గవర్నర్‌ x సర్కారు

0
32
  • వ్యవస్థల మధ్య మరింత రాజుకున్న అగ్గి
  • యూనివర్సిటీల బిల్లుపై గవర్నర్‌ సందేహాలు
  • సీఎం ముఖ్య కార్యదర్శికి లేఖ రాసిన రాజ్‌భవన్‌
  • విద్యా శాఖ మంత్రిని పంపాలని నిర్దేశం
  • దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రే
  • ప్రస్తుత పరిస్థితుల్లో పంపిస్తారా లేదా!? అనే చర్చ
  • వివాదంతో 5000 పోస్టుల భర్తీపై తీవ్ర ప్రభావం

హైదరాబాద్‌ : ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య అగ్గి మరింత రాజుకుంది. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు విషయంలో తాజాగా వివాదం మొదలైంది. ఈ బిల్లుపై చర్చించడానికి నేరుగా విద్యా శాఖ మంత్రి రాజ్‌భవన్‌కు రావాలని గవర్నర్‌ తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిని నేరుగా సీఎం ముఖ్య కార్యదర్శికి పంపారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎలా స్పందిస్తారనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఏళ్ల తరబడి పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. దాంతో, వీటి భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బోర్డుకు అధికారాలను కల్పించడానికి యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును శాసనసభ సెప్టెంబరు 12న ఆమోదించి, గవర్నర్‌ ఆమోదం కోసం పంపించింది. అప్పటి నుంచి ఈ బిల్లుపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ నేపథ్యంలో, బిల్లుపై సందేహాలు ఉన్నాయని, వాటిపై చర్చించేందుకు విద్యా శాఖ మంత్రి రావాల్సిందిగా గవర్నర్‌ ఈనెల 7న ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ పంపించారు. నిజానికి, ఆ లేఖను తొలుత విద్యా శాఖకు రాశారని ప్రచారం జరిగింది.

తమకు ఎటువంటి లేఖ అందలేదని విద్యా శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. కానీ, గవర్నర్‌ ఆ లేఖను సీఎం ముఖ్య కార్యదర్శికి పంపారు. తద్వారా, ఈ లేఖపై ముఖ్యమంత్రే స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బిల్లుపై చర్చించడానికి మంత్రిని పంపాలా? లేదా? అన్నది సీఎం నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణంలో మంత్రిని పంపిస్తారా లేదా అన్న ఆసక్తి నెలకొంది. నిజానికి, ఆయా బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

అప్పుడు మాత్రమే అవి చట్టరూపం సంతరించుకుంటాయి. బిల్లుపై సందేహాలు ఉన్నాయని గవర్నర్‌ అంటే ప్రభుత్వం వాటిని నివృత్తి చేయాల్సి ఉంటుంది. అందుకు మంత్రి, సంబంధిత అధికారులను పంపకుండా ఉండడం సాధ్యం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రస్తుత వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పంపిస్తారా లేక ఆ శాఖ కార్యదర్శిని పంపిస్తారా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. మరోవైపు, గవర్నర్‌ తీరుపై ప్రభుత్వ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

అసెంబ్లీలో ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్‌ ఆమోదానికి పంపించి చాలా రోజులవుతోందని, వాటిపై ఇన్ని రోజులూ ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండా ఇప్పుడు లేఖ రాయడాన్ని తప్పుబడుతున్నాయి. దాదాపు రెండు నెలలపాటు బిల్లులను ఆమోదించకుండా విలువైన సమయాన్ని వృధా చేశారని తప్పుబడుతున్నాయి. ఏమైనా సందేహాలు ఉంటే బిల్లులను పంపించిన మొదట్లోనే మంత్రిని పిలిపించవచ్చు కదా! అనే వాదన ప్రభుత్వం చేస్తోంది. గవర్నర్‌ తీరు కారణంగానే 5000 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయడంలో ఆలస్యమవుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

త్రిశంకు స్వర్గంలో పోస్టుల భర్తీ
గవర్నర్‌, ప్రభుత్వం మధ్య తాజాగా నెలకొన్న వివాదంతో యూనివర్సిటీల్లోని ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ మరికాస్త ఆలస్యం కానుంది. నిజానికి, రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల స్థాయి నుంచి కింది స్థాయి పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి గతంలో ఉత్తర్వులు జారీ చేసినా భర్తీ చేయలేకపోయారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం ఏ యూనివర్సిటీలోని ఖాళీలను ఆ యూనివర్సిటీయే భర్తీ చేసుకునే విధానం ఉంది. ఈ విధానంలో అవకతవకలు జరగడం, నియామకాల్లో జాప్యం జరుగుతుండడంతో అన్ని వర్సిటీల్లో పోస్టుల భర్తీకి నియామక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రస్తుతం అన్ని యూనివర్సిటీల్లో సుమారు 5 వేల పోస్టుల వరకు ఖాళీగా ఉన్నట్టు అంచనా. వీటి భర్తీ కోసమే ప్రభుత్వం ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేసింది. బోర్డు నియామక ప్రక్రియను ప్రారంభించాలంటే బిల్లు చట్ట రూపం పొందాల్సి ఉంది. అయితే, బిల్లు ఆమోదం ద్వారా న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తి, యూనివర్సిటీల్లోని ఖాళీల భర్తీకి అడ్డంకిగా మారే అవకాశం ఉందని గవర్నర్‌ కార్యాలయ అధికారులు అభిప్రాయపడుతున్నారు. యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు వెలువడతాయని నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. బోర్డు ఏర్పాటుకు చట్ట సవరణ చేయడానికే చాలా సమయం పట్టింది. ఇప్పుడు దాని ఆమోదానికి మరింత జాప్యం జరుగుతోంది. ఈ వివాదం కొనసాగితే పోస్టులు ఎప్పటికి భర్తీ అవుతాయో అర్థం కావడం లేదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply