రాజ్యాంగ రేఖ దాటుతున్న గవర్నర్లు

0
140
రాజ్‌దీప్‌ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

ఢిల్లీబిగ్ బాస్ ఎవరు? ఇదొక ఆసక్తికరమైన ప్రశ్న. దేశ రాజధానిలో రాజకీయ వీవీఐపీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారిలో ఎవరిని బిగ్ బాస్‌గా పరిగణించాలి? సువిశాల ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంత వ్యవహారాలను నియంత్రించే కేంద్ర హోం మంత్రిత్వ శాఖనా? ఏ విషయం పైన అయినా అంతిమ నిర్ణయాధికారి, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన లెఫ్టినెంట్ గవర్నర్‌నా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, నగర పాలనను నిర్వహించే అధికారాలు గల ముఖ్యమంత్రినా? శాసన సంశయాత్మకత, పెచ్చరిల్లుతోన్న రాజకీయ ఘర్షణల మధ్య గవర్నర్లు పక్షపాత వైఖరితో నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. రాజ్యాంగ విధులు నిర్వర్తించేందుకు నియోజితులైన వ్యక్తులు పారదర్శకంగా వ్యవహరించకపోవడంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య సత్సంబంధాలు కొరవడడం ఆ శోచనీయ పరిస్థితికి ఒక తాజా ఉదాహరణ. ఆ ఇరువురి మధ్య జగడం చివరకు ఢిల్లీ మేయర్ ఎన్నిక నిలిచిపోవడానికి దారితీసింది. నగర మేయర్ తరువాత మునిసిపల్ కార్పొరేషన్‌లో ముఖ్య సభ్యులను లెఫ్టినెంట్ గవర్నర్ ఏకపక్షంగా నామినేట్ చేశారు. ముఖ్యమంత్రిని సంప్రదించలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే మునిసిపల్ కార్పొరేషన్ సమాశాలకు ఎవరు అధ్యక్షత వహించాలో కూడా నిర్ణయించారు. దీంతో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఈ గందరగోళమే మేయర్ ఎన్నిక నిలిచిపోవడానికి కారణమయింది.

ఇరు పార్టీల ప్రతినిధులూ పరస్పరం పలు ఆరోపణలు చేసుకున్నారు. మేయర్ పదవికి పోటీపడుతున్న ఆప్, బీజేపీల మధ్య లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా నిజంగా తటస్థ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారా? ఒక రాజకీయ పక్షానికి ఆయన అనుకూలంగా వ్యవహరించడం లేదా? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన కేజ్రీవాల్ ప్రభుత్వ అధికారాలను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆ సర్కార్‌ను దుర్బలపరచడమే కాకుండా దాన్ని అసంగతమైనదిగా మార్చివేయలేదా? ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెర్రిటోరీ ఆఫ్ ఢిల్లీ (జి ఎన్‌సిటిడి) చట్టం–1992’ ప్రకారం పోలీసు, శాంతిభద్రతల పరిరక్షణ, భూమి సంబంధిత వ్యవహారాలలో మినహా మిగతా అన్ని విషయాలోనూ మంత్రిమండలి సహాయం, సలహాకు అనుగుణంగా లెఫ్టినెంట్ గవర్నర్ తన విధులు నిర్వర్తించవలసి ఉంది. మంత్రిమండలి సహాయం, సలహాపై లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరించాలన్న నిర్దేశం కార్యనిర్వహణాధికారాలన్నీ ఎన్నికైన ప్రభుత్వ అధీనంలో ఉంటాయనే వాస్తవాన్ని స్పష్టం చేస్తోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక కాని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కార్యనిర్వహణాధికారాలు ఉండవు. ఇందుకు భిన్నంగా ఎటువంటి భాష్యం చెప్పినా అది రాజ్యాంగాన్ని వక్రీకరించడమే అవుతుంది.

అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం 2021 మార్చిలో జిఎన్‌సిటిడి చట్టానికి కొన్ని సవరణలు చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ విధాన నిర్ణయ అధికారాలను అవి ఫలప్రదంగా తగ్గించివేశాయి. ఢిల్లీ ప్రభుత్వ స్వతంత్ర ప్రతిపత్తిని కుదించి వేశాయి. మంత్రిమండలి తీసుకునే ఏ నిర్ణయంపైన అయినా లెఫ్టినెంట్ గవర్నర్‌కు పర్యవేక్షణాధికారాలను కల్పించాయి. గవర్నమెంట్ ఆఫ్ ది కేపిటల్ టెర్రిటోరీ ఆఫ్ ఢిల్లీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అని ఆ సవరణలు స్పష్టం చేశాయి. ఆయనే అసలైన పాలకుడు అని నిర్దేశించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపేక్షించి తన విచక్షణ మేరకు నిర్ణయాలు తీసుకునే అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్‌కు పూర్తిగా లభించాయి.

గత ఏడాది మేలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి సక్సేనా ఆ అధికారాలను పూర్తిగా వినియోగించుకుంటున్నారు. దాదాపుగా ప్రతి అంశంపైనా కేజ్రీవాల్ ప్రభుత్వంతో ఆయన బహిరంగంగా గొడవపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఢిల్లీ నగర పాలనను సక్సేనా పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకున్నారు. అధికారులు అందరూ ముఖ్యమంత్రిని, ఆయన కేబినెట్‌ను ఉపేక్షించి లెఫ్టినెంట్ గవర్నర్ నుంచే ఆదేశాలు తీసుకుంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మూడు సార్లు భారీ మెజారిటీతో ఎన్నికైన ముఖ్యమంత్రి. మరి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక కాని, కేంద్రం నియమించిన ఒక అధికారికి లోబడి పనిచేయవలసిరావడమేమిటి? ఇది, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం కాదా? భవిష్యత్తులో కేంద్రంలోని ప్రధాన కార్యనిర్వహణాధికారికి దేశ పాలనా వ్యవహారాలలో రాష్ట్రపతి షరతులు విధించే పరిస్థితి వస్తే?! కేజ్రీవాల్ నేతృత్వంలోని మంత్రిమండలి అధికారాలను ఎంతగా బలహీనపరచాలో అంతగా బలహీనపరిచిన తరువాత ఎన్నికల హామీలను నెరవేర్చడం లేదా నెరవేర్చకపోవడం విషయంలో దానిని ఎలా జవాబుదారీ చేస్తారు?

దురదృష్టవశాత్తు ఢిల్లీ పౌరులు గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ అనుచితమైన రాజకీయ గుంజాటనలో చిక్కుకున్నారు. కేంద్రంలో పెత్తనం చెలాయిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం దానికి ఎదురుతిరుగుతున్న కేజ్రీవాల్ సర్కార్ మధ్య ప్రజా సంక్షేమం పూర్తిగా నలిగిపోతున్నది. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ఆప్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఆయనే తిరుగులేని నేత అని రుజువయింది. స్థానిక మొహల్లా స్థాయిలో ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వల్లే బీజేపీ నుంచి ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను ఆప్ స్వాయత్తం చేసుకోగలిగింది. ఆ పార్టీ భావాలు, కార్యక్రమాలు; ఇంకా దాని వ్యవహార శైలి వివాదాస్పదమైనవి కావచ్చు కానీ ఆ పార్టీ నాయకులకు ఎనలేని ప్రజాదరణ ఉన్నదనేది ఎవరూ తిరస్కరించలేని వాస్తవం. కేజ్రీవాల్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు బీజేపీ తన ఢిల్లీ రాష్ట్ర విభాగ నాయకత్వంలో తరచు మార్పులు చేసింది. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరకు తమకు అనుకూలంగా వ్యవహరించే లెఫ్టినెంట్ గవర్నర్‌పై ఆధారపడసాగింది. ఆప్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఒక ఎత్తుగడగా లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఉపయోగించుకుంటోంది. రాజ్యాంగ విధులు నిర్వర్తించే అధికారులను కేంద్రంలోని పాలకపక్షాలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమనేది ఢిల్లీ రాష్ట్రానికే పరిమితమైన విషయం కాదు. అంతకంతకూ పెరుగుతున్న భ్రష్టపాలనా విన్యాసాలలో భాగంగానే అది సంభవించింది. ఎన్నికైన ప్రభుత్వాలకు, ప్రజాస్వామిక ప్రక్రియలకు అది అశుభ సూచకమనడంలో సందేహం లేదు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల గవర్నర్లు రాజ్యాంగ పరిరక్షకులుగా ఉండడానికి బదులుగా రాజకీయపక్షపాత వైఖరులతో వ్యవహరిస్తున్నారు. రాజ్‌భవన్‌లు రాజకీయాలకు నెలవులవుతున్నాయి.

తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి శాసనసభను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో, ప్రభుత్వం నిర్ణయించిన పాఠానికి భిన్నంగా మాట్లాడడంతో పాటు, ఆపై సభ నుంచి వాకౌట్ చేయడం దిగ్భ్రాంతి కలిగించింది. రాజ్యాంగ విధులు నిర్వర్తించే అధికారులే రాజ్యాంగ సంప్రదాయాలను ఎలా అగౌరవపరుస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం మాత్రమే. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులకు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు రాజకీయ ప్రకటనలు చేయడం రవికి పరిపాటి అయింది. తమిళనాడు పేరును సైతం మార్చాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు! ఇక కేరళలో గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ రోజూ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌తో మాటల యుద్ధం చేస్తూనే ఉంటారు. పంజాబ్‌లో శాసనసభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అనుమతించలేదు. మహారాష్ట్రలో గవర్నర్ బిఎస్ కోషియారీ శివసేనలో తిరుగుబాటుకు తోడ్పడ్డారు. ఫిరాయింపులకు సంబంధించిన పిటిషన్లు సుప్రీం కోర్టు విచారణలో ఉన్న విషయాన్ని ఉపేక్షించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అన్నివిధాలా సహకరించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ల మధ్య వివాదాలు తీవ్రమవుతున్నాయి. ఇప్పుడు రాజ్‌భవన్‌లలో ఉన్న బీజేపీ రాజకీయవేత్తలకు ఆమె మరొక ఉదాహరణ.

కేంద్రంలో ఇంతకు మునుపు అధికారంలో ఉన్న ప్రభుత్వాలన్నీ తమ శక్త్యానుసారం రాజ్‌భవన్‌లను దుర్వినియోగపరిచాయి కదా అన్న వాదన ఇంకెంత మాత్రం ఆమోద యోగ్యం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో రబ్బర్ స్టాంప్ గవర్నర్లు నిర్హేతుకంగా రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్ చేసిన మాట నిజమే. అయితే అంతమాత్రాన, ప్రస్తుతం పలువురు గవర్నర్లు కేంద్రంలోని అధికారపక్ష రాజకీయ ప్రయోజనాల పరిపూర్తికి రాష్ట్ర పాలనా వ్యవహారాలలో నిస్సిగ్గుగా జోక్యం చేసుకోవడం ఎలా న్యాయసమ్మతమవుతుంది? రాజ్యాంగం లోని అధికరణ 154 (2) (ఎ) ఇలా స్పష్టం చేసింది: ‘రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారి గవర్నర్. రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన అధికారాలను గవర్నర్ స్వయంగా గాని, తన క్రింది అధికారుల ద్వారా గాని నిర్వహిస్తారు. అయినప్పటికీ చట్ట ప్రకారం మరేదైనా అథారిటీకి సంబంధించిన అధికారాలు గవర్నర్‌కు సంక్రమింప చేయరాదు’. మరింత స్పష్టంగా చెప్పాలంటే రాష్ట్ర గవర్నర్ల, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల విధులను మన రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించింది. దేశ పౌరులు తాము ఎన్నుకున్న ప్రభుత్వానికి నిర్ణయించిన కార్యభారాన్ని ఒక గవర్నర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ తానే నిర్వర్తించేందుకు ప్రయత్నించడాన్ని ఎట్టి పరిస్థితులలోను రాజ్యాంగం అనుమతించదు. ఈ విలక్షణమైన అధికారాల విభజనను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గుర్తించి, గౌరవించాలి. ఈ విషయంలో ఎటువంటి అలక్ష్యానికి పాల్పడినా సుప్రీంకోర్టు వెన్వెంటనే దానికి రాజ్యాంగ బాధ్యతను గుర్తు చేస్తూ ఒక విస్పష్ట హెచ్చరిక జారీ చేయాలి. ప్రస్తుత సందర్భం ఈ వాస్తవాన్నే వక్కాణిస్తోంది.

Leave a Reply