- లేదంటే భారత్‌లో హిందువులు ఉండరు!!
- యతి నరసింగానంద వ్యాఖ్యలపై దుమారం
లఖ్‌నవూ : ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు సాధువులు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నిరుడు డిసెంబరులో హరిద్వార్‌లో విద్వేష ప్రసంగం చేసి అరెస్టయిన యతి నరసింగానంద్.. తాజాగా మరో వివాదం రేపారు. హిందూయేతరుడు ప్రధాని అయితే ఇరవై ఏళ్లలో దేశంలో హిందువులే ఉండరని అన్నారు. అందుచేత హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలని, లేదంటే దేశం హిందూరహితం అయిపోతుందని గురువారం గోవర్ధన్‌లో అన్నారు. హిందువులను మేల్కొలిపేందుకు ఆగస్టు 12-14 మధ్య మథు-గోవర్ధన్ ప్రాంతంలో ధర్మసంసద్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఘజియాబాద్‌కు చెందిన దస్నా ఆలయ ప్రధాన పూజారి అయిన ఈయన.. ముస్లిం దేశ ప్రధాని అయితే 20 ఏళ్లలో సగం మంది హిందువులు ఇస్లాం మతం స్వీకరిస్తారని గత ఆదివారం ఢిల్లీలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తమ ఉనికి కోసం హిందువులు ఆయుధాలు చేపట్టాలని కూడా పిలుపిచ్చారు. మరోవైపు.. యూపీలోని సీతాపూర్‌లో స్థానిక ఆలయ పూజారి మహంత్ బజరంగ్‌దాస్ ముని కూడా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఖైరాబాద్‌లో ఎవరైనా ముస్లిం.. హిందూ మహిళల వెంట పడితే.. మీ కుమార్తెను, కోడలిని కిడ్నాప్ చేసి బహిరంగంగా అత్యాచారం చేస్తానని ప్రకటించారు. ఆ వ్యాఖ్యల వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. తన హత్యకు కుట్ర పన్నారని.. రూ.28 లక్షలు సమీకరించారని కూడా మహంత్ అన్నారు. 41 సెకన్లపాటు ఉన్న ఈ వీడియో క్లిప్‌ను ‘ఆల్ట్‌న్యూస్’ అనే వెబ్‌సైట్ సహవ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబేర్ ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ నెల 2న మహంత్ ఈ వ్యాఖ్యలు చేశారని.. ఇంతవరకు పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆరోపించారు. ఆయన ట్వీట్‌కు స్పందించిన సీతాపూర్ పోలీసులు మహంత్‌పై కేసు నమోదుచేశారు. మహంత్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఆయనపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ రాష్ట్ర డీజీపీకి కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ లేఖ రాశారు.