అడ్డగోలుగా అడ్డుగోడలు

0
271

దాస్యశృంఖలాల నుంచి బానిస జాతికి విముక్తి కలిగిస్తూ అబ్రహాం లింకన్‌ సంతకం చేసిన 157 సంవత్సరాల అనంతరం.. చర్మపు రంగును బట్టి కాకుండా గుణగణాలను బట్టి మనుషులను అంచనా వేసే ఒకరోజు వస్తుందని కలగంటున్నట్లు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ప్రకటించిన 57 ఏండ్ల తర్వాత.. అమెరికాలోని మినియాపోలిస్‌లో ఒక తెల్ల పోలీసు అధికారి నిరాయుధుడైన ఒక 46 ఏండ్ల ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ను బహిరంగంగా అతి క్రూరంగా మోకాలుతో నొక్కి హత్యచేసిన ఘటన యావత్‌ ప్రపంచాన్ని కుదిపింది. ఈ అమానుష జాత్యహంకార ధోరణిపై అమెరికాలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఆధునిక అమెరికా చరిత్రలో ఇంత స్థాయిలో జాతి వ్యతిరేక ఉద్యమం జరుగడం ఇదే ప్రథమం. కొవిడ్‌ మారణకాండ నడుమ సైతం ప్రాణాలకు తెగించి నిరసనకారులు వివిధ దేశాల్లో ప్రదర్శనలు జరుపుతున్నారు. కులం, మతం ప్రాతిపదికన ఆధిపత్య ధోరణి కొవిడ్‌లా విషతుల్యం చేస్తున్న మన సమాజానికి ఫ్లాయిడ్‌ ఘటన నేర్పుతున్న పాఠాలు ఏమిటి?

అది.. మే 25, 2020. ఊపిరి ఆడటం లేదు.. ప్లీజ్‌ వదలండి అని జార్జ్‌ ఫ్లాయిడ్‌ జూనియర్‌ పదేపదే అర్థించాడు. రెక్కలు వెనుకకు విరిచికట్టి.. బేడీలతో బంధించి.. నేల మీద పడేసి.. మెడ మీద మోకాలు పెట్టి.. దర్జాగా జేబులో చేయిపెట్టుకుని.. బలంగా నొక్కిపట్టిన తెల్ల పోలీసు మనసును ఆ ఆక్రందన కరిగించలేకపోయింది. వదిలేయండని పలుమార్లు మొత్తుకుంటున్నా 8 నిమిషాల 46 సెకండ్ల పాటు ఫ్లాయిడ్‌ శ్వాస ఆడకుండా చేసి అతి క్రూరంగా చంపేసిన తర్వాతగానీ ఆయన మెడ మీద నుంచి మోకాలు తీయలేదా జాతి మదోన్మత్త అధికారాంధుడు.

ఈ బహిరంగ హత్య జరుగుతుంటే మరో ముగ్గురు తెల్ల పోలీసులు చోద్యం చూడటం కూడా సోషల్‌ మీడియా యావత్‌ ప్రపంచానికి కండ్లకు కట్టింది. చెల్లని ఇరువై డాలర్ల నోటిచ్చిన నేరానికి ఆ చతుష్టయం విధించిన శిక్ష ఇది. ఫ్లాయిడ్‌కు నేర చరిత్ర ఉంటే ఉండవచ్చుగానీ మరీ ఇంత అమానుషంగా హత్య చేయాలా? ఫ్లాయిడ్‌ స్థానంలో ఒక తెల్ల జాతీయుడు ఉండి ఉంటే ఈ పోలీసు బృందం ఇలానే హత్యచేసి ఉండేదా? వంటి అనేక ప్రశ్నలు ఉదయించడం సహజం.

1967లో జరిగిన జాతి సంబంధ అల్లర్ల నేపథ్యంలో ఏర్పడిన 11 మంది సభ్యుల కెర్నర్‌ కమిషన్‌ ఏడు నెలల దర్యాప్తు అనంతరం మరుసటి సంవత్సరం సమర్పించిన ఒక నివేదిక రెండు (నల్ల, తెల్ల) సమాజాల మధ్య అసమానతలు ఉన్నాయని తేటతెల్లం చేసింది. ఆర్థిక అవకాశాల లేమి కారణంగా నల్ల జాతీయుల్లో వచ్చిన నిస్పృహ సమస్యకు మూలకారణమని, నల్ల జాతీయుల తిరుగుబాటుకు, అల్లర్లకు ‘వైట్‌ అమెరికా’ ఎక్కువ బాధ్యత వహించాలని అది స్పష్టం చేసింది.

జాతి, కులం, మతం విషయంలో యావత్‌ సమాజం అద్భుతమైన నాటకం ఆడుతున్నది. ప్రతి ఒక్కర్ని మరొకడు ముందుగా మతం, ఆ తర్వాత కులం, ఆనక ప్రాంతం వంటి కొలబద్దలు బట్టి చూస్తున్నారు. సన్నిహితంగా ఉండటం, మనసు విప్పి మాట్లాడటం, సాయం చేయడం, ప్రేమ పంచడం అనే మౌలిక మానవత్వపు క్రియలు ఈ మతం, కులం, ప్రాంతం ప్రాతిపదికన ఉంటున్నాయి. ఇది మన తెలుగు రాష్ర్టాల లోనూ చాలా సహజంగా, అప్రయత్నంగా జరిగిపోతున్నది.

మొత్తం జనాభాలో దాదాపు ముప్పావు వంతు ఉన్న శ్వేతజాతీయులు, 13 శాతం మంది ఆఫ్రికన్‌ అమెరికన్ల మధ్య సుహృద్భావం సంగతి మాట అటుంచి.. రెండు వర్గాల మధ్య కనిపించని ఇబ్బందికర పరిస్థితి శతాబ్దాలుగా కొనసాగుతున్నదన్నది కాదనలేని వాస్తవం. శ్వేత పోలీసుల దురహంకార ధోరణితో తరచూ సమస్య వస్తున్నది. ‘మ్యాపింగ్‌ పోలీస్‌ వయొలెన్స్‌’ సంకలనం చేసిన గణాంకాల ప్రకారం పోలీసుల దాష్టీకానికి ప్రాణాలు కోల్పోయే అవకాశం శ్వేత జాతీయులతో పోలిస్తే బ్లాక్‌ అమెరికన్స్‌కు మూడు రెట్లు ఎక్కువ. ప్రపంచానికి సుద్దులు చెప్పి పెద్దన్నలా వ్యవహరించే అమెరికాకు ఇది సిగ్గుచేటు. వ్యవస్థీకృతమైన ఈ వివక్ష.. తెల్ల పోలీసుల చేతిలో నల్ల జాతీయులు బలైనప్పుడు కొద్దికాలం మాత్రమే చర్చకు వచ్చి చల్లారిపోతున్నది.

జాతి, కులం, మతం విషయంలో యావత్‌ సమాజం అద్భుతమైన నాటకం ఆడుతున్నది. ప్రతి ఒక్కర్ని మరొకడు ముందుగా మతం, ఆ తర్వాత కులం, ఆనక ప్రాంతం వంటి కొలబద్దలు బట్టి చూస్తున్నారు. సన్నిహితంగా ఉండటం, మనసు విప్పి మాట్లాడటం, సాయం చేయడం, ప్రేమ పంచడం అనే మౌలిక మానవత్వపు క్రియలు ఈ మతం, కులం, ప్రాంతం ప్రాతిపదికన ఉంటున్నాయి. ఇది మన తెలుగు రాష్ర్టాల లోనూ చాలా సహజంగా, అప్రయత్నంగా జరిగిపోతున్నది. మతాలలో మంచిని పొరపాటునైనా పట్టించుకోకుండా ఒక మతానికి వ్యతిరేకంగా మరొక మతస్థులు మాట్లాడుకోవడం, కులాలవారీగా జతకట్టడం సర్వసాధారణమైపోయింది. మనిషిని మనిషిలా కాకుండా వేరే అద్దాలతో చూసి నిర్ణయాలు తీసుకునే ధోరణి ఇలా ఎన్నాళ్ళు?

పేరు చివరన కులాన్ని సూచించే పేరు లేకపోతె మనకు నామోషీనాయె! కులాలవారీగా విద్యార్థి వసతిగృహాలు, అతిథి గృహాలు, సత్రాలు, కల్యాణ మంటపాలు ఉండటం ఆవశ్యకమాయె! ఎవడో వార్తల్లో నిలిస్తే వాడి కులమేమిటో తెలుసుకోవడానికి ‘గూగుల్‌’ను ఆశ్రయిస్తమాయె! మనం మనం బరంపురం.. అని లీనమై మాట్లాడుకోవాలన్న ఆరాటమాయె! ప్రైవేటు ఉద్యోగాల్లో, రాజకీయ టికెట్లలో మతం, కులం గణించకుండా ఉండలేమాయె! ఒక మానవ సమూహాన్ని ఒకే గాటన గట్టి అందులోని అందరికీ కచ్చితంగా ఒకేరకమైన లక్షణాలు ఉంటాయని బలంగా నమ్మి వ్యవహరించడం ఎంత మూర్ఖత్వం, ఎంత అశాస్త్రీయం! మనుషులంతా ఒక్కటేనని.. విద్వత్తు, నైపుణ్యం, బుద్ధికుశలత ఏ ఒక్కరి సొత్తు కాదని.. ఆకలి, నిద్ర, బాధ, ఆనందం, కన్నీళ్లు వంటివి ప్రతి మనిషికీ ఒకటేనని కొవిడ్‌ అనంతర కాలంలోనైనా మనం గుర్తిస్తే బాగు.

మన జాతి గొప్పదని, మనవాళ్లు మాత్రమే వర్ధిల్లాలని, మిగిలినవాళ్లు నాశనం కావాలని కోరుకోవడం హిట్లర్‌ సిద్ధాంతం. జాతి, కులం, మతం వంటి జాడ్యాలను ఆచరించడం హిట్లర్‌ను, వాడి మారణకాండను సమర్థించడమే. గోద్రా, చుండూరు, కారంచేడు వంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చేయడం ప్రభుత్వాల చేతిలో పెద్దగా లేదు. సామూహిక భావనను, ప్రశాంతతను నాశనం చేసి విభేదాలు సృష్టిస్తున్న ఆధిపత్య భావనను సాధారణ సంభాషణల్లో కూడా అడ్డుకోవడం నేర్చుకోవాలి. వ్యక్తిగత స్థాయిలో ప్రతి పౌరుడూ జాతి, కుల, మత, ప్రాంత ఆధిపత్య భావనలను ఆదిలోనే తుంచడం అలవాటు చేసుకోవాలి. కుటుంబపెద్దలు ఈ అవలక్షణాలను యువతరానికి ఎక్కించి కలుషితం చేయకుండా ఉండటం అన్నిటికన్నా ముఖ్యం.

డాక్టర్‌ ఎస్‌ రాము
సీనియర్‌ జర్నలిస్ట్‌, కమ్యూనికేషన్స్‌ నిపుణుడు

Courtesy Namasthe Telangana

Leave a Reply