- శిశువుకు జన్మనిచ్చి గిరిజన బాలిక ఆత్మహత్య
- కృష్ణాష్టమి రోజు కామారెడ్డి జిల్లాలో ఘటన
- ప్రేమికుడి మోసంతోనే.. ఘటనపై సత్యవతి సీరియస్
- బాలికను మోసగించిన వ్యక్తిని పట్టుకోవాలని ఆదేశం
- అక్కల భర్తల్లో ఒకరు అఘాయిత్యానికి పాల్పడి ఉంటారా?
గాంధారి : కృష్ణాష్టమి సంబురాల్లో మునిగితేలుతున్న ఆ జనం అర్ధరాత్రి బిడ్డ ఏడుపు వినిపించడంతో చుట్టుపక్కల వెతికారు. ఓ చోట పొదల్లో చూసి నోరెళ్లబెట్టారు. పుట్టి కొన్నిగంటలే అయివుంటుందేమో ఆ నెత్తుటి గుడ్డు గుక్కపెట్టి ఏడుస్తోంది! బిడ్డను పొదల్లో పారేసిన ఆ తల్లి గుండె ఎంత పాషాణమో కదా! అని కొందరు ఆడిపోసుకుంటున్నంతలోనే తెలిసింది.. ఆ బిడ్డ తల్లి 14ఏళ్ల బాలిక అని. ప్రేమ పేరుతో ఆమెను ఓ యువకుడు నమ్మించి మోసం చేయడంతోనే ఆమె గర్భం దాల్చి.. నెలలు మోసి ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిందని.. కొద్దిసేపటికే బిడ్డను పొదల్లో వేసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని! కామారెడ్డి జిల్లా గాంఽధారి మండలంలోని ఓ గిరిజన తండాలో మంగళవారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. అక్కడికి చేరుకున్న పోలీసులు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆ శిశువును కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. శిశువుకు జన్మనిచ్చి న వారు ఎవరా!? అని పోలీసులు ఆరా తీస్తే పై వివరాలు తెలిశాయి. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ప్రేమికుడు, శారీరకంగా దగ్గరై మోసం చేయడంతోనే ఆ బాలిక ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు. బాలిక కుటుంబ సభ్యు ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ అయ్యారు. బాలికను మోసగించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన వ్యక్తిని వెంటనే పట్టుకొని కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు. బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు.
అక్కల భర్తలపై అనుమానం!
బాలిక గర్భం దాల్చడం.. ఈ విషయాన్ని నెలల తరబడి గుట్టుగా ఉంచడం వెనుక తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉన్నట్టు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ బాలిక ఐదో తరగతి దాకా చదివి మానేసి, వ్యవసాయ పనులకు వెళ్లేది. ఈమెకు ముగ్గురు అక్కలు, ఓ చెల్లి, తమ్ముడు ఉన్నారు. అక్కలకు పెళ్లిళ్లయ్యాయి. ముగ్గురు అక్కల భర్తల్లో ఎవరో ఒకరు బాలికపై అఘాయిత్యానికి తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగానూ వారు దర్యాప్తు చేస్తున్నారు.
Courtesy Andhrajyothi