- ఆడపిల్లలు పుట్టారని బాలింతను గద్వాలలో గొంతు నులిమి చంపిన భర్త
- గర్భస్రావం చేయించుకుందని హైదరాబాద్‌లో..
కడదాకా కలిసుంటానని ఏడడుగులు నడిచిన ఇద్దరు భర్తలు కర్కశంగా మారారు. ఆడపిల్లల్ని కన్నదని పచ్చి బాలింతరాలైన భార్యను ఒకరు, గర్భస్రావం చేయించుకున్న ఆలిని మరొకరు గొంతులు నులిమి దారుణంగా హతమార్చారు. జోగులాంబ గద్వాల జిల్లా, హైదరాబాద్‌లలో ఈ ఘోర సంఘటనలు చోటుచేసుకున్నాయి.
గద్వాల అర్బన్,సనత్‌నగర్: పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన కథనం మేరకు.. వనపర్తి జిల్లా మదనాపురం గ్రామానికి చెందిన శకుంతలమ్మ, ఆంజనేయుల కుమార్తె పల్లవి(25). ఆమె వివాహం 2019 నవంబరులో గద్వాలకు చెందిన, మల్దకల్ ఎంపీడీవో కార్యాలయంలో అటెండరైన వెంకటేశ్‌తో జరిగింది. పెళ్లయిన కొద్ది నెలలకే వెంకటేశ్ అదనపు వరకట్నం తేవాలంటూ పల్లవిని వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు 2020 మార్చిలో ఓ ప్లాట్‌ను వెంకటేశ్‌కు రాసిచ్చారు. ఆ తర్వాత పల్లవి 2020 అక్టోబరులో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం భార్య పల్లవిని వెంకటేశ్ గద్వాలలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. మరోసారి గర్భం దాల్చిన ఆమె ఈ నెల 22న గద్వాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆడ కవలలకు జన్మనిచ్చింది. 25న మధ్యాహ్నం డిశ్ఛార్జి అయింది. మళ్లీ ఆడ పిల్లలు పుట్టారంటూ భార్యను వెంకటేశ్ తూలనాడాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించాడు. ఇంక తన వల్ల కాదని పల్లవి చెప్పడంతో అదే రోజు రాత్రి సుమారు 11.30 గంటలకు బాలింత అన్న జాలి లేకుండా పల్లవిని గొంతునులిమి పాశవికంగా హత్య చేశాడు. అనారోగ్యంతో చనిపోయిందంటూ ఆమె తల్లిదండ్రులకు వెంకటేశ్, అతడి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. పల్లవి తల్లిదండ్రులు, బంధువులు ఆమె మృతి పట్ల అనుమానంతో గద్వాల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గద్వాల సీఐ షేక్‌మహబూబ్‌పాష, పట్టణ ఎస్సై హరిప్రసాద్‌రెడ్డిలు మృతదేహాన్ని పరిశీలించి గొంతు కింద గాయాలున్నట్టు గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. పల్లవి భర్త వెంకటేశ్‌పై హత్యానేరంతో పాటు అదనపు వరకట్నం కేసు, అత్త జయమ్మ, ఆడపడుచు లీలావతి, మరిది జనార్దన్‌పై సోమవారం వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ, ఎస్సైలు ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. పల్లవి హత్యకు గురవడంతో ఏడాది వయసున్న చిన్నారి సహా ఆరురోజుల ప్రాయంగల కవలలకు ఇప్పుడు దిక్కెవరని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోపం పట్టలేక హతమార్చాడు
క్షణికావేశంలో భార్య గొంతు నులిమి హత్య చేసిన ఘటన హైదరాబాద్‌లోని సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మూసాపేట జేపీ నగర్‌లో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా దర్పల్లికి చెందిన మానస(24)తో జగద్గిరిగుట్టకు చెందిన గంగాధర్(32)కు గతేడాది నవంబరు 20న వివాహం జరిగింది. కొద్దినెలలకే వీరి ఇద్దరి మధ్య కలహాలు చోటు చేసుకోవడంతో మూడు నెలల కిందట మానస పుట్టింటికి వెళ్లిపోయింది. గంగాధర్ మూసాపేటలోని జేపీ నగర్‌లో ఉంటున్నాడు. 10 రోజుల క్రితం గంగాధర్ తండ్రి మరణించడంతో మానస జగద్గిరిగుట్టలోని అత్తవారింటికి వచ్చింది. ఆదివారం తన భార్య మానసను గంగాధర్ మూసాపేటలో తానుంటున్న ఇంటికి తీసుకువచ్చాడు. సాయంత్రం ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. తాను గర్భస్రావం చేయించుకున్నానని ఆమె చెప్పడంతో కోపం పట్టలేని భర్త మానసను గొంతునులిమి హత్య చేసి అక్కడ నుంచి పారిపోయాడు. కుమార్తె హత్యకు గురైన విషయం తెలియడంతో ఆమె తండ్రి సనత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, గంగాధర్ కోసం గాలిస్తున్నామని ఇన్‌స్పెక్టర్ చెప్పారు.
Courtesy Eenadu