ఉచిత విద్యకు నిధుల్లేవు!

0
229

  • నాలుగేళ్లుగా పైసా ఇవ్వని ప్రభుత్వం
  • కష్టాల్లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు
  • చిన్న చిన్న ఖర్చులకూ డబ్బుల్లేవ్‌
  • ప్రిన్సిపాళ్లకు తప్పని తిప్పలు

హైదరాబాద్‌: ‘అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు’ అన్న చందంగా మారింది ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల పరిస్థితి. ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు.. విద్యార్థుల నుంచి వసూలు చేసుకోనివ్వడం లేదు. దీంతో నిధుల లేమితో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఉచిత విద్య పథకం ఆ కాలేజీల పాలిట శాపంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద విద్యార్థులు చెల్లించాల్సిన ఫీజులను ప్రభుత్వమే ఇస్తుందని నాటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. అప్పటి నుంచి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయడంలేదు.

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను బలోపేతం చేయడంతో పాటు పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో 2015-16లో ప్రభుత్వం ఉచిత విద్య పథకాన్ని ప్రవేశపెట్టింది. పాఠ్యపుస్తకాలను కూడా ఉచితంగానే అందిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో చాక్‌పీసులు, పేపర్లు, ఇతర చిన్న చిన్న వస్తువులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక సందర్భాల్లో వేడుకలు నిర్వహించడం కాలేజీల ప్రిన్సిపాళ్లకు తలకుమించిన భారం అవుతోంది. వాస్తవానికి ప్రభుత్వ కాలేజీల్లో చేరిన సైన్స్‌ విద్యార్థుల నుంచి రూ. 893, ఆర్ట్స్‌ విద్యార్థుల నుంచి రూ. 500, ఒకేషనల్‌ విద్యార్థుల నుంచి రూ. 1100 వసూలు చేసేవారు. 2015-16 నాటికి 402 ప్రభుత్వ కాలేజీల్లో 1.15లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 2లక్షకు చేరింది. అంటే విద్యార్థుల నుంచి ఫీజుల వసూలు ద్వారా కాలేజీలకు సుమారు రూ. 5కోట్ల నిధులు సమకూరేవి. వీటిలో కాలేజీ అవసరాలకు నిధులు పోనూ మిగతావి అక్యుమిలేషన్‌ ఫీజులోకి వెళ్లిపోయేవి. ఈ ఫీజులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాలేజీల్లో తీవ్రమైన నిధుల కటకట మొదలైంది.

ఆర్థిక శాఖ, సంక్షేమ శాఖ.. తలోమాట
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఉచిత విద్య అమలుపై గతంలోనే సంక్షేమశాఖ, ఆర్థిక శాఖలతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల నుంచి వసూలు చేసే మొత్తాన్ని సంక్షేమశాఖ ద్వారా కాలేజీలకు అందించాలని నిర్ణయించారు. అది అమలుకాలేదు. ఇప్పుడు కాలేజీలకు నిధుల విడుదలపై ఆర్థిక, సంక్షేమ శాఖలను అడగ్గా తలోమాట చెబుతున్నారని ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు చెబుతున్నారు. ఫీజుల కోసం 2లక్షల మంది విద్యార్థులకుగానూ కాలేజీలకు ప్రభుత్వం సుమారు రూ. 13 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి విద్యార్థికి సగటున రూ. 450 అయినా చెల్లించాలని ప్రిన్సిపాళ్లు ప్రభుత్వాన్ని కోరారు. దీని ద్వారా రూ. 9కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు.

Courtesy AndhraJyothy…

Leave a Reply