రాజస్థాన్‌లో అయిదుగురు విద్యార్థినుల ఫిర్యాదు
జైపుర్: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ప్రిన్సిపల్‌తోపాటు 15 మంది టీచర్లపై అదే పాఠశాలకు చెందిన అయిదుగురు విద్యార్థినులు గ్యాంగ్‌రేప్ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. ఆ 15 మందిలో అయిదుగురు మహిళా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. వీరి సాయంతో మిగతా ఉపాధ్యాయులు తమపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, వీరు వీడియోలు కూడా తీశారని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. సంబంధిత గ్రామానికి వెళ్లి విచారణ జరిపిన పోలీసులు దీన్ని ‘ప్రతీకారం.. సాక్షుల వేధింపు’ కేసుగా అనుమానిస్తున్నారు. అదే పాఠశాలకు చెందిన ఓ మాజీ ఉపాధ్యాయుడు ముగ్గురు విద్యార్థినులపై లైంగికదాడి జరిపిన ఆరోపణలతో గత డిసెంబరులో అరెస్టయ్యారు. ఈ కేసులో సస్పెండయిన అతనికి వ్యతిరేకంగా పాఠశాల సిబ్బంది మొత్తం వాంగ్మూలం ఇచ్చారు. ఇటీవలే బెయిలుపై విడుదలైన ఆ ఉపాధ్యాయుడు మంగళవారం రాత్రి విద్యార్థినులు మంధన్ పోలీస్‌స్టేషనుకు వచ్చి తాజా ఫిర్యాదు చేస్తున్న సమయంలో ఠాణా బయటే వేచి ఉండటం గమనార్హం. తాము జరిపిన ప్రాథమిక విచారణను బట్టి, ఈ అయిదుగురు విద్యార్థినుల కుటుంబాలను సస్పెండయిన టీచరు ప్రేరేపించినట్టుగా ఉందని భివాడి ఎస్పీ రామమూర్తి జోషి తెలిపారు. కేసు విచారణలో కింది తరగతులకు చెందిన మరో ముగ్గురు విద్యార్థినులు కూడా ఉపాధ్యాయ బృందంపై ఇదేవిధమైన ఆరోపణలు చేశారు.