దళిత బంధుకు నిధుల గండం

0
160
  • రాష్ట్ర అప్పులపై కేంద్రం పరిమితితో కష్టాలు.. ఇప్పటికే ఒడిదుడుకుల్లో ఆర్థిక పరిస్థితి 
  • ఉద్యోగులకు సకాలంలో జీతాలూ ఇవ్వలేని స్థితి.. దళితబంధుకు బడ్జెట్‌లో 17,700 కోట్లు
  • ఇంకా పైసా విడుదల చేయని ప్రభుత్వం.. అప్పులు పుట్టకపోతే పథకం పరిస్థితేంటన్న సందేహాలు

రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై కేంద్రం విధించిన తాజా పరిమితులు దళితబంధు పథకానికి శాపంగా మారనున్నాయా? ప్రస్తుతం ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఈ పథకానికి అనుకున్న విధంగా నిధులు వెచ్చించడం కష్టమేనా? దళితుల సాధికారత కోసమంటూ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం అమలు లక్ష్యం  ప్రశ్నార్థకం కానుందా? ప్రస్తుతం అందరిలోనూ వ్యక్తమవుతున్న సందేహాలివి. 

హైదరాబాద్‌ : దళితుల్ని ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థితికి తెచ్చేందుకంటూ హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ముందు దళితబంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత ఏడాది మార్చి 31 నాటికి మొదటి దశలో 40 వేల మంది లబ్ధిదారులకు ఆర్థిక చేయూత అందిస్తామని సర్కారు ప్రకటించింది. అయితే గత ఆర్థిక సంవత్సరం (2021-22) ముగిసినా ఆ లక్ష్యం ఇప్పటికీ పూర్తి కాలేదు. అయినా పథకం రెండో దశ అమలు కోసం 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించింది. ఒకే మొత్తానికి బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌(బీఆర్‌వో) కూడా ఇచ్చింది. కానీ, ఆర్థిక సంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడిచిపోయినా ఒక్క పైసా కూడా ఈ పథకం అమలు కోసం విడుదల చేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి  సజావుగా లేకపోవడంతో ఉద్యోగులకు జీతాలే సకాలంలో చెల్లించలేకపోతోంది.

దళితబంధు పథకం అమలును మాత్రం అప్పులు తెచ్చి అయినా కొనసాగించాలని భావించింది. బడ్జెట్‌ అప్పులు వేరు, కార్పొరేషన్‌ అప్పులు వేరు అంటూ ఇప్పటివరకు రెండు మార్గాలో రుణాలు తీసుకుంటున్నట్లుగా ఈ ఏడాది కూడా తీసుకోవాలనుకుంది. కేంద్రం పెడుతున్న కొర్రీలకుఏదోవిధంగా సానుకూల పరిష్కారం లభిస్తుందని భావించింది. ఎప్పటిలాగే రెండు రకాల అప్పులు తెచ్చుకోగలుగుతామనే ధీమాతో ఉంది. కానీ, కార్పొరేషన్ల అప్పులు, బడ్జెట్‌ అప్పులు రాష్ట్రం అప్పుల్లో భాగమేనని కేంద్రం స్పష్టం చేయడంతో గతంలోలా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చుకోవడం కుదరదని తేలిపోయింది. దీంతో దళితబంధు పథకం అమలును కొనసాగించేందుకు నిధుల సమీకరణ ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఆశించిన రీతిలో అప్పులు పుట్టని పరిస్థితి వస్తే రూ.వేల కోట్ల దళితబంధు పథకానికి ఏ ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రభుత్వం నిధులను సర్దుబాటు చేస్తుందన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు.

ఈ ఏడాది దళితబంధు పథకానికి నిధుల విడుదల విషయాన్ని పక్కనబెడితే ఇప్పటివరకు కనీసం దరఖాస్తుల స్వీకరణ విషయంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రెండో దశలో ప్రతి నియోజకవర్గం నుంచి 1500 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించినా.. ఇప్పటి వరకు ఎంపికకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయలేదు. మొదటి దశలో అవకాశం కోల్పోయిన వారికి రెండో దశలో అవకాశం కల్పిస్తామని అధికార పార్టీ నాయకులు ఇచ్చిన హామీతో నిరుపేద దళితులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 18 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. మొదటి దశలో 40 వేల మందిని ఎంపిక చేసినా.. రెండో దశలో 2022-23 బడ్జెట్‌ కేటాయింపుల ప్రకారం సుమారు 2 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కానీ, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం ఏ రకంగానూ రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు నిర్దేశించుకున్న గడువులోగా మేలు చేసే పరిస్థితులు కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా  సమస్యల్లో ఉందనీ, దళితబంధు రెండో దశ అమలు కష్టమేననీ ప్రతిపక్షాలు అంటున్నాయి.

పేరు చూసుకుని మురిసిపోవాల్సిందే..!
దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులకే ప్రాధాన్యం ఇస్తుండటంతో నిరుపేదలకు అవకాశం దక్కడం లేదనే విమర్శలు పథకం ప్రారంభమైన నాటినుంచే ఉన్నాయి. తమవారు కాకపోతే ఆర్థికసహాయం అందించకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. భద్రాచలం నియోజకవర్గంలో ఇప్పటికీ లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్‌ కాకపోవడమే ఇందుకు నిదర్శనం. నియోజకవర్గంలోని దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం మండలాల్లో ఒక్కో మండలం నుంచి 20 మంది పేర్లను స్థానిక ఎమ్మెల్యే సిఫారసు చేశారు.

ఎంపిక జాబితాలోనూ ఈ పేర్లు ఉన్నాయి. కానీ, యూనిట్ల గ్రౌండింగ్‌ విషయంలో మాత్రం వారిని పక్కనబెట్టారు. యూనిట్లు గ్రౌండింగ్‌ కాని పరిస్థితి కొందరిదైతే.. సగం యూనిట్లు గ్రౌండ్‌ అయ్యి ఆర్థిక సహాయం పూర్తిగా అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు మరికొందరు ఉన్నారు. కమిటీ సమావేశంలో యూనిట్ల గ్రౌండింగ్‌కు ఆమోదం లభించినా ఇప్పటికీ ఆ ప్రక్రియ మొదలు కాలేదు. స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా.. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించడంలేదంటూ నిరుపేద దళితులు ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

Courtesy Andhrajyothi

Leave a Reply