చేనేతకు మరణశాసనం

0
608

– ఆకారపు మల్లేశం

జీఎస్‌టీ పెంపుదల అశనిపాతం

‘చేనేత వృత్తి భారతదేశంలోని వైవిధ్యాన్ని, హస్తకళా నైపుణ్యాన్ని చాటుతోంది. స్వదేశీ కళలను సంరక్షించేందుకు ఆ వృత్తిదారులు ప్రశంసనీయమైన కృషి చేస్తున్నారు. చేనేత ఉత్పత్తులకు సంపూర్ణంగా మద్దతునిద్దాం. చేనేతకు చేయూతనిస్తూ ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా ప్రయత్నాలను బలోపేతం చేద్దాం’ అంటూ ఈ ఏడాది ఆగస్టు ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సందేశం ఇచ్చారు. నాలుగు నెలలు గడవక ముందే కేంద్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసే, నేతన్నల వెన్ను విరిచే నిర్ణయం తీసుకుంది. చేనేత, జౌళి పరిశ్రమలపై ప్రస్తుతం అయిదు శాతంగా ఉన్న జీఎస్‌టీని రాబోయే జనవరి ఒకటి నుంచి ఏకంగా 12శాతానికి పెంచేందుకు పచ్చజెండా ఊపింది. ఇప్పటికే సవాలక్ష సమస్యలకు తోడు కరోనా వంటి విపత్కర పరిస్థితులతో అవసాన దశలో ఉన్న చేనేత రంగానికి ఈ నిర్ణయం మరణశాసనమే.

చేయూత కరవు
శతాబ్దాల చరిత్ర కలిగిన చేనేత రంగం మానవ కనీస అవసరాల్లో ఒకటైన వస్త్రాలను తయారు చేసి అందిస్తోంది. స్వాతంత్య్ర ఉద్యమ దీపికగానూ చేనేత రాట్నం నిలిచింది. అన్ని వృత్తుల మాదిరిగానే ఆధునికీకరణ చేనేతను దెబ్బతీసినప్పటికీ ఆనవాళ్లను చాటుకుంటూ ఆ వృత్తి సాగుతోంది. చైనా వంటి దేశాల్లో పరిశ్రమల హోదాతో హస్తకళలు మనుగడను నిలుపుకొంటున్నాయి. భారత్‌లో ప్రభుత్వాల ఉపేక్ష కారణంగా ఆ రంగానికి సరైన ఊతం లభించలేదు. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి దేశవ్యాప్తంగా అయిదు కోట్లకు పైగా కుటుంబాలు చేనేతను నమ్ముకొని జీవనం సాగిస్తుండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 30.44 లక్షలకు పడిపోయింది. 2011 లెక్కల ప్రకారం దేశంలో 43.3 లక్షల చేనేత కుటుంబాలు ఉన్నాయి. పదేళ్లలోనే దాదాపు 13 లక్షల కుటుంబాలు ఆ వృత్తికి దూరమయ్యాయి. చేనేత రంగంలో సుమారు 70శాతం బలహీనవర్గాలు ఉన్నారు. వారిలో 42శాతం మహిళలే. 67శాతం కుటుంబాల నెలవారీ ఆదాయం అయిదు వేల రూపాయలకన్నా తక్కువ. మొత్తంగా 93శాతం కుటుంబాల ఆదాయం నెలకు పదివేల రూపాయలకు మించడం లేదు. తమ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్‌ సదుపాయాలు లేక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దానికితోడు రంగులు రసాయనాల కారణంగా, గుంట మగ్గాల్లో నేయడం వల్ల అనారోగ్య సమస్యలు ముమ్మరిస్తున్నాయి. కరోనా మహమ్మారి చేనేత కార్మికుల ఉపాధిని తీవ్రంగా దెబ్బతీసింది.

చేనేత, జౌళి రంగాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. చేనేత రంగానికి దశాబ్దాలుగా నిధుల పరంగా తగిన ప్రాధాన్యం లేదు. గడిచిన దశాబ్ద కాలంలో 28 చేనేత పథకాలు రద్దయ్యాయి. ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతను సైతం వ్యాపార పరంగానే గుర్తించింది. 2017లోనే దానిపై 12శాతం జీఎస్‌టీ మోపడం అందరినీ విస్మయపరిచింది. దేశవ్యాప్తంగా ఆందోళనల ఫలితంగా దాన్ని అయిదు శాతానికి తగ్గించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ప్రభుత్వరంగ సంస్థల మూసివేత, విక్రయాలను చేపట్టిన కేంద్రం- గతేడాది జులైలో అఖిల భారత చేనేత మండలి(బోర్డు)ని సైతం రద్దు చేసింది. ఆ తరవాత జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్‌ను కుదించింది. తాజాగా జీఎస్‌టీ పెంపు నిర్ణయం చేనేత రంగాన్ని నివ్వెరపరిచింది. ఇప్పటికే అయిదుశాతం ఉన్న జీఎస్‌టీ వల్ల ఆ రంగం ఎంతగానో నష్టపోయింది. చేనేత వస్త్రాల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఉత్పత్తులూ పడిపోయాయి. చేనేత రంగంలో ఉన్న లాభదాయకత అయిదు శాతం కంటే తక్కువకు కుంచించుకుపోయింది. కేవలం వ్యాపార సంస్థలు మినహా చీరలు, ఇతర వస్త్రాలను నేతన్నల వద్దనుంచి ఇతరులెవరూ కొనే పరిస్థితి లేదు.

ఇదా ప్రోత్సాహం?
చేనేతకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. వృత్తి, సేవారంగంగా చేనేతను పాలకులు ప్రోత్సహించాలి. దానికి పరిశ్రమ హోదా ఇచ్చి రాయితీలు, ప్రోత్సాహకాలను అందించాలి. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకాన్ని తెచ్చినప్పటికీ చేనేతకు, చిన్న జౌళి పరిశ్రమలకు ఒరిగిందేమీ లేదు. రంగులు, రసాయనాలు, నూలు ధరలు గతేడాది 30 నుంచి 40శాతందాకా పెరిగాయి. ఇంధన ధరల పెంపువల్ల రవాణా ఖర్చులు సైతం అధికమయ్యాయి. కరోనా తరవాత బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. భారీ పెట్టుబడులు పెట్టే సంస్థలకే రాయితీలు లభిస్తున్నాయి. రాష్ట్రాల సంగతి అటుంచితే కేంద్రం నుంచి చేనేత కార్మికులకోసం సమర్థ పథకం ఒక్కటీ ఆసరాగా నిలవడంలేదు. ఇప్పుడు జీఎస్‌టీని 12శాతానికి పెంచడంవల్ల చేనేతకు, జౌళిరంగంలోని చిన్న పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. చేతికష్టంతో ఎంతో కళాత్మకంగా రూపొందించే చేనేత వస్త్రాల ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే వాటి కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో ఉండటంలేదు. జీఎస్‌టీ భారం వల్ల అవి మరింత ప్రియమవుతాయి. ఫలితంగా వినియోగదారులు చేనేత వస్త్రాలను కాదని మరమగ్గాలపై రూపొందించే దుస్తులవైపు మొగ్గుచూపుతారు. దానివల్ల విక్రయాలు తగ్గి చేనేత ఉత్పత్తులకు మరింత గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి. నేత కార్మిక కుటుంబాలకు ఉపాధి కరవై ఇంటిల్లపాదీ పస్తులతో మాడిపోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. తెలంగాణ, తమిళనాడు, ఒడిశావంటి రాష్ట్రాలు చేనేతరంగ అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సాయం అందడం లేదు. తెలంగాణ రాష్ట్ర చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీ రామారావు జీఎస్‌టీ దుష్పరిణామాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ సరైన స్పందన కరవైంది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం జీఎస్‌టీ భారం వద్దని కోరుతున్నాయి. దాని విధింపు వల్ల చేనేత వస్త్రాలను సైతం నల్లబజారులో విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. చేనేత రంగానికి సంబంధించి కేంద్రం క్షేత్రస్థాయి పరిస్థితులను అవగతం చేసుకోవాలి. వ్యవసాయం తరవాత అత్యధిక శాతం ప్రజలకు ఉపాధి కల్పించే చేనేత ఉత్పత్తులపై పన్నును తగ్గించాలి. జౌళిరంగంలోనూ సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ఈ భారం నుంచి మినహాయించాల్సిన అవసరం ఉంది. చేనేతను కాపాడుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని సత్వరం ప్రకటించాలి.

Courtesy Eenadu

Leave a Reply