గాజువాకలో ప్రేమోన్మాది ఘాతుకం

0
335
  • యువతి గొంతు కోసిన ఉన్మాది
  • ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
  • పోలీసుల అదుపులో నిందితుడు

విశాఖపట్నం/గాజువాక: ప్రేమోన్మాదం ఓ యువతి ప్రాణాలను బలిగొంది. గాజువాకలోని శ్రీనగర్‌ సుందరయ్య కాలనీలో శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేసుకున్న వరలక్ష్మి (17) అనే యువతిని చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్‌సాయి వెంకట్‌(21) ప్రేమ పేరుతో వేధించేవాడు. శనివారం రాత్రి రాము అనే స్నేహితుడితో కలిసి ఆమెకు ఫోన్‌చేసి సుందరయ్య కాలనీలోని సాయిబాబా ఆలయం వద్దకు రావాల్సిందిగా చెప్పాడు. అక్కడికి వచ్చిన యువతి ఎందుకు పిలిచావని అఖిల్‌సాయిని నిలదీయగా.. మాట్లాడాలి రా అంటూ తుప్పల్లోకి లాక్కెళ్లాడు. అక్కడి పరిస్థితిని చూసిన వరలక్ష్మి ఆలయం వద్దకు వెంటనే రావాలని తన అన్నకు ఫోన్‌ చేసి చెప్పగా.. కోపోద్రిక్తుడైన అఖిల్‌సాయి తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మెడపై నరికాడు.

చెల్లెలు ఏదో ప్రమాదంలో చిక్కుకుని ఉంటుందని భయపడిన ఆమె అన్న తండ్రి గురునాథరావుతో కలిసి ద్విచక్ర వాహనాలపై హుటాహుటిన వెళ్లగా.. ఆ యువతి ఆలయ మెట్లపై రక్తపు మడుగులో కనిపించింది. అప్పటికే రాము పరారయ్యాడు. మెట్లు దిగి వస్తున్న అఖిల్‌సాయిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కొనఊపిరితో ఉన్న యువతిని కారులో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ప్రధాన నిందితుడు అఖిల్‌సాయి ఆంధ్రా యూనివర్సిటీలో బీఎల్‌ చదువుతున్నాడు. మరో నిందితుడు రాము డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. హతురాలు వరలక్ష్మి తండ్రి గురునాథరావు స్థానికంగా ట్రాన్స్‌పోర్టు కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు.

Leave a Reply