- సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి..
- రెండేళ్లుగా రాజ్‌భవన్‌కే పరిమితమైన గణతంత్రం
- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనూ ప్రసంగం కరువు
- పైగా ప్రొటోకాల్ లేదు.. అవమానాలు కూడా
- వరుస పరిణామాలతో నొచ్చుకున్న తమిళిసై
- ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం, కేంద్రానికి నివేదిక
- ‘ఎట్ హోం’ కార్యక్రమానికీ హాజరుకాని కేసీఆర్
- విభేదాలున్నా తమిళనాడు, ఢిల్లీలో సీఎంల హాజరు
హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం జాతీయ పండుగ. దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే వేడుక. అన్ని రాష్ట్రాలూ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాయి. తమిళనాడులో ఇటీవల ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఏకంగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయినా.. గణతంత్ర దినోత్సవానికి సీఎం స్టాలిన్ హాజరయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు, అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనా మధ్య పొరపొచ్చాలున్నా.. రిపబ్లిక్ డే ఉత్సవాలకు కేజ్రీవాల్ హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, కేరళలో పినరయి విజయన్ కూడా గవర్నర్ల తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయినా, గణతంత్ర దినోత్సవాలకు, ఎట్ హోంకు హాజరయ్యారు. ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ సభలోనూ కేజ్రీవాల్, విజయన్ ఈ అంశంపై మాట్లాడారు. అయినా ఆయా రాష్ట్రాల్లో గణతంత్ర దినోత్సవానికి వీరు హాజరయ్యారు. రాజ్యాంగపరమైన విధిని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు పాటించారు.
కానీ, రాష్ట్రంలో హైకోర్టు ఆదేశించినా గణతంత్ర దినోత్సవాన్ని రాజ్‌భవన్‌కే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలోనే, వేడుక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్రంగా పరిగణించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీగా వస్తోందని, రాజ్యాంగపరమైన ఈ విధిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. గవర్నర్ యాదాద్రి ఆలయానికి వెళ్లినప్పుడు, సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లినప్పుడు అధికారులు ప్రొటోకాల్ పాటించలేదు. జిల్లా కలెక్టర్‌గానీ, ఎస్పీ గానీ హాజరు కాలేదు. భద్రాచలంలో వరదలు సంభవించిన సమయంలో బాధితులను పరామర్శించేందుకు గవర్నర్ వెళ్లగా.. ప్రభుత్వం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఆమె సొంత ఖర్చులతో రైల్లో వెళ్లి వచ్చారు. తన పట్ల ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలా వ్యవహరించినా భరించానని, కానీ.. గణతంత్ర దినోత్సవం విషయంలో ప్రభుత్వ తీరు సమర్థనీయం కాదన్న అభిప్రాయానికి ఆమె వచ్చినట్లు తెలుస్తోంది. వరుస పరిణామాలతో నొచ్చుకున్న గవర్నర్.. ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ప్రతిసారీ అవమానాలు ఎదుర్కొనే బదులు.. సర్కారు తీరును మరింత ఎండగట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గణతంత్ర దినోత్సవంపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరి గవర్నర్‌ను తీవ్ర ఆందోళనకు, అసంతృప్తికి గురి చేసినట్లు తెలుస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ కేంద్రానికి నివేదించారు. జాతీయ పండుగకు ఇవ్వాల్సినగౌరవం ఇవ్వలేదని తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలను అనుసరించలేదని ఫిర్యాదుచేశారు. కార్యక్రమానికి సీఎం, మంత్రులు హాజరు కాకుండా అవమానించారని తెలిపారు. నిజానికి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే ఆమెను ఇలాంటి ఫిర్యాదులు చేసే స్థాయికి తీసుకెళ్లిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఏడాదీ ఇదే పరిస్థితి..
గత ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని రాజ్‌భవన్‌లోనే నిర్వహించుకోవాలంటూ ప్రభుత్వం సమాచారమిచ్చింది. అప్పుడు ప్రసంగ కాపీని కూడా పంపించింది. అయితే… కరోనా అంతగా లేదని, కరోనా నిబంధనలు పాటిస్తూ పబ్లిక్ గార్డెన్ లేదా పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు అప్పట్లో రాజ్‌భవన్ నుంచి వచ్చాయి. కానీ, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజ్‌భవన్‌కు పరిమితం చేసిందన్న వాదన వినిపించింది. అదే కోపంతో గవర్నర్ కూడా ప్రభుత్వ ప్రసంగ కాపీని చదవలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ తన సొంత ప్రసంగాన్ని కొనసాగించారు. దాంతో సీరియస్ అయిన ప్రభుత్వం.. మార్చి 7న శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండా చేసింది. ఇది గవర్నర్ ఆవేశానికి మరింత ఆజ్యం పోసింది. ఈసారి కూడా బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకుండా చేసింది. ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి చోటు కల్పించలేదు. సెప్టెంబర్ 6, 12, 13 తేదీల్లో జరిగిన వర్షాకాల సమావేశాల అనంతరం సభను ప్రొరోగ్ చేయలేదని, ఈ దృష్ట్యా ఆ సమావేశాలకు కొనసాగింపుగానే ఫిబ్రవరి 3నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయని తెలిపింది. అంటే.. సమావేశాలను గవర్నర్ ప్రారంభించాల్సిన అవసరం లేదని, స్పీకర్ ప్రారంభించినా సరిపోతుందన్న వివరణ ఇస్తోంది. ఈ పరిణామం గవర్నర్‌ను మరింత అసంతృప్తికి, సర్కారుపై ఆగ్రహానికి గురి చేసింది. ఇంతలో గణతంత్ర వేడుకల అంశం తెరపైకి వచ్చింది. రాజ్‌భవన్, సీఎంవో మధ్య ఎన్ని భేదాభిప్రాయాలున్నా.. జాతీయ పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ఇవ్వాల్సిందేనని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. హైకోర్టు ఆదేశిస్తే తప్ప.. దిగిరాకపోవడం మరీ దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు.
ఒక ఉత్సవాన్ని ఉత్సవంలా నిర్వహించాలే తప్ప.. వ్యక్తులు, వ్యవస్థల మధ్య కోపతాపాలను సాకుగా చూపి నిర్లక్ష్యం చేయడం తగదని హితవు పలుకుతున్నారు. తెలంగాణ కూడా దేశంలో ఒక భాగమేనన్న విషయాన్ని మరిచిపోరాదని రాజ్యాంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. పైగా కరోనా కారణంగా ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించలేకపోతున్నామని, రాజ్‌భవన్‌లోనే నిర్వహించుకోవాలని చెప్పడం అత్యంత శోచనీయమని అంటున్నారు. అధికార బీఆర్‌ఎస్ నిర్వహించుకునే సభలు, సమావేశాల సందర్భంలో కరోనా గుర్తుకు రావడం లేదా?అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 5 లక్షల మందితో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించిందని,17న పరేడ్ గ్రౌండ్స్‌లో మరో సభ నిర్వహించనుందని, వాటికీ కరోనా నిబంధనలు వర్తించాలి?కదా అని నిలదీస్తున్నారు.
రెండు నెలల క్రితమే గవర్నర్ లేఖ రాసినా
గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలంటూ రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి తాను లేఖ రాశానని గవర్నర్ తెలిపారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఉత్సవాన్ని రాజ్‌భవన్‌లోనే నిర్వహించుకోవాలంటూ రెండు రోజుల క్రితం సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. హైకోర్టు ఆదేశించడంతో పరేడ్‌ను ఏర్పాటు చేసిందని, లేకపోతే అది కూడా ఉండేది కాదని పేర్కొన్నారు. పైగా ఉత్సవానికి ముఖ్యమంత్రి, మంత్రులు హాజరు కాలేదని, కేవలం సీఎస్, డీజీపీని పంపించారంటూ విమర్శించారు.
సీఎం, మంత్రుల గైర్హాజరుపై..
గణతంత్ర దినోత్సవానికి సీఎం, మంత్రులు గైర్హాజరు కావడంపైనా గవర్నర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్రానికి చేసిన ఫిర్యాదులో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య చాలా రాష్ట్రాల్లో భేదాభిప్రాయాలు, తగాదాలు ఉన్నాయని, అయినా.. గణతంత్ర దినోత్సవ సందర్భంలో ముఖ్యమంత్రులు ప్రొటోకాల్‌ను పాటిస్తున్నారని రాజ్‌భవన్ వర్గాలు వివరిస్తున్నాయి. కానీ, ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. సీఎం హాజరుకాకపోయినా… కనీసం తన ప్రతినిధులుగా సీనియర్ మంత్రులను పంపాలి కదా అని అంటున్నాయి. తమిళనాడు, ఢిల్లీ ముఖ్యమంత్రులకు గవర్నర్లతో విభేదాలున్నా.. ‘ఎట్ హోం’కు హాజరైన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఎన్ని భేదాభిప్రాయలున్నా… వ్యవస్థలు, ఉత్సవాలకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వాలి కదా అని అంటున్నాయి. ఏమైనా… గవర్నర్, సీఎంల మధ్య మరింత తీవ్రమవుతున్న విభేదాలు ఎక్కడి దారి తీస్తాయోనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.