
- 0-8 నెలల చిన్నారుల లింగ నిష్పత్తిలో భారీ తేడా
- రాష్ట్రంలో వెయ్యి మంది మగపిల్లలకు 929 మందే
- వరంగల్ రూరల్ జిల్లాలో 881 మంది మాత్రమే
- లింగ నిర్ధారణ పరీక్షలు పెరిగిపోవడమే కారణం
- గర్భిణుల కోసం గైనకాలజిస్టులకు ట్యాబ్‌లు
- భారీగా తగ్గుతున్న ఆడపిల్లల జననాలు
- 0-8 నెలల చిన్నారుల
- లింగ నిష్పత్తిలోభారీ తేడా
రాష్ట్రంలో ఆడపిల్లల జననాలు తగ్గుతున్నాయా? ప్రజల్లో లింగవివక్షపై ఆశించినంత అవగాహన కలగడం లేదా? రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈ-బర్త్ పోర్టల్‌లో జనవరి 1 నుంచి ఆగస్టు 25 వరకు నమోదైన గణాంకాలను విశ్లేషిస్తే ఈ అనుమానాలు రాక మానవు. తెలంగాణలో 8 నెలల్లోపు పిల్లల్లో ప్రతి 1000 మంది మగ పిల్లలకు 929 మంది ఆడపిల్లలు మాత్రమే ఉన్నారని పోర్టల్ చెబుతోంది. ఐదు జిల్లాల్లో ఈ సగటు 900లోపుగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఈ 8నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,61,769 మంది మగ పిల్లలు పుడితే.. ఆడ శిశువులు 1,50,212 మందే జన్మించారు. మగ పిల్లల జనన శాతం 52గా ఆడ పిల్లల జనన శాతం 48గా నమోదైంది. రాష్ట్ర సగటుతో పోలిస్తే వికారాబాద్‌లో జిల్లాలో సగటు మెరుగ్గా ఉంది. ఈ జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగపిల్లలకు 973 మంది ఆడశిశువులు ఉన్నారు. జిల్లాల సగటుల్లో ఇదే అత్యధికం. వరంగల్ రూరల్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు కేవలం 881 మంది ఆడ శిశువులే జన్మిస్తున్నారు.
యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు
లింగ నిష్పత్తి పడిపోవడానికి ప్రధాన కారణం.. పెరిగిపోతున్న లింగ నిర్ధారణ పరీక్షలేనన్న అభిప్రాయాలున్నాయి. గర్భస్థ శిశువు మగా? ఆడా? అనేది తెలుసుకునే పరీక్షలు నిర్వహించడంపైనా.. వైద్యులు వెల్లడించడంపైనా నిషేధం ఉంది. అయితే గుట్టు చప్పుడు కాకుండా దీన్ని ఉల్లఘిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఆస్పత్రి, డయాగ్నస్టిక్ కేంద్రం.. పీసీపీఎన్‌డీటీ (ప్రీకాన్సెప్షన్ ప్రీ న్యాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్ యాక్టు) చట్టం కింద రిజిస్టర్ అవ్వాలి. ఈ విషయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని సామాజికవేత్తలు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా యఽథేచ్చగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని, ఒకవేళ పుట్టబోయేది ఆడ శిశువు అని నిర్ధారణ అయితే గర్భంలోనే చిదిమేసే పరిస్థితులు నెలకొన్నాయని వారు అంటున్నారు.
Telangana girls children, ratio, drop, sex ratio, population, birth, gender, discrimination, rights, women, education, culture
ఆడపిల్లంటే భయపడే పరిస్థితి పోవాలి
తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలను కనాలంటే భయపడే పరిస్థితి ఇంకా ఉంది. ఆ భయం పోవాలి. సమాజంలో ఇప్పటికీ ఆడపిల్లలకు రక్షణ లేదు. అత్యాచారాలు, కిడ్నాపుల సంస్కృతి పెరిగిపోతోంది. దీంతో చదువుకున్న వాళ్లు కూడా ఆడపిల్లలను వద్దనుకునే పరిస్థితి ఉంది. వారి ఆ లోచనల్లో మార్పు వస్తేనే ఆడపిల్లల సంఖ్య పెరుగుతుంది.
– డాక్టర్ బాలాంబ, ప్రముఖ గైనకాలజిస్టు
(COURTACY ANDHRA JYOTHI)