వాళ్లు దయ తలిచినోళ్లకే లబ్ధి.. అధికారులు డమ్మీ

0
130
  • పథకం ఏదైనా అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు మస్ట్‌‌
  • వారికే లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు  
  • ఇప్పటికే దళిత బంధు, బుల్‌‌ బెడ్రూం ఇండ్ల లిస్టు వాళ్లే ఇస్తున్నరు
  • ఇల్లు కట్టుకునేందుకు సాయం కావాలన్నా..
  • సబ్సిడీ మోటార్‌‌ సైకిళ్లు రావాలన్నా.. దయ చూపాల్సిందే
  • ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్నచోట పార్టీ​ ఇన్​చార్జులు
  • జిల్లా ఇన్​చార్జి మంత్రికి బాధ్యతలు

హైదరాబాద్​ : రాష్ట్ర ప్రజలు స్కీముల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అమలవుతున్న ప్రతి స్కీమ్​ ఎమ్మెల్యేల చెప్పు చేతల్లో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం గైడ్​లైన్స్​ సిద్ధం చేస్తున్నది. పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను వాళ్లకు అప్పగిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించింది. ఇప్పటికే దళిత బంధు, డబుల్​ బెడ్రూం ఇండ్ల పంపిణీ మొత్తం ఎమ్మెల్యేల గుప్పిట్లోనే ఉంది. దీంతో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అనుచరులు, టీఆర్​ఎస్​ కార్యకర్తల హడావుడి మితిమీరుతున్నది. అన్ని అర్హతలున్నప్పటికీ ఎమ్మెల్యే  ‘నో’ అంటే స్కీములకు దూరం కావాల్సి వస్తున్నదని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీఆర్​ఎస్​ ఇన్​చార్జులకు, జిల్లా ఇన్​చార్జ్​ మంత్రికి స్కీముల బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎమ్మెల్యేల జోక్యం వల్ల ప్రభుత్వ పథకాలను అమలు చేయాల్సిన ఆఫీసర్లు డమ్మీలుగా మారిపోతున్నారు. ప్రతి పథకంలోనూ ఎమ్మెల్యేలు తమ అనుచరులు, అనుయాయులు, పార్టీ కార్యకర్తలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో అర్హులైన సామాన్య ప్రజలు ఎదురుచూడాల్సి వస్తున్నది.

స్కీమ్​ టార్గెట్​ మొత్తం..!
వాస్తవంగా, రాష్ట్ర సర్కార్​ ఏదైనా స్కీమ్‌‌‌‌ తెస్తే.. ఎమ్మార్వో ఆఫీసులో కానీ, ఎంపీడీవో ఆఫీసులో కానీ, కలెక్టర్​ ఆఫీస్‌‌‌‌లో కానీ దరఖాస్తు పెట్టుకోవాలి. అప్లికేషన్​ వివరాలు చూసి, ఎంక్వైరీ చేసి.. అర్హత ఉంటే సంబంధిత స్కీమ్‌‌‌‌ అర్హులకు అందేలా చేస్తారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో తీరు మారింది. రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద లబ్ధిదారుడు కావాలంటే నియోజకవర్గ ఎమ్మెల్యేను పట్టుకుంటేనే పని అవుద్ది. ఇదేదో ఒకటి, రెండు సిఫార్సుల కోసం కాదు.. ఆ స్కీమ్​ ఎంతమందికి టార్గెట్​ ఉందో అంతమందిని ఎమ్మెల్యేనే పేర్లతో పాటు లిస్ట్​ తయారు చేసి పంపాలి. అప్పుడే సర్కార్​ స్కీం అందుతది.

దీనికోసం ఆయా పథకాల కోసం అర్హులంతా  అధికార పార్టీ ఎమ్మెల్యేల చుట్టూ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట టీఆర్​ఎస్​ ఇన్​చార్జుల చుట్టన్నా, జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి చుట్టన్నా తిరగాల్సిన పరిస్థితి కనిపిస్తున్నది. మొదట్లో ఒకటి, రెండు పథకాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసినోళ్లకు ఇచ్చేటోళ్లు. ఇందులో సబ్సిడీ ట్రాక్టర్లు ప్రధానంగా ఉంది. హాస్పిటల్​బిల్లులు ఎక్కువైతే సీఎం రిలీఫ్​ ఫండ్‌‌‌‌కు ఎమ్మెల్యేలు సిఫార్సు చేస్తరు. ఇప్పుడు ఏదీ కావాలన్నా.. ఎమ్మెల్యే దగ్గరకు పోవాల్సిందే అనేలా రాష్ట్ర సర్కార్​ మిగిలిన అన్ని పథకాలకు లంకె పెడుతున్నది.

కల్యాణలక్ష్మి చెక్కులు, డబుల్​ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, ప్రస్తుత బడ్జెట్‌‌‌‌లో చెప్పిన ‘సొంత జాగా ఉన్నోళ్లు ఇండ్లు కట్టుకునేందుకు డబ్బులు ఇచ్చే’ స్కీమ్‌‌‌‌, భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే బైక్‌‌‌‌లు, ఆగ్రోస్​ సెంటర్లు, ఇండస్ట్రీ ఇన్సెంటివ్‌‌‌‌లు, ఇంకా ఇతరత్రా స్కీముల్లో లబ్ధి పొందాలంటే ఎమ్మెల్యే గ్రీన్‌‌‌‌సిగ్నల్‌‌‌‌ తప్పనిసరి. ఓవర్సీస్‌‌‌‌ స్కాలర్‌‌‌‌షిప్‌‌‌‌లు పొందాలన్నా, రేషన్‌‌‌‌ షాపులు ఏర్పాటు చేయాలన్నా.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఓకే చెప్పి తీరాలి.

కలెక్టర్లూ ఏం చేయలేరు!
రాష్ట్ర సర్కార్​ ఏదైనా స్కీం తెస్తే ఎవరికి వర్తింపజేయాలి.. ఎలా అమలు చేయాలనే దానిపై గైడ్​లైన్స్ ఇస్తుంది. దాని ప్రకారం అధికార యంత్రాంగం పనిచేస్తుంది. అయితే ఇప్పుడు గైడ్​లైన్స్‌‌‌‌లోనే లబ్ధిదారులను ఎమ్మెల్యే సెలెక్ట్​ చేస్తరని ప్రకటించేస్తున్నది. కొన్ని స్కీముల్లో లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించకున్నా, అనధికారికంగా వాళ్లు పంపిన జాబితానే ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు అందుతున్నాయి.  మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారుల లిస్ట్​ పంపిస్తుండటంతో పరిపాలన పరమైన విధులు నిర్వర్తించాల్సిన కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు,  ఇతర క్షేత్రస్థాయి ఆఫీసర్లు చేసేదేమీలేక వాటినే ఆమోదిస్తున్నారు. అన్ని అర్హతలున్నా అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోలేని జనం.. తిప్పలు పడుతున్నారు.  ఎమ్మెల్యే క్యాంప్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ల చుట్టూ వారు తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోక ఆఫీసర్ల దగ్గరికి పోతే, తమ చేతుల్లో ఏమీ లేదని ఆఫీసర్లు చెప్తున్నారు.

సొంత జాగాలో ఇల్లు కట్టుకోవాలన్నా.. 
సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ. 3 లక్షలు ఇస్తామని బడ్జెట్‌‌‌‌ ప్రసంగంలో ప్రభుత్వం చెప్పింది. నాలుగు లక్షల మందికి ఇస్తామని, ఇందులో 3.57 లక్షల ఇండ్లు ఎమ్మెల్యేల పరిధిలో ఉంటాయని పేర్కొంది. అంటే లబ్ధిదారులను ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తారని స్పష్టం చేసింది.  సబ్సిడీ మోటర్ సైకిళ్లు రావాలన్నా.. ఎమ్మెల్యేలు ఓకే చేయాల్సిందే.

కల్యాణ లక్ష్మి పథకానికీ  ఎమ్మెల్యే సంతకం
కల్యాణ లక్ష్మి స్కీమ్ ​దరఖాస్తు ఆమోదానికి ఎమ్మెల్యే సంతకం పెట్టాల్సిందే. సిగ్నేచర్ ​పెట్టి ఫైల్​ పంపిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే చెక్కు కూడా ఎమ్మెల్యే చేతుల మీదుగానే ఇవ్వాలనే రూల్​వచ్చింది. ఈ క్రమంలో కొందరి అప్లికేషన్లను అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావాలనే ఆపుతున్నట్లు  ఆరోపణలు ఉన్నాయి. నెల రోజుల్లో పూర్తి కావాల్సిన ప్రక్రియ ఎమ్మెల్యేలు టైంకు సంతకాలు చేయకపోవడంతో నాలుగైదు నెలలు పడుతున్నదని విమర్శలు వస్తున్నాయి.  వచ్చిన చెక్కులనైనా ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం పంపిణీ చేస్తే అర్హులకు ఆసరాగా ఉంటుంది. అయితే ఎమ్మెల్యేలు వారికి నచ్చిన టైంలో చెక్కుల పంపిణీ కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. దీంతో చెక్కులు ప్రింట్​ అయి వచ్చిన నెల, రెండు నెలలు ఆఫీసుల్లో మూలుగుతున్నాయి.

ఎమ్మెల్యే చెప్పిన వారికే ఇండ్లు
ఏడేండ్ల నుంచి ఊరిస్తూ వస్తున్న డబుల్​ బెడ్రూం ఇండ్ల పంపిణీకి మొదట్లో ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించిన సర్కార్..​ ఎమ్మార్వో ఆఫీసుల దగ్గర అప్లికేషన్లు తీసుకున్నది. మరికొన్ని ఆన్​లైన్​లో స్వీకరించింది. ఆ తర్వాత అవన్నీ పక్కన పడేసి.. పూర్తి చేసిన ఆ కొన్ని ఇండ్లను కూడా ఎమ్మెల్యేలు ఎవరెవరి పేర్లు చెప్తున్నారో వాళ్లకే కలెక్టర్లు కేటాయిస్తున్నరు. ‘ఎప్పుడో అప్లికేషన్​ పెట్టుకున్నం.. కలెక్టర్​ ఆఫీసులో ఇచ్చినం.. మాకెప్పుడు ఇల్లు వస్తది?’ అని ఆఫీసర్ల దగ్గరకు అర్హులు వెళ్తే.. తమ చేతిలో ఏం లేదని, ఎమ్మెల్యే చెప్తే చేస్తమనే సమాధానం ఆఫీసర్ల నుంచి వస్తున్నది. దీంతో అర్హులు స్థానిక ఎమ్మెల్యే ఇంటికి రెండు, మూడు రోజులకోసారి తిరగాల్సి వస్తున్నది.

దళితబంధు బాధ్యతలు తొలుత కలెక్టర్లకని చెప్పి..!
దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన మొదట్లో లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేస్తే అక్రమాలకు చాన్స్‌‌ ఉండదని అనుకున్నారు. అయితే, స్కీమ్​ ప్రారంభ దశలోనే సర్కారు.. ఆ బాధ్యతను ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టింది. ఇన్‌‌చార్జ్​ మంత్రి, ఎమ్మెల్యేలు ఇచ్చే లిస్టును కలెక్టర్లు ఫైనల్‌‌ చేయాల్సి ఉంటుంది. స్కీమ్‌‌కు దరఖాస్తు చేసే పద్ధతిలో మార్పు రావడంతో అర్హులు ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కనీసం ఆ అప్లికేషన్లను కూడా పరిశీలించకుండా, తమ పార్టీ కార్యకర్తల్లో ఉన్న దళితుల పేర్లతో సిద్ధం చేసిన జాబితానే కలెక్టర్లకు పంపుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి వంద మందికి చొప్పున దళితబంధు ఇస్తున్నారు. ఆ జాబితాలో తమ పేరు ఉంటుందా అని ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్తే  అక్కడికి అప్లికేషన్లు పెట్టుకున్న సామాన్యులు వెళ్లి ఎదురుచూస్తున్నారు.

అనుచరులదే హంగామా
వివిధ  స్కీములకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో ఆ ఎమ్మెల్యేల అనుచరులు రంగంలోకి దిగుతున్నారు. ఎంతోకొంత ఇస్తే.. ఎమ్మెల్యేకు చెప్పి లిస్ట్​లో పేరు నమోదు చేయిస్తామని లబ్ధిదారులతో బేరసారాలు ఆడుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు కూడా వారికి అనుకూలంగా ఉన్న వారి పేర్లను, ముఖ్యంగా టీఆర్​ఎస్​ నేతలు, కార్యకర్తల పేర్లనే ఫస్ట్​ సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకవైపు ‘‘దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు”అంటూ చెప్తున్న రాష్ట్ర సర్కార్.. మరోవైపు స్కీముల బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించడంతో  లబ్ధిదారులకు అన్యాయం జరుగుతున్నదన్న విమర్శలు వస్తున్నాయి.  రేషన్ షాపులు, అంగన్ వాడీ టీచర్ల నియామకం వంటి లోకల్​గా ఉండే ప్రతిదాంట్లోనూ ఎమ్మెల్యేల జోక్యం పెరిగిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి.

చట్ట వ్యతిరేకం
ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేసే అధికారాన్ని ఎమ్మెల్యేలకు కట్టబెట్టడం చట్ట వ్యతిరేకం. రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యేలు ప్రజా సేవకులు మాత్రమే. అర్హులను ఎంపిక చేసే బాధ్యత అధికారులదే. ఇది ప్రజాస్వామ్యం. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి రాజులు కాదు. ప్రజల ఆస్తులకు ట్రస్టీలు మాత్రమే. కానీ అన్ని స్కీములను ఎమ్మెల్యేలకు అప్పగించడమంటే అనధికారికంగా అధికార పార్టీ నాయకులను దోచుకోండని చెప్పడమే అవుతుంది. మోహన్ లాల్, హైకోర్టు అడ్వకేట్

Courtesy V6velugu

Leave a Reply