నాటు.. గ్రేటు

0
47
  • ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం
  • బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణి
  • లేడీగాగా, రిహానా, టేలర్‌ స్విఫ్ట్‌ వంటి గాయకుల పాటలతో పోటీ పడి గెలుపు
  • అంతర్జాతీయ వేదికపై తెలుగు పాట సత్తా
  • ఆర్‌ఆర్‌ఆర్‌ ’ చిత్ర బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు

నాట్‌ లేడీగాగా.. నాట్‌ రిహానా.. నాట్‌ టేలర్‌ స్విఫ్ట్‌ మై బ్రదర్‌.. డూ యూ నో.. ‘నాటు?

..అంటూ మన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ప్రతిష్ఠాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ వేదిపై దుమ్ము రేపింది! ‘పొలంగట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు..’ తెలుగు సినిమా పాట సత్తాను ప్రపంచానికి చాటింది. ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో అవార్డును అందుకుని.. అంతర్జాతీయ పురస్కారాల వేదికలపై కొనసాగిస్తున్న జైత్రయాత్రలో భాగంగా మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. అమెరికాలో బుధవారం జరిగిన గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ప్రదానోత్సవానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, కథానాయకులు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ తమ కుటుంబసభ్యులతో సహా హాజరయ్యారు. ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు పురస్కారం ప్రకటించగానే.. వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. రాజమౌళి, ఎన్టీఆర్‌, చరణ్‌.. అంతా లేచి నిలబడి హుషారుగా చప్పట్లు కొడుతూ డ్యాన్స్‌ చేస్తూ ఉండగా.. ఆ సందడి నడుమ కీరవాణి సగర్వంగా వేదికపైకి వెళ్లి పురస్కారాన్ని అందుకుని మాట్లాడారు. ‘‘గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం అందుకోవడం.. ఈ సంతోషకరమైన క్షణాలను నా శ్రీమతితో పంచుకోవడం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది. చిత్ర దర్శకుడు, నా సోదరుడు రాజమౌళికే ఈ గౌరవం దక్కుతుంది. గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌కు ధన్యవాదాలు. నా కుమారుడు కాలభైరవ అద్భుతమైన సహకారం అందించాడు’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ మీడియాతో మాట్లాడారు. హాలీవుడ్‌ రిపోర్టర్‌, వెరైటీ కల్చరల్‌ అండ్‌ ఈవెంట్‌ ఎడిటర్‌ మార్క్‌ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్‌ ఆయనకు ‘టై’ గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు.

హేమాహేమీలతో పోటీ పడి..

నాటు నాటు’ పాటకు ఈ పురస్కారం అంత సులభంగా రాలేదు! ప్రపంచప్రసిద్ధి గాంచిన లేడీ గాగా, టేలర్‌ స్విఫ్ట్‌, రిహానా వంటి ప్రముఖులు సూపర్‌హిట్‌ సినిమాలకు పాడిన పాటలతో పోటీ పడి మరీ సాధించిన విజయమిది. ‘మార్వెల్‌ స్టూడియోస్‌’ నిర్మించిన అవెంజర్‌ సినిమా ‘బ్లాక్‌పాంథర్‌: వకాండా ఫరెవర్‌’లో రిహానా రాసి, పాడిన ‘లిఫ్ట్‌ మీ అప్‌’ పాట కూడా ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్స్‌’ నామినేషన్స్‌లో ఉంది. తన కెరీర్‌లో ఇప్పటికే 9 గ్రామీ అవార్డులు, 12 బిల్‌బోర్డ్‌ మ్యూజిక్‌ అవార్డులు, 13 అమెరికన్‌ మ్యూజిక్‌ అవార్డులు సాధించిన సుప్రసిద్ధ గాయని రిహానా! ఇక.. టామ్‌ క్రూయిజ్‌ హీరోగా వచ్చిన ‘టాప్‌గన్‌ మావెరిక్‌’ చిత్రం కోసం ప్రముఖ గాయని లేడీ గాగా పాడిన ‘హోల్డ్‌ మై హ్యాండ్‌’ కూడా ఈ పోటీలో ఉంది. ఆమె ఖాతాలో ఇప్పటికే ఒక ఆస్కార్‌ అవార్డు, 13 గ్రామీ అవార్డులు, రెండు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు ఉన్నాయి. మరోవైపు.. ‘వేర్‌ ద క్రాడాడ్స్‌ సింగ్‌’ అని సినిమా కోసం అమెరికన్‌ పాపులర్‌ గాయని టేలర్‌ స్విఫ్ట్‌ రాసి, పాడిన ‘కారొలిన్‌’ పాట కూడా ఈ పోటీలో ఉంది. టేలర్‌ స్విఫ్ట్‌ కూడా ఇప్పటికే 11 గ్రామీ అవార్డులు, 40 అమెరికన్‌ మ్యూజిక్‌ అవార్డులు, 29 బిల్‌బోర్డ్‌ మ్యూజిక్‌ అవార్డులు సాధించిన గాయని. ఈ పాటలతో పోటీ బరిలో నిలిచి, గెలిచిందంటే.. ‘నాటు నాటు’ విదేశీయులనూ ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.

Leave a Reply