‌లలోను చూసివుండక పోయినా, జామియా విద్యార్థులు వెల్లడించిన విషయాలను వినివుండని పక్షంలోనూ ఆ ఆక్షేపణలు, అభ్యంతరాలు అన్నీ వ్యక్తిగత స్థాయిలోనే వుండిపోయేవి; వారి వారి గృహాలలో మాత్రమే వాటికి వ్యతిరేకంగా మాట్లాడుకోవడం జరిగేది. జామియాకు మద్దతు ఇతర ఉన్నత విద్యాసంస్థల,- ఐఐటీలు, ఐఐఎమ్ లు, నేషనల్ లా స్కూల్స్ – నుంచి కూడా లభించింది(ఈ ఉన్నత విద్యా సంస్థలు సంప్రదాయకంగా రాజకీయాలలో ఆసక్తి చూపనవి కావడం గమనార్హం). ఢిల్లీలో పోలీసుల క్రౌర్యాన్ని చవి చూసిన విద్యార్థుల పట్ల సానుభూతి వెన్వెంటనే దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం పట్ల విస్తృత వ్యతిరేకతగా పరిణమించింది.

డిసెంబర్ 15 అనంతరం ప్రజ్వరిల్లిన నిరసనోద్యమాలలో అన్ని మతాల ప్రజలూ పాల్గొన్నారు. చాలా చోట్ల మన గణతంత్ర రాజ్య బహుత్వవాద సంస్కృతి వెల్లివెరిసింది. నిరసనకారులు గాంధీ, అంబేడ్కర్, భగత్ సింగ్ మొదలైన జాతీయోద్యమ నాయకుల పోస్టర్లను ప్రదర్శించారు. ఎల్లెడలా త్రివర్ణ పతాక రెపరెపలాడింది. నిరసనల తొలి వెల్లువ గొప్ప ఆశాభావాన్ని కలిగించింది. ఎందుకంటే అసంఖ్యాక భారతీయ ముస్లింలు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. తమపై నిస్సిగ్గుగా వివక్ష చూపుతున్న చట్టానికి వ్యతిరేకంగా వారు వీధుల్లోకి వచ్చారు. హిందూత్వ శక్తుల ఐదున్నర సంవత్సరాల ఆధిపత్య పాలన వారిని పూర్తిగా లొంగదీసుకోలేక పోయిందని స్పష్టమయింది. ఈ వాస్తవం భారత్ భావనను విశ్వసించే వారికి ఎంతో ఉత్సాహాన్ని , ధైర్యాన్ని కలిగించింది. ముస్లిమేతరులు కూడా అసంఖ్యాకంగా ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొవడం మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ముస్లింలు న్యాయ సమ్మతంగాను, యథార్థంగాను అధిక సంఖ్యాక మతస్థుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఈ దేశంలో నివశించాలన్న పాలకుల అభీష్టాన్ని కోట్లాది హిందువులు, ఇంకా క్రైస్తవులు, సిక్కులు, నాస్తికులు నిర్ద్వంద్వంగా తిరస్కారించారన్న సత్యాన్ని నిరసనోద్యమాల వెల్లువ తిరుగులేని విధంగా స్పష్టం చేసింది.

బెంగలూరులో జరిగిన మూడు నిరసన ప్రదర్శనల్లో నేనూ స్వయంగా పాల్గొన్నాను. అన్నీ ప్రశాంతంగా జరిగాయి. సమాజంలోని అన్నివర్గాల వారూ, సకల రంగాల వారూ ఈ నిరసనల్లో పాల్గొన్నారు. అసోం, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారితో సహా విద్యార్థులు అత్యధికంగా ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఈ నిరసనల్లో సముచిత స్థాయిలో పాల్గొనలేదు. ఆ నిరసనల్లోను, ఆ తరువాత నేను కొద్ది గంటల పాటు గడిపిన నిర్బంధ కేంద్రాలలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్త్రీ పురుషులు ఒక్కరినీ కూడా నేను చూడలేదు, మాట్లాడలేదు! అయితే భారతదేశపు అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ నుంచి వెలువడిన వార్తలు మా ఉత్సాహాన్ని నీరుగార్చివేశాయి. ఆ రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనకారులను క్రూరంగా అణచివేస్తున్నారు. దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో నిరసన ప్రదర్శనలు స్థానిక అధికారుల అనుమతితో శాంతియుతంగా జరుగగా యూపీలో పరిస్థితి భిన్నంగా, దారుణంగా వున్నది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా నిరసనకారులపై ‘ప్రతీకారం’గురించి మాట్లాడడంతో పోలీసులు మరీ చెలరేగిపోయారు. తత్ఫలితంగా జరిగిన హింసాకాండలో 19 మంది ముస్లింలు హతమయ్యారు. మత సామస్యం, అహింసాత్మక పద్ధతుల గురించి ప్రబోధిస్తున్న సామాజిక సేవకులపై కూడా యూపీ ప్రభుత్వం క్రూర చర్యలకు పాల్పడింది. వందలాది ముస్లిం విద్యార్థులకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌లను దాఖలు చేశారు. భారతీయ ముస్లింలు ‘పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలని’ ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పిన ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయి, సంఖ్యానేక భారతీయులను దిగ్భ్రాంతి పరిచింది. యూపీలో చిన్నపిల్లలను సైతం అరెస్ట్ చేసి, చిత్రహింసలకు గురి చేస్తున్నారు. సాహసోపేత పాత్రికేయులు పలువురు యూపీ ప్రభుత్వ దమన నీతిని రికార్డు చేశారు. భారతదేశంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున హింసాకాండ జరిగిందని ఒక ఆన్‌లైన్ పత్రికలో వెలువడిన వ్యాసం పేర్కొంది. అదింకా ఇలా వ్యాఖ్యానించింది: ‘ముస్లింలను ద్వేషించే ఒక ముఖ్యమంత్రి పాలనలో ఉత్తరప్రదేశ్ వున్నది. ఆయన ప్రభుత్వం భారతీయ ముస్లింలను భారతదేశ పౌరులుగా గాక శత్రువులుగా చూస్తోంది’.

పౌరసత్వ సవరణ చట్టంతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించిన భారత గణతంత్ర రాజ్య ప్రస్థానం ఎటు వైపు? ఉత్తరప్రదేశ్ ఒక మార్గాన్ని నిర్దేశించింది: మతపరమైన అధిక సంఖ్యాకవాద సంకుచితత్వాన్ని మరింత దృఢంగా నొక్కి చెప్పడం ద్వారా హిందూత్వ పాలనకు భిన్నాభిప్రాయాలు గల పౌరులు, ముఖ్యంగా ముస్లింలు లోబడివుండేలా చేయడమే అ మార్గం. జామియా, బెంగలూరు, ముంబైతో సహా విశాల భారతదేశంలోని అనేక ప్రదేశాలు చూపిన మరో పథం : విద్వేషం, పక్షపాతాన్ని రూపుమాపి, మన గణతంత్ర రాజ్యానికి పునాదులుగావున్న సమున్నత బహుత్వ వాద సూత్రాలను పునరుద్ధరించి, జాతీయ జీవనంలో నిండుగా నిలబెట్టడం. మరి మన స్వాతంత్ర్య నిర్మాతల భారత్ భావన వర్ధిల్లుతుందా? హకీం అజ్మల్ ఖాన్‌కు మహాత్ముడు అర్పించిన నివాళి నుంచి ఉటంకింపుతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను: ‘హకీంజీ మరణం నాకు వ్యక్తిగతంగా తీరనిలోటు. జామియా మిలియా ఇస్లామియాకు ఆర్థిక వనరులను సమృద్ధంగా సమకూర్చడానికి అజ్మల్ సాహెబ్ సమీకరిస్తున్న నిధికి ఉదారంగా తోడ్పడాలని డాక్టర్ ఎమ్.ఏ. అన్పారీ, ఇతరనాయకులు చేసిన విజ్ఞప్తిలో నేనూ పూర్తిగా భాగస్వామినవుతున్నాను. అయితే, ఆ మహా దేశ భక్తుడికి మనం అర్పించగల నిజమైన నివాళి భారతదేశంలో నివశిస్తున్న హిందువులు, ముస్లింలు, ఇతర మతస్థుల మధ్య సుస్థిరమైన, అఖండమైన ఐక్యతను నెలకొల్పడమే’. నేటికీ ప్రాసంగికత కలిగి వున్న నివాళి అది.

Leave a Reply