మాల్దీవులకు గొటబాయ పలాయనం

0
85
  • అటు నుంచి సింగపూర్‌ వెళ్లే అవకాశం
  • తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘె
  • శ్రీలంకలో ఎమర్జెన్సీ, కర్ఫ్యూ విధింపు
  • ధిక్కరిస్తూ ప్రజల ఆందోళనలు
  • రణిల్‌ రాజీనామాకు డిమాండ్‌..
  • ప్రధాని కార్యాలయం, పార్లమెంటు ముట్టడి
  • మాల్దీవుల్లోనూ రాజపక్సకు నిరసనల సెగ

కొలంబో/మాలె: ఆర్థికంగా, రాజకీయంగా కుదేలైన శ్రీలంక మరోసారి నిరసనలతో అట్టుడికింది. సంక్షోభానికి కేంద్ర బిందువుగా ఉన్న అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆందోళనకారులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. ప్రధాని రణిల్‌ విక్రమసింఘె కార్యాలయాన్ని ముట్టడించారు. భద్రతాబలగాలు బాష్పవాయుగోళాలు ప్రయోగించడంతో ఊపిరందక ఒక యువకుడు మృతి చెందారు. తాత్కాలిక అధ్యక్షుడి హోదాలో విక్రమసింఘె దేశంలో అత్యవసర పరిస్థితిని, పశ్చిమ ప్రావిన్సులో కర్ఫ్యూను విధించారు. కానీ నిరసనకారులు వాటిని ధిక్కరించి ఆందోళనను కొనసాగిస్తున్నారు. కొత్త బాధ్యతల నుంచి, ప్రధాని పదవి నుంచి విక్రమసింఘె వైదొలగాలని విపక్ష నేతలూ పట్టుపడుతున్నారు. పార్లమెంటు స్పీకర్‌కు ఆ బాధ్యతలు అప్పగించి త్వరగా అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ నెల 20న కొత్త సర్కారు ఏర్పాటవుతుందని స్పీకర్‌ మహింద యాపా అభయ్‌వర్ధన వెల్లడించారు. విపక్షాలు తన రాజీనామాకు డిమాండ్‌ చేయడంతో అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ప్రధానిగా నియమించాలని స్పీకర్‌కు విక్రమసింఘె సూచించారు. అధ్యక్షుడు గొటబాయ రాజీనామా చేయకముందే ప్రధాని పదవి నుంచి వైదొలగాలని విక్రమసింఘెపై ఒత్తిడి వస్తోంది.

నలుగురు కాదు… 13 మంది..
అధ్యక్షుడు గొటబాయ, ఆయన సతీమణి, వారి వెంట ఇద్దరు భద్రతా సిబ్బంది సైనిక విమానంలో మాల్దీవులకు వెళ్లినట్లు శ్రీలంక వైమానిక దళం బుధవారం ఓ సంక్షిప్త ప్రకటనలో వెల్లడించింది. ప్రభుత్వ అభ్యర్థన, అధ్యక్షుడిగా గొటబాయకున్న అధికారాలు, రక్షణ మంత్రిత్వశాఖ అనుమతి మేరకే కటునాయకె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం వేకువజామున 3 గంటలకు వారిని మాల్దీవులకు తరలించినట్లు వివరించింది. అయితే, గొటబాయ వెంట మొత్తం 13 మంది మాల్దీవులకు చేరుకున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇందుకు మాలె ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ఆ దేశ పార్లమెంటు స్పీకర్‌ కీలకపాత్ర వహించినట్లు తెలుస్తోంది. గొటబాయ ఇంకా అధ్యక్ష పదవికి రాజీనామా చేయకపోవడం, దేశాధినేత హోదాలో వస్తున్నందున తిరస్కరించలేకపోయామని మాల్దీవుల సర్కారు సమర్థించుకుంది. అయితే అక్కడ కూడా గొటబాయ కుటుంబం నిరసనను ఎదుర్కొంటోంది. గొటబాయను ఎందుకు అనుమతించారని స్థానికులు మాల్దీవుల ప్రభుత్వాన్ని నిరసనలతో నిలదీస్తున్నారు. రాజపక్స కుటుంబం సింగపూర్‌ వెళ్లే అవకాశం ఉందని సమాచారం. సురక్షితమైన గమ్యస్థానానికి చేరుకున్న తర్వాతే శ్రీలంక అధ్యక్ష పదవికి గొటబాయ రాజీనామా చేయవచ్చని తెలుస్తోంది. ఆయన తమ్ముడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బసిల్‌ కూడా దేశాన్ని వీడినట్లు తెలుస్తోంది. రాజపక్స కుటుంబం సోమవారమే శ్రీలంక నుంచి పారిపోయేందుకు విఫల యత్నం చేసిన విషయం తెలిసిందే.

ప్రజాఉద్యమం ధాటికి అధ్యక్ష భవనాన్ని వీడిన గొటబాయ మాల్దీవులకు సురక్షితంగా చేరుకోవడంలో సాయం చేశారంటూ తమపై వస్తున్న ఆరోపణలను భారత హైకమిషన్‌ తోసిపుచ్చింది. నిరాధారమైన ప్రచారాలని పేర్కొంది. శ్రీలంక ప్రజల ఆకాంక్షలకు తమ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని భారత ప్రభుత్వం ఓ ట్వీట్‌లో స్పష్టం చేసింది.

ప్రవాసం నుంచే తాత్కాలిక అధ్యక్షుడి నియామకం
గొటబాయ మాల్దీవులకు చేరుకున్నాక.. అక్కడి నుంచే దేశ తాత్కాలిక అధ్యక్షునిగా ప్రధాని రణిల్‌ విక్రమ సింఘేను నియమించారు. దేశాధినేత తీవ్ర అనారోగ్యానికి గురైనా, దేశంలో లేకపోయినా ఆ స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిని నియమించడానికి శ్రీలంక రాజ్యాంగంలోని 37(1)అధికరణం అనుమతిస్తుంది. ప్రధాన మంత్రిగా ఉన్న వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పగించవచ్చు. తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘె నియమితులైన విషయాన్ని పార్లమెంటు స్పీకర్‌ మహింద యాపా అభయ్‌వర్ధన వెల్లడించారు. ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం బుధవారం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ఫోన్‌లో తనకు గొటబాయ చెప్పారన్నారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఈ నెల 20న జరుగుతుందని స్పష్టం చేశారు.

సైన్యానికి శాంతిభద్రతల బాధ్యత
తాత్కాలిక అధ్యక్షుడి హోదాలో రణిల్‌ విక్రమసింఘె దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. కొలంబోలోని ఫ్లవర్‌ రోడ్‌లో ఉన్న ప్రధాన మంత్రి కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఆందోళనకారులను తరిమి వేసేందుకు పశ్చిమ ప్రావిన్స్‌లో కర్ఫ్యూ విధించారు. విధ్వంసానికి పాల్పడుతున్న ఫాసిస్టులను అణచివేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాన్ని సహించబోమన్నారు. దేశంలో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడం కోసం, అత్యవసర పరిస్థితిని, కర్ఫ్యూను అమలుచేయడం కోసం సైన్యానికి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. రాజకీయ జోక్యాన్ని నివారించేందుకు త్రివిధ దళాల అధిపతులతో కమిటీని ఏర్పాటు చేసి శాంతిభద్రతల బాధ్యతను అప్పగించినట్లు వివరించారు. ప్రభుత్వ టెలివిజన్‌ ఛానల్స్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నప్పుడే ఉద్యమకారులు టీవీ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. దీంతో ప్రసారాలకు కొంత సమయంపాటు అంతరాయం కలిగింది. అయితే సమస్యను రాజకీయ పార్టీలు సామరస్యంగా పరిష్కరించాలే తప్ప, సైనిక చర్య సరికాదన్న రీతిలో సైన్యం ఆచితూచి స్పందిస్తోంది.

వెనక్కి తగ్గని ఉద్యమకారులు
తాత్కాలిక అధ్యక్షుడి ఎమర్జెన్సీ, కర్ఫ్యూ ఆదేశాలను నిరసనకారులు పట్టించుకోలేదు. గొటబాయ మాల్దీవులకు వెళ్లేందుకు విమానాన్ని సమకూర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎయిర్‌ ఫోర్స్‌ కమాండర్‌ నివాసాన్ని చుట్టుముట్టారు. బ్యారికేడ్లను నెట్టివేస్తూ ప్రధాన మంత్రి కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన నిరసనకారులపైకి పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. పార్లమెంటు ప్రాంగణంలోకి చొరబడేందుకు యత్నిస్తున్నారని, వారిని నియంత్రించేందుకు కాల్పులు జరపటానికి అనుమతించాలని సైనికాధికారులు కోరగా విపక్ష నేతలు తిరస్కరించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘె నియామకాన్ని మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, విపక్ష నేత సాజిత్‌ ప్రేమదాస తప్పుపట్టారు. విపక్ష నేతలందరూ సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించుకున్నారు. తాత్కాలిక అధ్యక్షుడి ఆదేశాలను పాటించవద్దని సాయుధ బలగాలకు మాజీ సైన్యాధిపతి, ఎంపీ ఫీల్డ్‌మార్షల్‌ శరత్‌ ఫొన్సెకా విజ్ఞప్తి చేశారు.

Leave a Reply