- కేరళలోని ఎగ్జామ్ సిబ్బంది నిర్వాకం
- మహారాష్ట్రలో ముస్లింలకు బురఖాలు, హిజాబ్‌లు తొలగించాకే అనుమతి
కొల్లామ్(కేరళ)/వాషిం(మహారాష్ట్ర) : నీట్ పరీక్ష సందర్భంగా కేరళ, మహారాష్ట్రల్లో విద్యార్థినులు అవమానాలను ఎదుర్కొన్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కేరలోని కొల్లామ్ జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రం సిబ్బంది… విద్యార్థినులు లోదుస్తులు తీసిన తర్వాతే అనుమతించారు. సదరు కేంద్రంలో పరీక్ష రాసిన ఓ విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నీట్ నిబంధనల ప్రకారమే తాను బట్టలు వేసుకుందని, అందులో లోదుస్తుల ప్రస్తావనే లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలోని ఇన్విజిలేటర్‌లలో ఎక్కువమంది పురుషులే ఉన్నారని, అలాంటప్పుడు విద్యార్థినులు లోదుస్తులు లేకుండా మూడు గంటలపాటు కూర్చొని పరీక్ష ఎలా రాస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయిస్తామని వారు తెలిపారు. సదరు సెంటర్‌లో సుమారు 100 మంది విద్యార్థినులు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నట్టు సమాచారం. ఈ ఘటనపై కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు స్పందిస్తూ… విద్యార్థినుల పట్ల సిబ్బంది తీరు సరైందికాదని, ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కాగా… ఈ సంఘటనను కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. రాష్ట్ర మానవ హక్కుల సంఘం కూడా స్పందించింది. మహారాష్ట్ర వాషిం జిల్లాలోని ఓ నీట్ సెంటర్‌లో ఇద్దరు ముస్లిం విద్యార్థినులను బురఖాలు, హిజాబ్‌లు తీసేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. దీనిపై విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. విద్యార్థునులు బురఖాలు, హిజాబ్‌లు తీసేయకపోతే తామే వాటిని కట్ చేస్తామంటూ సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అసలు స్థానంలో నకిలీలు… 8 మంది అరెస్ట్
న్యూఢిల్లీ, హరియాణాల్లో అసలు విద్యార్థులకు బదులు పరీక్ష రాయడానికి ప్రయత్నించిన కొంతమంది సబ్జెక్టు నిపుణులు సీబీఐకి దొరికిపోయారు. ఈ కుట్ర వెనుక సూత్రధారితోసహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసింది. సదరు నిపుణులు భారీమొత్తంలోడబ్బు వసూలుచేసినట్టుసీబీఐ పేర్కొంది.