ఉద్యోగుల భద్రతపై జెన్‌కో ఉపేక్ష

0
304

సరైన సమయంలో జెన్‌కో యాజమాన్యం స్పందించి లోపల చిక్కుకున్న వారిని బయటకు రమ్మని ఆజ్ఞాపించి ఉంటే వారందరూ బతికేవారు. కనీసం ఉద్యోగులందరికీ అగ్ని ప్రమాదాల సందర్భంగా భద్రతలోను, ఇతర ఆపత్కర సమయాలలో తప్పించుకుని బయటపడడంలోను శిక్షణ ఇచ్చి ఉంటే, ప్రమాదాన్ని ఊహించుకుని చేసే మాక్ డ్రిల్ ఉద్యోగులతో తరచూ చేయించి ఉంటే ప్రాణాలు పోయేవి కావు.

తెలుగు రాష్ట్రాలలో ఈ సంవత్సరం భద్రతా లోపాలతో వరుస ప్రమాదాలు, ప్రాణనష్టం జరగడం గమనిస్తున్నాం. ఆ క్రమంలోనే శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో ఆగస్టు 20 రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం 9 మంది ప్రాణాలు తీసింది. ఇవి అనవసర మరణాలు. రాత్రి 10:30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం మొదలైతే ఏడుగురు జెన్్్ కో ఉద్యోగులను, బాటరీలు పెట్టడానికి వచ్చిన ఇద్దరు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులను రాత్రి 2:30 సమయంలో ఊపిరాడక చనిపోయే వరకూ లోపల ఉండనీయడం అగ్ని భద్రతా నియమాల ప్రకారం బాధ్యులైన అధికారుల తప్పిదం. సరైన సమయంలో జెన్‌కో యాజ మాన్యం స్పందించి లోపల చిక్కుకున్న వారిని బయటకు రమ్మని ఆజ్ఞాపించి ఉంటే వారందరూ బతికేవారు. కనీసం ఉద్యోగులందరికీ అగ్ని ప్రమాదాల సందర్భంగా భద్రతలోను, ఇతర ఆపత్కర సమయాలలో తప్పించుకుని బయటపడడంలోను శిక్షణ ఇచ్చి ఉంటే, ప్రమాదాన్ని ఊహించుకుని చేసే మాక్ డ్రిల్ ఉద్యోగులతో తరచూ చేయించి ఉంటే ప్రాణాలు పోయేవి కావు.

మంటలార్పడానికి జల విద్యుత్ కేంద్రంలో చిన్నపాటి కార్బన్ డయాక్సైడ్ నింపిన అగ్నిమాపక సాధనాలు మాత్రమే ఉన్నాయి. అవి మంటలు తొలి దశలో ఉన్నపుడు మాత్రమే ఉపయోగకరం. అగ్ని విస్తరించకుండా అణచి వేసే వ్యవస్థ లేవీ కేంద్రంలో లేవు. అలాంటి స్థితిలో, అగ్ని మాపక సాధనాలతో మంటలు అదుపులోకి రాని పరిస్థితిలో, జెన్ కో ఉద్యోగులు తక్షణం కేంద్రం నుంచి బయటకు వెళ్ళాలి. వారికి అగ్ని ప్రమాదాల సందర్భంగా భద్రతలో తర్ఫీదు లేకపోవడం వల్ల అలా జరగ లేదు. వట్టి చేతులతో మంటలెలా ఆపగలమనుకున్నారు? జెన్ కో యాజమాన్యం వారిని బయటకు రమ్మని ఎందుకు సూచించలేదు? విచారణ జరుపుతున్న కమిటీలు ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలి.

ఇలాంటి ప్రమాదాలకు సంబంధించిన పుస్తకాలు, నివేదికలు, ప్రమాణాలు, పత్రాలు పరిశీలించిన మాకు అవగతమైన కొన్ని విషయాలను ఇక్కడ పేర్కొంటున్నాం. ఈ ప్రమాద మరణాలకి పునాదులు జలవిద్యుత్‌ కేంద్రం రూపకల్పన, నిర్మాణ దశలలోనే ఏర్పడ్డాయి. ప్రధానంగా అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలను ఆ దశలలోనే గుర్తించిన దాఖలాలు లేవు. జల విద్యుత్ కేంద్రం రూపకల్పన సందర్భంగా అగ్ని ప్రమాదం జరిగినపుడు వివిధ అంతస్తుల నుంచి మంటలను తప్పించుకుని బయటకు పోయే మార్గాలకు చేరడానికి అవసరమైన నిర్మాణాలకు చోటు కల్పించ లేదు. ప్లాంటులో ఎక్కడ ఉన్నా మంటల హెచ్చరిక అలారం మోగినపుడు అత్యవసరంగా బయటపడే దారి వరకు వెళ్లడానికి అనువైన మార్గం ఎంత దూరం ఉండాలో నిర్ణయించే ప్రమాణాన్ని అమలు చేయలేదు. జల విద్యుత్ కేంద్రం నిడివి దాదాపు 270 మీటర్లు ఉన్నపుడు కనీసం మూడు బయటకు వెళ్లే ద్వారాలుండాలి. ఆ ద్వారం వెలుపలి నడవా అత్యవసర నిష్క్రమణ మార్గానికి అనుసంధానమై ఉండాలి. అత్యవసర నిష్క్రమణ మార్గాలను అంతర్జాతీయ నియమాల ప్రకారం నిర్మించ లేదు. అందువల్లే అత్యవసర నిష్క్రమణ మెట్ల మార్గాలు రెండూ మంటలు సృష్టించిన పొగ బయటకు పోవడానికి పొగ గొట్టాలుగా మారి, మృత్యు కుహరాలయ్యాయి. ప్రమాణాల ప్రకారం నిష్క్రమణ మార్గంలోకి పొగ రాకుండా, మంటలు తగలకుండా మరో నిర్మాణం చేయాలి. కనీసం రెండు గంటల పాటు మంటలను తట్టుకోగల పదార్థాలతో ఆ నిర్మాణం జరగాలి. పని చేసే మొత్తం ఉద్యోగుల సంఖ్యను బట్టి నిష్క్రమణ మార్గం వెడల్పును నిర్ధారించాలి. అది కనీసం 44 అంగుళాలు అంటే 1.12 మీటర్లు వెడల్పు ఉండాలి. వాలు మార్గమైనా, మెట్లైనా ఎంత వాలు ఉండాలన్న ప్రమాణాల ప్రకారం నిర్మాణం జరగాలి. వాలైతే 4.8 డిగ్రీలు, మెట్లయితే 18 డిగ్రీలు ఉండి ఎక్కడానికి సులువుగా ఉండాలి. ఈ మార్గానికి వెలుతురూ గాలి ఇవ్వడం కోసం అంతరాయం లేని విద్యుత్ వ్యవస్థ ఉండాలి. అది కనీసం గంటన్నర పాటు పని చేయాలి. మార్గం చివర బయటకు దారిచ్చే తలుపు లోపలి నుంచి బయటకు తెరుచుకునేలా ఏర్పాటు ఉండాలి. చేతులతో తోస్తే సులువుగా తెరుచుకోవాలి.

విద్యుత్‌ కేంద్రం నిర్మాణంలో పైన ఉదాహరించిన ప్రమాణాలేవీ పాటించినట్లు లేదు. విచారణ కమిటీలు కేవలం మంటలెందుకొచ్చాయి, ఆటోమాటిక్ వ్యవస్థలెందుకు పని చేయలేదన్న విషయాలకే పరిమితమైతే ఆ కేంద్రంలో పని చేయడంలో ఉన్న విపత్తు అలాగే మిగిలి పోతుంది. ఉద్యోగులు పనిలో భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. శిక్షణ తీసుకోవాలి.

జెన్ కో యాజమాన్యం కేవలం విద్యుత్తు ఉత్పత్తిపైనే కాక భద్రత పైన కూడా శ్రద్ధ పెట్టాలి. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం నిర్మాణం పూర్తయ్యే నాటికి జపాన్ (1980), నార్వే (1999), కెనడా (1992), ఆస్ట్రేలియా (1990) తదితర దేశాలలో అగ్ని ప్రమాదాలు జరిగాయి. తరువాత అమెరికాలో (2002, 2007, 2012) లలో మూడు, జపాన్‌లో (2015) లోనూ ప్రమాదాలు జరిగాయి. వాటినుంచి నేర్చుకున్న గుణపాఠాలను అంతర్జాతీయంగా ప్రమాణాలలో పొందుపరిచారు. ప్రమాణాలను పాటిస్తే, భద్రతను వైఖరిగా స్వీకరిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు, కనీసం విపత్తు తీవ్రత తగ్గించవచ్చు. దీనికి నిరంతర కృషి అవసరం. అన్ని రంగాలలోనూ భద్రతా సంస్కృతిని తేవాలి. ఇంజనీరింగ్ విద్యలో భద్రత పాఠ్యాంశాలలో లేదు. చదువులోను, పనిలోను భద్రత పట్ల అవగాహన కల్పించలేకపోతే మన పారిశ్రామిక రంగం అంతర్జాతీయ ప్రమాణాలనెలా సాధిస్తుంది? భారత్‌లో తయారీకి విలువెలా వస్తుంది.

-డా. కలపాల బాబూరావు, శాస్త్రవేత్త

Leave a Reply